Tuesday 7 December 2021

తిరుమలలో ఉచిత సదుపాయాలు


కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని సంవత్సరానికి ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకునే వాళ్ళు, అలా దర్శించుకునే కుటుంబాలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో.. ఇంకా సంవత్సరం లోపే ఎన్నో సార్లు దర్శించుకునే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు.
ఉచితంగా తిరుమలకు అనగానే ఆశ్చర్యపోకండి. మన ఊరినుండి తిరుపతికి వెళ్ళడం ఉచితం కాకపోవచ్చు కానీ ఒక్కసారి తిరుపతిలో అడుగుపెట్టిన క్షణం నుండి మీరు మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యే వరకు చాలా సేవలు ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి భక్తులకు ఆర్థిక భారం తగ్గించేలా టీటీడీ ఎన్నో సేవలను ఉచితంగానూ లేదా నామమాత్రపు రుసుముతో అందుబాటులోకి తెచ్చింది. అందులో ముఖ్యమైనవి దర్శనం, భోజనం, వసతి.
తిరుపతిలో రైలు లేదా బస్సు దిగగానే మనకు మొదట కావల్సింది వసతి. దానికోసం రైల్వేస్టేషన్ పక్కనే విష్ణు నివాసంలో గానీ, లేదా బాస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీనివాసం వసతి సముదాయాల్లో ఉచిత లాకర్ సదుపాయం, పెద్ద పెద్ద డార్మెటరీలు అందుబాటులో ఉన్నాయి. నామ మాత్రపు రుసుముతో రూములు కూడా లభిస్తాయి.


భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలవరకు చేరుకునేందుకు ధర్మరథం పేరుతో ప్రతీ రెండు నిమిషాలకు ఒక బస్సు విష్ణు నివాసం నుండి బయల్దేరుతుంది. మన లగేజిని అక్కడే ఇస్తే ఉచితంగా తిరుమలకు చేరుస్తారు. 

కాలిబాటలో కొండ ఎక్కే భక్తులకు మధ్యలో ఉచిత దర్శనానికి టోకెన్, ఉచిత లడ్డూ కూపన్ ఇస్తారు. అదనపు లడ్డూలకు కూడా అక్కడే డబ్బు చెల్లించి కూపన్లు పొందవచ్చు. మెట్ల మార్గం గుండా పైకి చేరుకున్న భక్తులు బస్టాండ్ ఎదురుగా ఉన్న CRO ఆఫీస్ వద్ద ఉచిత గదులు పొందవచ్చు. ఒక్కరికి గది ఇవ్వరు కనీసం ఇద్దరు ఉండాలి.

వృద్ధులు, చంటిపిల్లల తల్లులకు కూడా ఉచితంగా ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు.
(ప్రస్తుతం కోవిడ్ వల్ల తాత్కాలికంగా నిలిపివేశారు)

తిరుమలలో నాలుగైదు చోట్ల అన్నప్రసాద కేంద్రాల్లో ఉచిత భోజన వితరణ ఉదయం 8 గంటల నుండే మొదలవుతుంది.

తిరుమల లోని అశ్విని ఆసుపత్రితోపాటు అపోలో ఆసుపత్రిలో వైద్యం ఉచితం .
ఇక ఘాట్ రోడ్డులో వాహనాలు చెడిపోయినా, ప్రమాదానికి గురైనా రిపేర్లు, భక్తులను గమ్యం చేర్చడం ఉచితంగా టీటీడీ ఏర్పాటు చేస్తుంది.
ఇవేకాక మరికొన్ని సేవలను కూడా టీటీడీ ఉచితంగా అందిస్తోంది. 

Sunday 7 March 2021

మగువలు కావాలి మహారాణులు


ప్రత్యేకంగా ఏదో ఒక రోజున మాత్రమే కాకుండా అనుక్షణం మహిళను గౌరవించే ఏకైక సమాజం భారతీయ సమాజం

యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః*
యత్రే తాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురాః క్రియాః
ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను దేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వసంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుంది

'ప్రణమ్యా మాతృదేవతాః "
మాతృదేవోభవ అంటూ అమ్మను తొలిదైవంగా భావించింది భారతీయసమాజం

మాతృవత్పరదారేషు - పరస్త్రీని కన్నతల్లిగా భావించాలని ఉద్భోధించింది భారతీయ సమాజం
కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని సంస్కరించే గురుతరమైన బాధ్యతను గృహిణిగా మహిళకు అప్పజెప్పింది మన భారతీయ సమాజం

భూమితో బాటు సమస్త ప్రకృతిని మాతృస్వరూపంగా భావించి ఆరాధిస్తుంది మన భారతీయ సమాజం.
స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం

ప్రాచీన భారతంలో స్త్రీలు జీవితం లోని అన్ని కోణాల్లోనూ పురుషు లతో సమంగా తమ స్థాయిని అనుభవించే వారు . పురుషులు మాదిరిగానే చదువుకునే వారు . గొప్ప పండితులు , కవయిత్రులు , తత్వవేత్తలుగా ఎదిగినవారూ ఉన్నారు .
ఒక్కమాటలో చెప్పలంటే స్త్రీ ఆరోజుల్లో " లక్ష్మీదేవి " కి తీసిపోని స్థానాన్ని అనుభవించింది. అర్ధాంగిగా సంపూర్ణ పాత్ర పోషించేది .
స్వయంవరం ద్వారా తన భర్త ను ఎంఫికచేసుకునే స్వేచ్చ ఆనాటి మహిళలకు ఉండేదని పురాణాలు వలన మనకు అవగతం అవుతుంది .

మనదేశంపై విదేశీయుల దండయాత్రలు మొదలైన తరువాత స్త్రీల మాన ప్రాణాలను రక్షించుకునేందుకు వారిని ఇంటికే పరిమితం చేయటం మొదలైంది.
వారి మతాల ప్రాబల్యం పెరుగుతూ స్త్రీ ప్రాధాన్యం తగ్గనారంభించింది.
ఆయా మతాల సామ్రాజ్య విస్తరణతోపాటే సమాజములో లింగవివక్షత పాకడం మొదలైంది .
కొంతకాలం గడిచే నాటికి మహిళల స్థితిగతుల్లో గణనీయమైన తేడాలొచ్చేశాయి.
వారు వంటింటికే పరిమితం అయ్యారు .
నిజం చెప్పాలంటే స్త్రీ జీవితంలో చీకటికోణము అప్పటినుండే మొదలైంది ..
అయినా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీభాయి, చెన్నమ్మ తదితర వీర వనితలు తమ శక్తి సామర్ధ్యాలను చాటుకున్నారు.
స్వాతంత్ర్య అనంతరం సమాజంలో స్త్రీల ప్రాధాన్యతను పెంచేందుకు యెన్నో చట్టాలు వచ్చినా అవగాహనా లోపాలు, నిరక్షరాస్యతల వల్ల అమలుకు నోచుకోలేదు. కానీ గత రెండు, మూడు దశాబ్దాలుగా ఎంతో మార్పు వచ్చినప్పటికీ, ఇంకా స్త్రీ వివక్ష, బ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. పొద్దున్నే పేపర్ తెరచినా, టీవీ ఛానళ్లు చూసినా ప్రముఖంగా కనిపించే మహిళలపై అత్యాచారాలు హింస, వరకట్న వేధింపులు లాంటి వార్తలు బాధను కలిగిస్తుంటాయి..
మహిళల హక్కులు, గౌరవం, ప్రాధామ్యాల విషయంలో పోరాటాలు చేసే దుస్థితికి కారణం ఎవరు , ఎందుకు?..
ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.
మార్పు అనేది మన కుటుంబాల నుంచే రావాలి.. మన ఇళ్లలోని మహిళా మూర్తులను గౌరవించండి.. ఆడ పిల్లలను మగపిల్లలతో సమానంగా చదివించండి.. వారు స్వశక్తిపై ఎదిగేందుకు తోడ్పడండి.. చాలు
ఇక ప్రతిరోజు మహిళాదినోత్సవమే అవుతుంది
ఇదీ చదవండి👉 మహిళాదినోత్సవం

Tuesday 15 December 2020

తిండి పురాణం

చేసిపెట్టేవాళ్ళు ఉండాలేకానీ, తెలుగువాళ్లకు ఎన్ని రకాలో తినడానికి.. 
కారప్పుస, చకినాలు, గరిజలు, పప్పు చెక్కలు(తెల్ల నువ్వులు, పప్పులు, పల్లీలు వేసి చేసినవి), బొబ్బట్లు, బెల్లప్పుస, వేయించిన అటుకులు, బూంది, బూంది లడ్డు, తొక్కుడు లడ్డు, రవ్వ లడ్డు, పెసర ముద్దలు, మలీద ముద్దలు, ఇంకా గోధుమ పిండితో చేసేవి కొన్ని - గవ్వలు, కారపు పూరీలు ఇలా ఒక్కో పండగకు ఒక్కోటి ఇలా యెన్నో
అప్పటికప్పుడు తినేటియి: సర్వపిండి, మిరపకాయ బజ్జి, పకోడీ, వేయించిన పల్లీలు, ఉడకబెట్టిన కందికాయలు, శెనగ గుడాలు (గుగ్గిళ్ళు), బొబ్బర గుడాలు, ఉడకబెట్టిన వేరుశనగలు/వేరుశనక్కాయలు, అలచంద గుగ్గిళ్ళు అబ్బో బోలెడు..
 చిన్నప్పుడు బొగ్గుల పొయ్యిలో మా అమ్మ పప్పు వండాక, దాంట్లో చిక్కుడుకాయలు కాల్చుకు తినేవాళ్లం. అలానే, నిప్పుల్లో కండగడ్డ (చిలగడదుంప) కాల్సుకుతింటే ఆమజాయే వేరు  ఎండాకాలం శెలవుల్లో కంద గడ్డల్ని ఉడకబెట్టేది మా అమ్మ. కింద పెద్ద గిన్నె, నిండా నీళ్లు, పైన ఇంకో చిన్న గిన్నెలో రెండో నాలుగో గడ్డలు వేసి మూతపెట్టేస్తే అవి ఉడికేవి. భలేవుండేవి.
ఇదంతా మనవల్ల కాదు అనుకుంటే కొనుక్కుని తినేవి: అప్పట్లో స్వీట్లు ఒక అద్దాల బండిలో పెట్టి అమ్మేవాళ్ళు. ఎక్కువగా కొన్నుకునేవి -  బాదుషా, జాంగ్రీ, పేడా, బర్ఫి మరియూ మిక్చర్ నాకు మహా ఇష్టం . కాని కొనుక్కుని తినేది చాలా తక్కువ. ఎప్పుడో, సంవత్సరానికోసారి. అప్పుడప్పుడూ కొన్ని కొత్తవి తెలుస్తుండేది. అలాంటివే చిప్స్, అప్పుడు ఎక్కడా అమ్మేవాళ్ళు కాదు.
ఇప్పుడు మాత్రం ఫాస్ట్ ఫుడ్ ల కాలం నడుస్తోంది

Monday 30 November 2020

దేవ దేవుని ఆశీస్సులు

మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి పంపండి.. వెంటనే తిరుమల నుండి మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళి నాడు తలంబ్రాలలో కలపండి)వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం,కుంకుమ,మహా ప్రసాదం,పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది..

తిరుమల నుండి పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము..మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ అడ్రసు కి కొరియర్ చేయండి.శుభలేఖ మీద ఉన్న మన చిరునామాకి స్వామి వారి కానుక అందుతుంది.

కానుక సంగతి పక్కన పెడితే... వివాహ ఆహ్వాన మొదటి పత్రిక స్వామి వారికి పంపడం శుభప్రథమైన కార్యం.

To,
Sri Lord Venkateswara swamy,
The Executive Officer
TTD Administrative Building
K.T.Road
Tirupati
517501

Saturday 15 August 2020

కరోనా పట్ల జాగ్రత్తగా ఉండండి


కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నా.. జనాల్లో ఇప్పటికీ భయం ఉండ్లేదు. మనకు కరోనా రాదు.. వచ్చినా
ఏమవుతుంది అనే ధీమా చాలామందిలో కనిపిస్తోంది.
ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో..
మేం ఎండలో తిరుగుతాం మాకు రాదు అనీ, మేము నాన్ వెజ్ తింటాం మాకు రానేరాదు అని భ్రమ పడుతున్నారు. నిన్న ఒకడు చికెన్ తింటే కరోనా రాదు KTR చెప్పాడు అన్నాడు. ఆయన చెప్పింది చికెన్ తినడం వలన కరోనా రాదు అని.. వీడు తింటే రాదు అని అర్థం చేసుకున్నాడు.
కరోనాకు వీడు వాడు అనే తేడాలు ఏమీ ఉండవు. ఎవరైనా ఒక్కటే
కరోనా మన దేశంలో చాలా నెమ్మదిగా మొదలైంది.. 130కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కరోనా కట్టడిని చూసి ఆశ్చర్య పోయిన ప్రపంచం ముందు కొంత మంది నిర్లక్ష్యం మూలంగా తలెత్తుకోలేని పరిస్థితికి చేరుకున్నాం.
కరోనా గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
ఒకసారి ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తే ఇక జీవితాంతం మన శరీరలోనే ఉంటుందని జపాన్ శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది.
కరోనా వచ్చిన కొందరిలో 3 నెలల తర్వాత యాంటీ బాడీలు నశిస్తున్నాయని కనుగొన్నారు.
ఊహాన్ లో జరుగుతున్న పరిశోధనల్లో కరోనా వచ్చి తగ్గిన వారిలో 90శాతం మందికి ఊపిరితిత్తులు సరిగా పని చేయడం లేదని తేలింది. ఇంకా కొందరికైతే వెంటిలేటర్ కూడా అవసరమౌతోందంటున్నారు.
కానీ కరోనా అందరిపై ఒకే రకమైన ప్రభావం చూపించట్లేదు.
కొందరి ఆరోగ్యాల్ని దారుణంగా దెబ్బ తీస్తోంది. ప్రాణాల్ని కూడా హరిస్తోంది
అలాంటి నష్టం మన కుటుంబంలోనే జరిగితే ఏంటి పరిస్థితి అన్నది ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. సాసైటీలో పలుకుపడి
ఉన్న వ్యక్తులు సైతం కరోనాతో పోరాటంలో ఓడిపోతున్న వైనాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. 
కరోనా వచ్చిన తర్వాత బాధ పడేకంటే ముందే జాగ్రత్త పడండి
ఒక్క క్షణం నిర్లక్ష్యం చాలు మన జీవితాన్ని తలకిందులు చేయడానికి.. 
కుటుంబం రోడ్డున పడడానికి ....
కాబట్టి ఈ మూడు జాగ్రత్తలు పాటించండి
1. మాస్క్
2. సానిటైజర్
3. భౌతిక దూరం
ఇవే మీకు శ్రీరామరక్ష..

Monday 10 August 2020

టెక్నాలజీ


గూగుల్
కొన్ని రోజుల క్రితం గూగుల్ నుండి ఫోన్
మీ బిజినెస్ గూగుల్ లో రిజిస్టర్ చేసుకోండి అని
ఇదేదో ఫేక్ కాల్ అనుకున్నా కాని కొద్దిసేపు మాట్లాడాక కాదని  అర్ధం అయింది
అయినా ఇంత పెద్ద ప్రపంచంలో మావూరు చాల చిన్నది .
నాది ఇంకా చిన్న షాపు. దీన్ని రిజిస్టర్  చేసుకోవడం ఎందుకు అన్నా.
ఏమేం లాభాలో కొంతసేపు తను వివరించాడు .
మీరు నాకే ఎందుకు ఫోన్ చేసారు ఎన్నో పెద్ద బిజినెస్ లు ఉన్నాయి కదా అన్నాను
దానికీ  సమాధానం చెప్పాడు.
ఈ ఏరియాలో ఎవరైనా గూగుల్ సెర్చ్ చేస్తే
మొదట మీబిజినెస్ నే చూపెడుతుంది అన్నాడు.
ఇంకో విధంగా కొత్తగా  మీ ఏరియాకు వచ్చినవాళ్ళకు సహాయంగా కూడా ఉంటుంది అన్నాడు
నిజమే అనిపించింది
(గతం లో కర్నాటక యాత్రలో నాకూ ఇటువంటి అనుభవాలు ఉన్నాయి)
సరే చెప్పండి ఏంచేయాలి అన్నాను
ఏంచేయాలో చెప్పాడు.
అలాగే చేసాను రిజిస్టర్ అయినట్టుగా మెయిల్ వచ్చింది.
గూగుల్ లేకుండా జీవితం గడవడం కొంచెం కష్టమే అనిపిస్తోంది
లేదు గూగులే మనల్ని అలా తయారు చేస్తోందా!!
ఏదైనా తెలుసుకోవాలంటే వెంటనే ఫోన్ తీసి గూగుల్లో సెర్చ్ చేయటమే..
ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే మొదట గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్
ఆటలకు ప్లే గేమ్స్ , తెలియని భాష కోసం ట్రాన్స్ లేట్ , గూగుల్ ఫోటోస్ , గూగుల్ కాంటాక్ట్స్
ఇలా ఎన్నో మనకు ఉపయోగపడే అపికేషన్లు, రకరకాల టూల్స్ ప్రపంచం మన చేతిలోకి వచ్చిన ఫీలింగ్.
ఇంకో విషయం
మొన్న మెయిల్స్ చూస్తున్నపుడు మ్యాప్స్ నుండి ఒక మెయిల్
మీరు గత నెలలో ఫలానా ఊరు వెళ్ళినపుడు గుడి ముందు దిగిన ఫోటోను మ్యాప్స్ కు జత చేయమంటారా అంటూ.....
youtube ఓపెన్ చేయగానే   గతంలో ఫలానా వీడియో చూశారు అంటూ అలాంటివే ఓ లిస్టు 

గూగుల్ తో  ఏదైనా సాధ్యమే
లేకుంటే ఏదైనా అసాధ్యమే
అనేంతగా ఎన్నో...

ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలు మన  వ్యక్తిగత డేటాను నిల్వ చేస్తాయన్న విషయం బహుశా కొంతమందికి తెలియదు. కానీ ఫేస్ బుక్ అనలిటికా  కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత తెలిసి  ఉంటుంది.

(డేటా విశ్లేషణ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా మొత్తం 5 కోట్లకు పైగా ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి సమాచారం ఆధారంగా వారికి నిశ్చితమైన రాజకీయ ప్రకటనలు చేరేలా చేసి అమెరికా ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసిందన్నది దానిపై వచ్చిన ఆరోపణ.)

ప్రతిరోజూ కనీసం ఒక్క గూగుల్ ప్రొడక్టునైనా తప్పక ఉపయోగిస్తాము  కదూ.

కాబట్టి, మన  గురించి మరెవ్వరికన్నా ఎక్కువగా ఈ కంపెనీకే తెలుసన్న మాట.

మీకు స్మార్ట్‌ఫోన్‌ ఉందా? అయితే మీరెవరు, ఎక్కడ నివసిస్తారు, ఎక్కడెక్కడికి వెళ్తుంటారు వంటి ముఖ్యమైన వివరాలన్నీ మీ అంతట మీరే థర్డ్-పార్టీ యాప్స్‌కు అందజేస్తున్నట్టు 

మీరు ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లో బ్రౌజింగ్ చేశాక, మీరు విజిట్ చేసే ప్రతి పేజీలోనూ అవే ఐటెమ్స్ కనిపిస్తున్నాయా?

ఇవి ఈ ట్రాకర్లు. థర్డ్ పార్టీ కంపెనీలకు చెందినవి      స్క్రీన్ వెనకాల ఉండి - మీరు ఏమేం శోధించారు, ఏయే వెబ్‌సైట్లు విజిట్ చేశారు, మీ ఐపీ అడ్రస్ ఏమిటి అన్న విస్తృతమైన డేటాను సేకరిస్తాయి.  


ఇలా వీటి బారి నుండి తప్పించుకోవాలంటే  

బ్రౌజర్లలో శాశ్వతంగా ప్రైవేట్ బ్రౌజింగ్‌ను సెట్ చేసుకోవాలి, ప్రతీ అప్లికేషన్ కు పర్మీషన్లు ఇవ్వడం మానుకోవాలి.

క్రెడిట్, డెబిట్ కార్డులతో షాపింగ్ చేసేటపుడు పాస్వర్డ్ సేవ్ చేయకపోడం మంచిది :

రోజుకో కొత్త రకం టెక్నాలజీ పుట్టుకొస్తున్న ప్రస్తుత కాలంలో దాని గురించి తెలుసుకునేలోపే ఒక్కోసారి అనర్థాలు జరుగుతుంటాయి.

కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతీ ఒక్కరు కొంచెం జ్జాగ్రత్తగా ఉంటూ టెక్నాలజీ గురించి అప్డేట్ గా ఉండాలి. 

అప్పుడే మనకు రక్షణ. 

Monday 16 March 2020

కరోనా

కరోనా

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి
కరోనా.. పుట్టిన దేశంలో వేలాది మంది ప్రాణాలు తీసిన ఆ మహమ్మారి ఇప్పుడు దాదాపు140 దేశాలకు విస్తరించి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1లక్షా 50వేల మంది ప్రాణాలను ప్రమాదం లో పడేసింది.
అయితే.. ఈ వైరస్ వ్యాప్తి వెనుక చైనా కుతంత్రం దాగిఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు కొందరు నిపుణులు. అమెరికా ట్రేడ్ వార్ తో తీవ్రంగా నష్టపోయిన చైనా నిజంగానే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చు..
ఇజ్రాయెల్‌కు చెందిన బయోలాజికల్ వార్‌ఫేర్ ఎక్స్‌పర్ట్ డేనీ షోహామ్ అయితే చైనా బయో వార్‌కు దిగిందనే ఖరాఖండిగా చెప్తున్నారు.
ఆధారంగా... ఏ నగరం నుంచైతే కరోనా వ్యాప్తి చెందిందో ఆ చోటే చైనా బయో వెపన్స్‌ తయారు చేసే ప్రయోగశాల ఉందంటున్నారు.
(శత్రుదేశాన్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా బలహీనపరచి తద్వారా యుద్ధం చేయలేని స్థితిలోకి దిగజార్చడమే బయో వార్ లక్ష్యం)
ఐతే వూహాన్ నగరం లో ఉన్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజి అనే లాబ్ WHO కు రెఫరెన్సు గా పనిచేస్తుంది కానీ చైనా తన స్వార్ధ ప్రయోజనాల కోసం దీన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు.
ఎందుకంటే కరోనా వైరస్ ను అభివృద్ధి చేసింది ఇక్కడే , ప్రమాదవశాత్తు అది బయటికి వచ్చి ఇప్పుడు ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తోంది.
కరోనా వచ్చిన వాళ్ళల్లో మరణాల రేటు ఒకటి రెండు శాతమే కదా అని తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ సంఖ్యలెప్పుడు పూర్తి సమాచారాన్ని ఇవ్వవు
ఇంత పెద్ద మన దేశంలో కనీసం ఒక్క శాతం మందికి (కోటి మంది) సోకినా ఎంత ప్రమాదమో ఒక్కసారి ఊహించండి
ఉపేక్షించడం, తేలిగ్గా కొట్టిపారేయడం ప్రమాదకరం
చైనాలో కరోనాతో మొదటగా మరణించిన వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన 34 మందిని ప్రస్తుతం పర్యవేక్షణ లో ఉంచారు వాళ్లందరికీ సోకకపోయినా ఎంతమందికి అంటుకునే అవకాశం ఉందొ అర్థం చేసుకోవచ్చు
కరోనావైరస్ గురించి మరో కొత్త కోణం జపాన్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు
కోలుకున్న తరువాత కూడా
తిరిగి మళ్ళీ దాని బారిన పడే అవకాశం ఉంది.
అంటే
ఒక సారి శరీరంలోకి జొరబడిందంటే
ఇక ఎప్పటికీ మన ఒంట్లోనే ఉంటుంది.
ఇప్పటికే ఇటువంటి ఒక కేసును వాళ్ళు డీల్ చేస్తున్నారట
అంటే కరోనా బారిన పడకుండా ఉండడమే ఉత్తమ మార్గం
వాస్తవాల కంటే ఊహాగానాలు అధికంగా ప్రచారం అవుతున్న ప్రస్తుత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీని బారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు

-కరోనా వైరస్‌ ఏ కారణం వల్లనైనా గాల్లో కలిస్తే రెండు గంటలపాటు సజీవంగా ఉంటుంది. ఆ సమయంలో జాగ్రత్త అవసరం. గాలిలోని తేమ, దుమ్ము, ధూళి కణాలతో  ప్రమాదకరమైన వైరస్‌ ఆయా వస్తువులపైకి చేరుతాయి.  వాటిని తాకిన వారికి వైరస్‌ చేరుతుంది. అలాగే బాధితుల చెయ్యి తగిలినా వ్యాధి సోకుతుంది. వీలైనంత వరకు చేతులకు గ్లౌజులు పెట్టుకోవడం ఉత్తమం.
- జనం ఎక్కువగా ఉన్న చోటుకు వెళ్లకూడదు. ముఖ్యంగా బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్‌మాల్స్‌, సినిమా థియేటర్లకు దూరంగా ఉండాలి. బస్సు, ఆటో, ట్రక్కర్లలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
- చేతితో కంటిని నలపడం, పుసులు తీయడం, చేతితో తుడవడం చేయకూడదు. దీనివల్ల చేతిలో వైరస్‌ కంటిలోకి చేరే ప్రమాదం ఉంది. అవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకుని కంటిని శుభ్రం చేసుకోవాలి.
- పరిచయస్తులు కలిస్తే మర్యాదపూర్వకంగా షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం అలవాటు. ఆలింగనం కూడా చేసుకుంటాం. ప్రస్తుతం ఇవేవీ మంచిది కాదు. వీలైనంత వరకు తెలిసిన వారికి నమస్కారంతో సరిపెట్టాలి. విదేశీయులు, విదేశాలకు వెళ్లివచ్చిన వారితో మరీ అప్రమత్తంగా ఉండాలి.
-ముక్కు, చెవి, నోటిలో వేళ్లుపెట్టుకుని కెలకడం వంటివి చేయకూడదు.
- చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్క్‌ ధరించడం చాలా శ్రేయస్కరం. కార్యాలయాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసేవారు వీటిని తప్పక ధరించాలి.
- కిల్లీ, జర్దా, పాన్‌పరాగ్‌ వంటి అలవాట్లు ఉన్నవారు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయకూడదు. ధూమపానం అలవాటు ఉన్న వారు బహిరంగ ప్రదేశాల్లో కాల్చకూడదు.

ఇలా వీలయినంతగా జాగ్రత్తలు తీసుకోవడం వలన వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. దాని బారిన పడకుండా కాపాడుకోవచ్చు.