Tuesday, 29 May 2018

మరణం తర్వాత మరెన్నో జీవితాలు

మరణాన్ని గెలవలనుకుంటున్నారా?
లేదు మరణం తర్వాత మళ్లీ
జీవించాలని ఆశిస్తున్నారా?
అయితే మీకున్నది ఒకే ఒక మార్గం
అదే
అవయవ దానం


మనిషి మరణానంతరం కళ్ళు, గుండె,
ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, 
జీర్ణ వ్యవస్థలోని ఫ్రాంకియాస్, 
చిన్న, పెద్ద ప్రేవులు, గుండె కవాటాలు, చర్మం,
ఎముకలు, నరాలు తదితర అవయవాలన్నీ
అవయవ మార్పిడీకి దానం చేయవచ్చు. 


అలా సేకరించిన వాటితో మరణం అంచున ఉన్న 
8 నుండి 10 మందికి ప్రాణ దానం చేయచ్చు 
ఇంకా మరో 50 మందికి కావలసిన అవయవాలను అందించి 
వారి జీవన విధానాన్ని మెరుగుపరచవచ్చు.
బ్రతికి ఉన్న దాత కూడా అవయవ దానం చేయవచ్చు 
తన జీవితంలో ఒకవ్యక్తి 
ఒక మూత్రపిండంను, క్లోమం యొక్క భాగంను,
మరియు కాలేయం యొక్క కొంత భాగంను దానం చేయవచ్చు. 
కానీ బతికి ఉన్నపుడు కుటుంబ సభ్యులు, 
రక్త సంబంధీకులకు మాత్రమే అవయవ దానం చేయవచ్చు.


ప్రంపంచంలోనే అత్యధికంగా స్పెయిన్లో  10లక్షలకు 34మంది, 
అమెరికాలో 26మంది అవయవ దానం చేస్తుండగా 
మన దేశంలో మాత్రం 0.8 మంది మాత్రమే 
అవయవ దాతలుగా ఉన్నారు.
మనదేశంలో నిరక్షరాస్యత, పేదరికం 
అమాయకత్వం, మూఢ నమ్మకాల కారణంగా 
దీనిపట్ల అవగాహన చాలా తక్కువ. 
ప్రభుత్వం, మీడియాఈ దిశగా ప్రజలను చైతన్యపరిస్తే 
ఎక్కువ మందిని అవయవ దానం వైపు మళ్లించవచ్చు. 
ఇప్పుడిప్పుడే ఆదిశగా అడుగులు పడుతున్నాయి.
హిందూ పురాణాల ప్రకారం మొదటి అవయవ మార్పిడి 
వినాయకుడికి జరిగింది. ఇక ఆధునిక వైద్య చరిత్రలో 1905 లో 
కార్నియల్ ట్రాన్స్ ప్లాంటేషన్ తో మొదలైంది.

అవయవదానానికి 10 ఏళ్ళ వయసు నుండి 90 ఏళ్ళ
వయసు వారెవరైనా అర్హులే.
దేశవ్యాప్తంగా అవయవాల దానం
కోసం ఏటా 5 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. 
వీరందరికోసం రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ కేసుల పైననే 
ఎక్కువగా ఆధార పడవలసి వస్తోంది. 
సాధారణ మరణాలప్పుడు కూడా 
అవయవ దానం జరిగితే  కొంత కొరత తీరినట్టే.
అవయవ దానం చేసినవారి కుటుంబాల్లో పిల్లలకు 
మోహన్ బాబు తమ విద్యాసంస్థల్లో 
5వ తరగతి నుంచి పీజీ వరకూ ఉచిత విద్యను అందిస్తానని
2015 లో ప్రకటించి తన సామాజిక బాధ్యత ను నిర్వర్తిస్తున్నారు. 
అలాగే ప్రతిఒక్కరు అవయవ దానాన్ని  ఒక బాధ్యతగా స్వీకరిస్తే 
ఏటా జరుగుతున్న 5లక్షల మరణాలలో కొన్నింటినైనా ఆపవచ్చు.



అవయవ దానం చేయాలనుకునే వారు ఈ క్రింది లంకె పై క్లిక్ చేయండి
 Link  👉 ( మరణం తర్వాత నాకు మరో జీవితం కావాలి  )

Tuesday, 17 April 2018

మెట్రో రైలు

మొన్నామధ్య ఒకసారి  హైదరాబాద్ వెళ్ళినప్పుడు మెట్రో రైలు ఎక్కాలని అనుకున్నాను.
అప్పటికి ప్రారంభమై ఓ పది రోజులు అయిఉండొచ్చు.
విపరీతమైన రద్దీ కారణంచేత కుదరలేదు.
ఎందుకంటే ముఖ్యమైన పనులు చాల ఉన్నాయి.
వరంగల్లో బయల్దేరి ఉప్పల్ రింగ్ రోడ్ లో దిగితే
మెట్రో కంటే ముందే నేను వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళొచ్చు.
అయినా దాంట్లో ఎక్కాలంటే సవాలక్ష రూల్స్ ఉంటాయని
గతంలో పేపర్లో చదివాను కాబట్టి అటువైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను.
ఎందుకంటే టికెట్ తీసుకొని రైలెక్కడం తెలుసు
రెండు టోకెన్లు తీసుకొని ఎక్కినచోట ఒకటి దిగినచోట ఒకటి ఇవ్వాలట.
స్టేషన్ లో కూడా టైం ప్రకారమే ఉండాలట.
అదికూడా చాలా పద్దతిగా ఉండాలట.
ట్రైన్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదట.
సేల్ఫీలు దిగ కూడదు అంటూ
ఇలా సవాలక్ష.
ఈ గొడవంతానాకెందుకులే అని ఊరుకున్నా.
తర్వాత
హైదరాబాద్ మిత్రులు  ఒకసారి ఫోన్ చేసి
వచ్చినపుడు కలవనే లేదు. ఈసారి వచ్చినపుడు రారా
అలా మెట్రో ఎక్కుదువుగాని  అన్నారు
ఎందుకులేరా అన్నాన్నేను
ఏరా అన్నారు
నాకున్న భయాలు చెపితే నవ్వి ఊరుకున్నారు.
కాని వాళ్ళు మెట్రో దగ్గర దిగిన ఫోటోలు వాట్సప్ లో పంపినప్పుడు
అర్థం అయింది పెద్దగ జనం లేరు కాబట్టి నిబంధనలు ఎత్తేసారేమో అని.
అట్లయితే ఈసారి వెళ్ళినపుడు నేనుకూడా ఎక్కాలి అనుకున్నా..
అయినా ఎవరో ఒక ఫ్రెండ్ ను వెంటబెట్టుకొనే ఎక్కాలె..

స్నేహం

ఈమధ్య నన్ను చాలా  బాధ పెట్టిన విషయం
నా ఇద్దరు  మిత్రుల  మరణం.
మిత్రులంటే .... బాల్యమిత్రులు  ..
ఒకరేమో తిరుపతి రెడ్డి (హనుమకొండ)
ఇంకొకరేమో  పేరు సత్తిబాబు.
విశాఖ జిల్లా పాడేరు, అరకు వ్యాలీ  దగ్గర చిన్న వూరు మఠం.
కానీ చదివింది  వరంగల్ దగ్గరలోని ఓకే రెసిడెన్షియల్ స్కూల్ లో.(1986-90)

10వ తరగతి తర్వాత నేను కాలేజ్ హైదరాబాదు లో చేస్తే
సత్తిబాబు  పాడేరు లో చేసాడు. 
మేము విడిపోయిన తర్వాత
కొన్ని సంవత్సరాలు ఉత్తరాలు వ్రాసుకునేవాల్లం. 
కానీ 1997  సం నుండి ఆగి పోయాయి.
కానీ ఈమధ్య మళ్లీ తనను కలవాలి లేదా
కనీసం  మాట్లాడాలని అనిపించింది.
ఎలా? లెటర్ వ్రాస్తే తిరిగి వస్తున్నాయి. 
కానీ వాడితో  ఎలాగైనా మాట్లాడాలనే బలీయమైన  కోరికతో
ఒకసారి వైజాగ్ వెళ్లి రావాలని నేను ఇంకో మిత్రుడు ప్లాన్ చేసుకున్నాం.
కాని చివరి నిమిషంలో రద్దైంది.
ఇక కథ మళ్ళీ మొదటికొచ్చింది.
అప్పుడు ఒక్క ఐడియా వాడితో మాట్లాడేలా చేసింది.
అది google సెర్చ్ తో సాధ్యం అయింది.
నేను ఉత్తరాలు రాసేవాడ్ని కాబట్టి ఆ రూట్లోనే ప్రయత్నం చేశా.
ఫలించింది.
మొదట పాడేరు పోస్ట్ ఆఫీస్ నంబరు సెర్చ్ చేశా ,
నాలుగు నంబర్లు వచ్చాయి.
అందులో రెండు పనిచేయటంలేదు,
ఒకటి చాలాసేపు ఎంగేజ్ వచ్చింది.
ఇక చివరి నంబర్ ...
కలుస్తుందా లేదా ??
చూద్దాం కలవకపోతే ఇంకేదైనా మార్గం చూడాలి
అనుకుంటూనే చేశా . అవతల ఫోన్ లిఫ్ట్ చేయగానే
ఒక్కసారి పట్టలేని సంతోషం.
వరంగల్ నుంచి మాట్లాడుతున్నా అనటంతో
కొంచం ఆసక్తిగా ఏంకావాలి అని అడిగారు.
మఠం పోస్ట్ ఆఫీస్ ఫోన్ నంబర్ కావాలి అన్నాను.
మాదగ్గర లేదు అని సమాధానం వచ్చింది.
25సంవత్సరాల క్రితం నేను, నా మిత్రుడు కలసి
చదువుకున్నదీ , అన్నీ వివరించా.
మాస్టారూ అని ఎవరినో  పిలుస్తూ నన్ను కాసేపాగి ఫోన్ చేయమన్నాడు.
కాని 10 నిమిషాల్లో తనే చేసి మా దగ్గర లేదు
కాని హుకుంపేట నంబర్ ఇస్తాను అక్కడ అడగండి అన్నాడు.
వెంటనే నంబర్ తీసుకుని ఫోన్ చేశా.
మఠం ఫోన్ నెంబర్ అడగ్గానే ఎందుకు అని ప్రశ్న.
విషయం వివరించగానే ఆశ్చర్యపోయి ఒక్క నిమిషం ఉండండి
మఠం పోస్ట్ మాస్టర్ ఇక్కడే ఉన్నాడు అని ఎవరినో
పంపించాడు తీసుకురమ్మని. తిరిగి వచ్చిన అతను వెళ్లిపోయాడని
చెప్పటంతో నాకు నంబెర్ ఇస్తూ ఫోన్ సరిగా కలవదు
సిగ్నల్  ప్రాబ్లం  చేస్తూ ఉండండి అని చెప్పటంతో
సందేహిస్తూనే ఫోన్ చేశా కలవలేదు.
వెంటనే ఒక ఐడియా తట్టింది.
కాల్ బ్యాక్  చేయమని మెసేజ్ పెట్టి
డెలివరీ రిపోర్ట్ ఆన్ చేసి పెట్టాను.
ఒక గంటకు మెసేజ్ చేరినట్టుగా రెప్లై
రావటంతో నేనే ఫోన్ చేశా.
అతనికీ విషయం వివరించటంతో  తను మా బంధువే
కాని దూరంగా ఉంటారు సాయంత్రం మాట్లాడిస్తాను అనటంతో
ఎదురు చూస్తూ ఉన్నా.
 సాయంత్రం ఆరు గంటలప్పుడు ఫోన్ వచ్చింది .
మాట్లాడాను ...
వాడే..
దాదాపు  ఇరవై ఏడు  సంవత్సరాల తర్వాత
 ఆ గొంతు విన్న ఎంతో ఆనందంతో మాట్లాడా.
వాడు మాత్రం ఏడ్చాడు,, అవును
సంతోషం లోను కష్టంలోనూ కూడా కళ్ళువర్షిస్తాయి 
కానీభేదం ఒక్కటే  ఆనందాశ్రువులు కన్ను దాటి బయటకు రావు
కన్నీళ్లు కంట్లో ఆగనూలేవు 
ఇన్ని రోజుల తర్వాత మాట్లాడిన సంతోషం
ఎన్నో రోజులు నిలవదని అప్పుడు ఊహించలేదు ..
తర్వాత ఒక నెలలోపే వాడు హైపటైటిస్ బారిన పడి మరణించాడు
అదీ మేము ఫోన్ చేస్తే వాడి అబ్బాయి చెప్పే దాక తెలియలేదు.
ఇరవైసంవత్సరాలుగా లేనిది
వాడితో మాట్లాడాలని ఎందుకు అనిపించిందో కదా...
కేవలం ఈ దుర్వార్త వినడానికేనా ...

ఇక తిరుపతిరెడ్డి కూడా ఒకే స్కూల్
తను చాలా పెద్ద కాంట్రాక్టర్
ఎప్పుడు ఫోన్ చేసినా చాలా కూల్ గా మాట్లాడేవాడు
స్కూల్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు
ఫోన్ చేస్తే ఎక్కువగా మాట్లాడేవాడు
కాని చిన్నప్పటి అందరి మిత్రుల గురించి మాత్రం
తప్పక అడిగి తెలుసుకొనేవాడు
అందరూ లైఫ్ లో సెటిల్ అయ్యారా అని అడిగేవాడు.
ఎప్పుడూ ఎదో బిజీగా ఉండేవాడు
కానీ ఎప్పుడు కూడా అలా మాట్లాడే వాడు కాదు.
అందరం ఒకసారి కలుద్దాం
నేనే అన్నీ అరేంజ్ చేస్తాను వచ్చేయండి అనేవాడు.
ఉద్యోగాలు వ్యాపారాల్లో ఉంది అందరం కలవలేకపోయేవాళ్ళం .
ఎవరికీ ఏ సహాయం అవసరమైనా వెంటనే ఫోన్ చేయమనేవాడు.
మనసారా వీడు నా స్నేహితుడు అని గర్వంగా చెప్పుకోవడంలో 
ఏదో తెలియని దర్పం కనిపించేది 
కొన్నిరోజుల క్రితం వాడికి కాన్సర్ వచ్చింది అని తెలియగానే
అందరం వెళ్లి కలవాలనుకున్నాం.
కాని ఒకరోజు ఉదయాన నా  మొబైల్ కి ఒక మేసేజ్ వచ్చింది
ఇక లేడని....
మేము వెళ్ళే లోపే వాడు వెళ్లిపోతాడనుకోలేదు.
ఇందుకేనా వాడు అందరమూ ఒకసారి కలుద్దామని అన్నది
మాకు అర్థం కాలేదురా సారీ.....
అప్పుడు మరొక్కసారి అనిపించింది.

సంతోషం లోను బాధ లోనూ కళ్ళువర్షిస్తాయి 
కానీభేదం ఒక్కటే  ఆనందాశ్రువులు కన్ను దాటి బయటకు రావు
కన్నీళ్లు కంట్లో ఆగనూలేవు 

కులమతాలు, వేషభాషలు, ప్రాంతీయ బేధాలకు అతీతంగా అంకురించే సౌరభమే స్నేహం.
మంచిని, చెడుని గమనిస్తూ... అవసరమైనప్పుడు మందలిస్తూ మలగడం మనసెరిగిన మిత్రుడికే సాధ్యం.

Monday, 9 April 2018

సెలవులు

సెలవు!
ఈ మాట వింటేనే చెవిలో అమృతం పోసినట్టుగా ఉంటుంది చాలా మందికి.
ఇక పిల్లలకో.. వేసవి సెలవులంటే......ఎంత సంతోషం
స్కూల్, ట్యూషన్, హోంవర్క్ అన్నీ బంద్.




చిన్నప్పుడైతే ఎంత సరదాగా ఉండేదో,
వేసవి సెలవులు వచ్చాయంటే చాలు
మా వయసు పిల్లలతో ఇల్లంతా నిండిపోయేది.
ఒకటే అల్లరి
పొద్దున్న పొతే ఏ వేప చెట్టుకిందో చింత చెట్టుకిందో మా అడ్రస్
గోలీలాట, చిర్రగోనే ,పల్లీ, పొద్దున్న పొతే సాయంత్రందాక
ఇక ఇంటికి వచ్చేది పొద్దుగూకినంకనే.

తాటి ముంజలు, ఈతకాయలు వాటికోసం పాట్లు చెప్పనవసరమే లేదు
సీమ చింతకాయలు సరేసరి.

అప్పుడప్పుడు చింతపండు గింజ తీయటం, సాయంత్రం ఐతే
ఊరి చెరువు దగ్గర ఉన్న బావి నుండి బిందెల కొద్దీ నీళ్ళు తేవడం
సరదాగా గడిచిపోయేది.

కాని ఇప్పుడు పిల్లల్ని ఆడుకోనిచ్చే తల్లితండ్రులు ఎంతమంది ఉన్నారు.
చదవాలి, ఇంకాచదవాలి లేదంటే సమ్మర్ క్యాంపుల్లో ఎదో ఒకటి నేర్చుకోవాలి.


వేసవి = ఆహ్లాదకరమైన ఉదయాలు + విసుగెత్తించే మధ్యాహ్నాలు + ఫర్వాలేదనిపించే సాయంత్రాలు + టన్నులకొద్దీ మామిడికాయలు + గ్యాలన్ల కొద్దీ కొబ్బరి నీళ్లు +  గంటలకొద్దీ ఆటలు ముందే ఊహించిన ఊహించని బంధువులు అని ఎక్కడో చదివిన గుర్తు 

పైన నేను రాసిందంతా మీకు కూడా ఖచ్చితంగా చిన్నప్పుడు ఎప్పుడోకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటుంది కదా 
ఐతే కామెంట్ రాయండి 

Wednesday, 21 March 2018

భూమ్మీద నూకలు చెల్లకుండా ఉండాలంటే

ఎపుడైనా కొత్త వాళ్ళు కాని, చాల రోజుల తర్వాత కలిసిన మిత్రులుకాని
నన్ను, పిల్లల్ని ఒక్క చోట చూస్తే మాత్రం ఆశ్చర్య పోతుంటారు.
నలభై దాటినా ఇరవై లాగే పిల్లలతో సమానంగా ఉన్నావు అంటారు.
మా ఫ్రెండ్స్ నన్ను తరచుగా అడిగే మాట కూడా ఇదే
ఎలా ఇంత బాగా  fitness మేంటైన్ చేస్తున్నావు అని.
ఆ రహస్యం ఏంటో మాకూ చెప్పకూడదు అంటుంటారు.
నేను మాత్రం తలకు రంగు వేసుకోకపోతే 
వీళ్ళే నన్ను ముసలోడివైపోయావురోయ్ 
అనేవాళ్ళని నవ్వుకునేవాడిని. నేను కూడా 
రెండు మూడేళ్ళ క్రితం వరకు జుట్టుకు రంగు వేసేవాడినే కాదు.
అలా వేసుకొని ఒకసారి మా అమ్మాయి వాళ్ళ కాలేజికి వెళ్తే 
అక్కడ స్టాఫ్ నన్ను పేరెంట్ అంటే నమ్మనే లేదు.
ఇక పిల్లలైతే వెళ్లి మీ అన్నయ్యోచ్చాడు అని చెప్పటంతో 
మా అమ్మాయీ నవ్వుకుంది. అప్పుడు రంగు వేసుకోవటం మానేస్తే... 
మరీ వెంట్రుకలు తెల్లబడిపోయాయని ఈ మధ్యే మళ్ళీ మొదలెట్టాను.

ఇక టాపిక్ లోకి వస్తే...
ఎవరైనా చనిపోతే
భూమ్మీద నూకలు చెల్లిపోయాయి అనటం మనం చూస్తుంటాం.
అసలు అర్థం అంతా అందులోనే ఉంది.
మనం తక్కువగా తిని ఎక్కువరోజులు బతుకొచ్చు అని.-
సాధారణంగా ఎక్కువ పని చేసే  ఒక మనిషికి శాస్త్రీయంగా 
రోజుకి 2000 క్యాలరీల శక్తికితగ్గ ఆహార పదార్ధాలు కావాలి . 
దానిని 1200 లకో, 1300 లకో తగ్గించుకుంటే ఎక్కువకాలం బ్రతకొచ్చట. 
అలా తగ్గించాలంటే జివ్హచాపల్యం చంపుకోలేని వాళ్ళు ఎన్నో 
 కష్టాలు పడాలి మరి. నలభై ఏళ్ళు వచ్చిన తరువాత
మన శరీర జీవక్రియల వేగం తక్కువవుతుంది కాబట్టి వ్యాయామం తో పాటు
క్యాలరీలు తగ్గించాలి మరి. యుక్తవయస్సు లో ఉన్నప్పుడు రాల్లైన 
అరిగించుకోవచ్చు అని కొసరి కొసరి వడ్డించే వాళ్ళనిప్రేమతో 
ఏమి అనకపోయినా నలభై దాటాక మాత్రం 
నిర్మొహమాటంగా వద్దని చెప్పాల్సిందే. అథవా తిన్నా ఎదో ఒక వ్యాయామం 
చేసి తిన్నది కాస్తా కొవ్వుగా మారక  ముందే  కరిగించాల్సిందే.
ఇది చదివాక కూడా మీరు మారలేదనుకోండి నేనేమీ చేయలేను 
నాలా షాపులో కూర్చునేవాడికి, సాఫ్టువేరు వాళ్లకు, కుర్చీ లోంచి లేవకుండా పని
చేసుకోనేవాల్లకు  రోజుకి 1500-1700 కాలరీలు అవసరం
ఇక మీ మీ అవసరాల ద్రష్ట్యా మీకు ఎంత అవసరమో తినండి .
నా మట్టుకు నేను  మాత్రం తినేదేదైన 1200-1500 కాలరీల వరకు ఉండేలా
 కూరలు ఎక్కువగాను అన్నం తక్కువగాను అదీ కూడా మూడు పూటలు
తినేలా ప్లాన్ చేసుకున్నాను.  ఇక మీరు కూడా  మీకోసం
 దేవుడిచ్చిన నూకలు పొదుపుగా వాడుకొంటే ఎక్కువ రోజులు  ఫిట్ గా బతకొచ్చు.
(తక్కువ తినేవారే ఎక్కువ కాలం బ్రతుకుతారని శాస్త్రీయంగా ధ్రువీకరింపబడింది)

Tuesday, 6 March 2018

నాకో తుపాకీ కావాలి


స్త్రీ గౌరవాన్ని మలినం చేస్తూ స్శర్శించే ఒక మగవాడి దురహంకారాన్ని 
సమాజంలోంచి చంపేసి, తుదముట్టించే తుపాకి కావాలి . 

అభంశుభం తెలియని  బాలల జీవితాలను చిద్రం చేసే కర్కోటకులను కడతేర్చే తుపాకీ కావాలి.

కోట్లాది అమాయక ప్రజల  జీవితాలని బలి తీసుకుంటున్న 
ఉగ్రమూలాల్ని  సమూలంగా పెకిలించే  తుపాకి కావాలి .

చట్టాలను అతిక్రమించే చుట్టాలను తుదముట్టించే తుపాకీ కావాలి. 

ఆర్టిక అసమానతలను పెంచుతున్న విధానాలని నిషేధించే తుపాకీ కావాలి.

మతం పేరుతొ జనం ప్రాణాల్ని హరిస్తున్న మూర్ఖులను  నిలువరించే తుపాకీ కావాలి.

ఆ తుపాకి మోత వింటే చాలు ఎవరైనా తప్పు చేయాలంటేనే భయపడాలి .

అటువంటి ఒక తుపాకి నాకు కావాలి 

"ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే "

అన్న మాట మరిచిన ఓ గోపాల....
 
నీ పాంచజన్యాన్ని తుపాకిగా నాకందించు!

కృత, త్రేత, ద్వాపర యుగాలను మించిన స్వర్ణ యుగాన్ని నేనీ ప్రపంచానికందిస్తా.



Tuesday, 27 February 2018

పెళ్లి లాంటి నిశ్చితార్ధం


నా చిన్నప్పుడు నిశ్చితార్ధం అంటే 
ఓ పది మంది మగ పెళ్లి వాళ్ళు వచ్చి అమ్మాయి మెళ్ళో 
ఎదో ఒక నగ వేసి, బట్టలు, "పూలు పండ్లు" పెట్టి వెళ్ళేవారు.
ఆడపెళ్ళి వాళ్ళు సైతం ఓ పదిమంది వెళ్లి వరునికి 
ఏ సైకిలో గడియారమో ముట్టజెప్పి కాసిన్ని డబ్బులతో "వరపూజ" చేసెటోల్లు.
అదికూడా కాస్త పెళ్ళికి ఎక్కువ సమయం ఉంటేనే.
అదీ లేకుంటే ఇంకాస్త చిన్నగానే చేసేవాళ్ళు.
అప్పుడే లగ్నపత్రికలు రాయించుకొని మార్చుకోనేవాళ్ళు. 
అంతే అంతటితో నిశ్చితార్థం అయిపోయినట్టే.

కాని ఈమధ్యకాలంలో 
పెళ్ళికి నిశ్చితార్దానికి పెద్దగా తేడా ఉండడంలేదు
పెళ్ళికి వచినంత చుట్టాలు, హంగు ఆర్భాటాలు
ఉంటున్నాయి.
జిలకర బెల్లం, తాళిబొట్టు తప్పించి అన్నీ ఉంటున్నాయి.
దాదాపు పెళ్లి లాగాఆర్భాటాలు, బంధువులు, 
ఆర్కెస్ట్రా, డాన్స్ లు....
వెల్ కం డ్రింక్నుండి మొదలుకొని ఆఖర్న ఐస్ క్రీం వరకు 
పళ్ళెం లో కనీసం ఇరవై రకాల పైననే ఉంటున్నాయి.

ఇక అతిథుల ముందు ఉంగరాలు మార్చుకోవడం 
తోటి మొదలవుతుంది ఫోటోల తంతు 
సినిమా షూటింగు లను తలపించేలా  
ఓ క్రేను,ఐదారుగురు కేమరామేన్లు... 
అబ్బో అదో అన్నపూర్ణ స్టూడియో ,
(నా కాలేజ్ రోజుల్లో యూసుఫ్ గూడలో ఉన్నప్పుడు 
అన్నపూర్ణ స్టుడియోలో షూటింగ్ చూడ్డానికి వెళ్ళా )
అదే గుర్తుకొస్తుంది.

ఏదేమైనా ఈ అనవసరపు ఆర్భాటాలు 
పెళ్ళికూతురి తండ్రికి ఆర్ధిక భారాన్ని మోపేవే  తప్పించి 
పెద్దగా అవసరం లేదని నా అభిప్రాయం...