Showing posts with label సంస్కృతి. Show all posts
Showing posts with label సంస్కృతి. Show all posts

Monday, 30 July 2018

పచ్చని చెట్టు ప్రాణభిక్ష పెట్టు

నాలుగు రోజుల క్రితం ఉదయాన్నే ఊరికి బయలుదేరా, 
బస్టాండ్ లో ఎప్పుడూ మనం ఎక్కాల్సిన బస్సు తప్ప అన్నీ ఉంటాయి 
కానీ  బస్టాండ్ కు వెళ్ళగానే ఎక్కాల్సిన బస్ కనపడింది, అదృష్టం అనుకున్నా . 
వెళ్లాల్సిన ఊరికి ఒక గంటన్నర  ప్రయాణం. 
బస్ బయల్దేరాక గంటకు చిన్న పల్లెటూరులో ఓ ఐదుగురు బడిపిల్లలు ఎక్కారు
నా ప్రక్కనే ఒక అబ్బాయి ఏడుస్తూ వచ్చి కూర్చున్నాడు. 
బడికి వెళ్లటం ఇష్టం లేదేమో అని అడిగా.
కాదు అంటూ తలూపాడు.
మరింకేంటి అడిగా..
మాఇంటిముందు ఉన్న రెండు చెట్లూ కొట్టేస్తున్నారు అన్నాడు.
అయితే నువ్వెందుకు ఎడుస్తున్నావు అన్నా
రోజు ఉదయం, సాయంత్రం వాటికిందే కదా మేము ఆడుకునేది , 
దానికి ఉన్న ఊయల కూడా తీసేశారు,
మా టీచరేమో చెట్లు  లేకుంటే ఆక్సీజన్ ఉండదు 
అది లేకుంటే మనం చచ్చిపోతాము అంది. చెట్లు తీసేస్తే మాకు ఆక్సీజన్ ఎట్లా? 
మా ఇంట్లోవాళ్ళంతా చనిపోతామా అంకుల్ అన్నాడు.
ఏం మాట్లాడాలో తెలియలేదు
ఊళ్ళో బోలెడు చెట్లు ఉన్నాయి కదా ఏమీ కాదులే అన్నానే  కానీ
ఇలాగే చెట్లు నరికేస్తూ వెళ్తే  భవిష్యత్ఏ తరాల పరిస్థితి ఏమిటి అని
ఆ పిల్లవాడిలా కాకున్నా కొంత  తెలియని ఆందోళన నాలో కూడా  అనిపించింది .
చిన్నపిల్లవాడి లాగా కూడా మనం ఆలోచించడం లేదే అనిపించింది.

ప్రకృతే ఆధారంగా మన కథ ఆరంభమైంది.
కానీ ఆ ప్రకృతినే నాశనం చేస్తూ ఎదుగుతున్నాం.
ఇంత అందమైన ప్రకృతి ని  స్వార్దంతో పాడు చేస్తూ
భవిష్యత్  మానవాళికీ  ముప్పు తెస్తున్నాం .
ఇలాంటిది నేను ఒక సారి బెంగుళూరు లో చూసాను 
నిజానికి చెట్లు నరికి వేయటం, అడవులు తగ్గిపోవటం వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయి.

ఈమధ్య కాలంలో బాగా పెరిగిన గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ముప్పులు
పచ్చని పరిసరాలకు ఎంత సమీపంలో జీవిస్తున్నారనే దాంతోనూ ముడిపడి
ఉంటున్నాయి
పిల్లల్లో ఊబకాయం సమస్య కు చెట్లు లేకపోవడం వలన కలిగే
గాలి కాలుష్యం కూడా ఒక ముఖ్య  కారణం
పచ్చని ప్రకృతి మధ్యలో గడిపిన తర్వాత ఎదుటివారి పట్ల
దయ, నమ్మకం పెరుగుతున్నట్టు, కాలిఫోర్నియా
విశ్వవిద్యాలయం వారి పరిశోధన చెబుతోంది
పార్కులు,చెట్లతో కూడిన వీధులు గల చోట్ల నివసించే వృద్ధులు ఐదేళ్లు ఎక్కువగా
జీవిస్తున్నట్టు జపాన్ పరిశోధకులు చెప్తున్నారు
ప్రకృతి సన్నిధిలో గడపటం వలన ఒత్తిడి హార్మోన్ల
స్థాయులు బాగా తగ్గి  మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటాని దోహదం చేస్తుంది.
వినోద సాధనాలకన్నా ఇదే ఉత్తమ ఫలితాల్ని ఇస్తుంది
అంతేకాక ఇవి శబ్ద మరియు ధూలి కాలుష్య కారకాల వడపోతకు ఒక ముఖ్య సాధనంగా పని చేస్తాయి, దాంతో క్షయ వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు 


చెట్టులోనూ దేవుణ్ణి చూసే మనకు ఇలాంటి పరిస్తితి వస్తే???
క్లైమేట్‌ రియాలిటీ ప్రాజెక్టు సర్వే ప్రకారం భూమ్మీద ప్రతి మనిషికి సగటున 422 చెట్లుంటే.. భారత దేశంలో సగటున 28 మాత్రమే ఉన్నాయన్నారు.

వృక్షాలు నరికేస్తూ పొతే భూగోళం ఎడారిగా మారేందుకు ఎంతో సమయం పట్టదు
33శాతంగాఉండాల్సిన అడవులు క్రమేపి తగ్గుతూ ఉండటం వల్ల
ఓజోన్ పోరా దెబ్బతిని ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి
భూగర్భ జలాలు, భూసారం క్షీణిస్తున్నాయి.
కరువు కాటకాలు, ప్రకృతి  వైపరీత్యాలు తరచుగా సంభవిస్తున్నాయి

మనిషి జీవితంతో, ఆరోగ్యంతో ముడిపడిన ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నపుడే
నేటి మన పిల్లలు పెద్దయ్యే సరికి అందమైన ప్రకృతితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని
ఆయుష్షును వారికి అందించవచ్చు



Saturday, 3 February 2018

గుడిలేదు గోపురంలేదు అయినా కోట్లాది జనం



ఈ రోజే జాతర చివరి రోజు కావటంతో , దేవతల వనప్రవేశంలోపు వెళ్లాలని ఉదయాన్నే బయల్దేరనుకున్నాం.



ఎందుకంటే దాదాపు 100 కిలోమీటర్లు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుంటే
 ఓ రెండున్నర గంటల్లో వెళ్ళొచ్చు కాని జామ్ అయితే అమ్మల దర్శనం కుదరదని
ముందుగానే రెడీ అయి వెళ్ళినా భయపడినంతా అయింది.
 ట్రాఫిక్ జామ్ లో దాదాపు గంటన్నర ఆగిపోవాల్సివచ్చింది. ఎప్పుడూ  ట్రాఫిక్ జామ్ లు ఎరుగని మాకు ఇవి మాకు కాస్త విసుగనిపించింది. కానీ మా హైదరాబాద్ లాంటి నగరవాసులకు అలవాటే అని పక్క సీటు లో కూర్చున్నతను అన్నాడు. దాదాపు 200 కిలోమీటర్లు వన్ వే చేసినా, కొన్నిచోట్ల అధికార్ల సమన్వయలోపం, కొందరు వాహనదార్ల అత్యుత్సాహం, ముందుగా వెళ్ళాలనే తపనతో అడ్డ దిడ్డంగా వెళ్ళటం ట్రాఫిక్ జామ్కి కారణమట. అయినా మేడారం చేరేసరికి మధ్యాహ్నం రెండైనా
మా తమ్ముడి బంధువు గుడి దగ్గర డ్యూటీలో ఉండటంతో vip దర్శనం పది నిమిషాల్లో అయింది.
కాని గద్దెల దగ్గరికి వెళ్ళగానే మిత్రుడు చెప్పినట్టు
గుడిలేదు గోపురంలేదు                  
అర్చనలేదు అభిషేకం అంతకన్నాలేదు                           
తీర్థంలేదు తియ్యని లడ్డులేదు        
 మడిలేదు మంగళహారతిలేదు 
కోలవడానికి ఓ రూపంలేదు 
కలవడానికి ప్రత్యేకదారుల్లేవు   
ఉన్నదొక్కటే నమ్మకం 'అమ్మ' అంటే ఆకలితీరుస్తది' 
ఆనమ్మకమే 'సమ్మక్క-సారక్క'  అనిపించింది. 
ఒకప్పుడు వేళల్లో ఉన్న భక్తులు కోట్లకు చేరటమే అందుకు నిదర్శనం.
ఇక్కడ క్లిక్ చేయండి వివరాలకు 
తెచ్చిన బంగారం(బెల్లం), టెంకాయలు అమ్మలకు సమర్పించి 
బయటకు రాగానే జ్యోతిష్యం చేపుతామంటూ కోయదొరలు,
పూసలదండలు, రుద్రాక్ష మాలలు కొనండని ఒకరు,
బొమ్మలు కొనమని ఇంకొకరు, వాళ్ళందరిని తప్పించుకొని
తెచ్చుకున్న  భోజనాలు ముగించుకొని తిరుగుప్రయానమయ్యాం
అమ్మల ఆశీర్వాదంతో,

గిరిజన మ్యూజియం


వేలాది బస్సులు ఒకే చోట 

Saturday, 20 January 2018

భక్తి


TV సరిగా రాకపోవటంతో ట్యూనింగ్ మొదలుపెట్టా 
దాదాపు 300 చానల్స్  వస్తున్నా తెలుగువి మాత్రం ఓ 50 ఉండొచ్చు.
అందులో భక్తి ,దైవసంబధిత మతపరమైన విషయాలను బోధించే చానల్స్ కూడా చాలానే కనిపించాయి
ఒక్క తెలుగులోనే 10కి పైగా  కనిపించాయి.
ఇది ఒకందుకు మంచిదే అనిపించింది.
మతం మనుషులకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అంటే 
భక్తి భావం మనిషిలో విలువలను మాత్రం  పెంచుతుంది. 
అది ఏ మతమైనా కావచ్చు దైవాన్ని విశ్వసించే వాడు మొత్తం సమాజం మంచిని కోరుతారు.
అని నా నమ్మకం.
ఇక ఒక్క మానసిక ప్రశాంతత తప్ప అన్ని రకాలైన ఆధునిక సౌకర్యాలనూ 
మనిషి అత్యంత సులువుగా పొందుతున్నాడు. 
అందుకే ప్రశాంతత కోసం మనిషి దేవుడిని ఆశ్రయిస్తున్నాడు .
మనం గమనిస్తే ఇప్పుడు ఆలయాలను సందర్శించే వారిలో పెద్దవాళ్ళ కంటే  
యువతీ యువకులే ఎక్కువగా కనిపిస్తున్నారు .
మనిషి జీవితంలో కష్టాలు పెరిగినా కొద్దీ  దైవంపై భక్తి మరింతగా పెరుగుతుంది కదా.
ఈ నమ్మకం అతనికి కొంత మానసిక ప్రశాంతతను పాజిటివ్ థింకింగ్ను
ఇస్తుంది అంతే తప్ప వారికి గానీ సమాజానికి గానీ నష్టమేమీ లేదు.
ఐతే భక్తి, మత సంబధిత విషయాలలో, మత గురువులు, ప్రబోధకుల విషయాలలో
చానల్స్ కొంత విచక్షణతో వ్యవహరిస్తే బాగుంటుంది .
గురువులు, ప్రబోధకులను పిలిచి డిబేట్ లు పెట్టేటప్పుడు ఆయా విషయాలపై 
తమకు అవగాహన ఉన్నదా, చర్చించే తాహతు తమకుందా, తదుపరి పర్యవసానాలు 
ఏమిటీ అని ముందే చూసుకుని బేరీజు వేసుకుంటే  మంచిది. 
(ఇట్లా డిబేట్ లు పెట్టేఒక చానల్ గతంలో సర్వమత చానల్ అంటూ ఒక చానల్ను 
ప్రారంభించి తక్కువ సమయంలోనే మూసుకున్నది గుర్తుండే ఉంటుంది )
ప్రేక్షకులు కూడా తమ విచక్షణ తో అటువంటి చానల్స్ ను పక్కన పెడితే మంచిది.
ఏదేమైనా భక్తీ అనేది మనిషిలో ప్రశాంతతను, సాత్వికతను,భూత దయను 
కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

Tuesday, 16 January 2018

మ్యూజియంలో మన పండగలు


దేశంలోని వివిధ సాంప్రదాయక పండగలని, భిన్న ప్రాంతాల కళలను
 పరిచయం చేసేందుకు ఏర్పాటైన శిల్పారామంలో
ఇక్కడి  మన స్థానిక సాంప్రదాయ పండగలని కూడా
కొత్తగా ఎక్కడివో అన్నట్టు వింతగా  చూడవలిసి రావటం ..
అంటే ఆధునికత ముసుగులో మనం మన సంప్రదాయాల్ని, రుచులని ఎలా మరచిపోతున్నామో అద్దం పడుతోంది.

నిన్న ఒక మిత్రుడికి  శుభాకాంక్షలుచెబుతామని ఫోన్ చేస్తే
మాటల  మధ్యలో శిల్పారామం వెళ్లిందీ అక్కడ మన సంక్రాంతి హరిదాసులు,
గంగిరెద్దులవాళ్ళు, బుడబుక్కల వాళ్ళను చూసి పిల్లలు సంతోష పడ్డారని చెప్పాడు.
చిన్నప్పుడు చాల మంది ఇలాంటి వాళ్ళు పండగలకి మన ఊళ్లలో వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు
వస్తున్నారా అన్నాడు.
ఏం వస్తార్రా బాబు మొన్ననే  హైదరాబాద్లో గంగిరెద్దుల వాళ్ళని భిక్షగాల్లంటూ అరెస్ట్ చేసారట
కదా అన్నా, అవునురా అలా  అరెస్ట్ చేయడం ఎందుకు? మళ్ళా  వాళ్ళని శిల్పారామంలో ప్రదర్శనల కోసమని ఆంధ్రా నుండి పిలిపించటం ఎందుకు? అన్నాడు

ఇప్పటికే మన పండగల కంటే ఎక్కువ స్థాయిలో ఇంగ్లిషోడి పండగలే జరుపుకుంటున్నాం.
మన సాంప్రదాయ పిండి వంటలకంటే వాడి పిజ్జా బుర్గర్ లే మనకు నచ్చుతున్నాయి.
ఏమోరా! ఇలాగైతే మన పండగలని మన పిల్లలిక మ్యుజియంలోనే చూసుకోవాలి అన్నాడు.

పండగలు మనకు మన పూర్వీకులు ఇచ్చిన వరం.
దీంట్లో ఎన్నో ఆహార,  ఆరోగ్య, వ్యవహారిక సూత్రాలు ఇమిడి ఉన్నాయి.
బెల్లం నువ్వుండలు, అరిసెలు, కొత్తబియ్యంతో చేసిన పిండి వంటలు
చలికాలంలో శరీరానికి వేడిని అందించి సంవత్సరమంతా
ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి .
ఇలా ప్రతి పండగకి వండే  ప్రసాదాలు ఆయా కాలాలకు అనుగుణంగా ఆరోగ్య సూత్రాలను
ఇముడ్చుకొని ఉంటాయి.
కాని గ్లోబలైజేషన్, మోడరన్ కల్చర్ ముసుగులో
మన సాంప్రదాయాలను ఫణంగా పెడుతున్నాం అనిపిస్తోంది
ఎంత అభివృద్ధి చెందిన మన మూలాల్ని మాత్రం మరవకూడదు.
అలా మరచిపోయిననాడు మ్యుజియంలే దిక్కు మనకు  .....

Tuesday, 19 December 2017

సవారి కచ్చరం నుంచి గాలిమోటర్ దాక



మేడారం జాతర అంటే తెలవనోల్లు లేరు ఇప్పుడు దేశంల 
జాతర అంటే మేడారమే గింత పెద్ద జాతర ఇంతవరకు జూడనేలే.
ఔ మరి దేశం మొత్తంల  ఇదే పెద్దది గద.
చిన్నప్పుడు జాతరకు  పోతే ఆ జనంల ఏడ  తప్పిపోతమో  
అని పెద్దోల్ల  చేయి వదిలేటోల్లం  కాదు 
తప్పి పోతావ్ ర పిలగా అటిటు ఉరకకు అనేటోల్లు .
ఎవ్వలన్నతప్పిపోతే గనక గద్దెల ముందట ఉండే మా ఊరివాళ్ళ  మిఠాయి దుకాణం కాడికి రావాలని గుర్తు చెప్పేటోల్లు
జాతర దినాలల్ల అమ్మల గద్దెల సుట్టూ దుకానలు లేస్తయి తాడిఫత్రీలు, తడకలేస్కొని. 
బంగారం (బెల్లం), బట్టలు, కోళ్ళు, బోళ్ళు,బొమ్మలు  మిఠాయిలు  అమ్మేటియి.
ఇంకా సర్కసోల్లు, రికార్డింగ్ డాన్స్, డ్రామా వోళ్ళు నుమాష్(exibitation) గూడా ఉంటై. 
నుమాష్ ల రంగుల రాట్నం గూడ వస్తయి. కానీ బయపడుతమని మా వొళ్ళు రాట్నం ఎక్కనియ్యక పోయేది  యింక ఓ బల్ల మీద సబ్బు పెట్టెలు, సబ్బులు, పవుడర్లు గసోంటి సామన్లు పెట్టి, చారానకొ, ఆటానకొ ఒక రింగు ఇచ్చేటోల్లు. ఆ రింగు దేని మీదనన్న పడితే అది మనదే, కని ఆ రింగు చెంగున ఎగుర్తుండె స్ప్రింగోలిగె దేని మీద పడకుంట. 
జాతరకు నా చిన్నప్పుడు ఇప్పటి లెక్క  ఇంతగనం కోట్లల్ల జనం వచ్చేటోల్లే గాదు. 
ఇప్పుడంటే డబల్ రోడ్లు ఐనై గావట్టి ఎక్కడ ఆగకుంట పోతాన్లు 
ఒక్క రోజుల తిరిగి వత్తాన్లు గని మా చిన్నప్పుడు రొండు మూడు  రోజులు పట్టేటిది. 
ఇప్పుడు  గాలి మోటార్లు కూడా పెడుతాండ్లు . 
గాలి మోటార్ ల పొతే ఒక్క  గంటలనే  పోవచ్చట. 
ఎన్కట జాతరంటే వారం రోజుల ముందుగాల్నే పనులు  షురూ చేసేటోల్లట మా బాపు చెప్పేటిది. వారం ముందుగాల ఓ మంచిరోజు  ఎడ్లను, బండిని (మాకు సవారి కచ్చరం  ఉండేది,ఊళ్లో ఏ పటేల్ కో, పట్వారికో, దొరకో మాత్రమే సవ్వారి కచ్చరం బండి ఉండేది.) రైతులందరికీ ఎడ్ల బండి ఉండేది మంచిగ కడిగి  గీరెలకు సుద్ద పూసి, పసుపు కుంకుమ రాసి, కానికి పసుపు కుంకుమ రాసి పల్లాకి లెక్క తయారు చెసేడ్ది. ఎడ్లకు కూడ బొట్లు పెట్టి, గజ్జెల దుత్తలు,బుడిగలు  గట్టి, కుంకుమ సల్లి ఎనకటి రాజుల గుర్రాల లెక్క తయారు జేసి .బండ్లె కూసునెటానికి మందం వరి గడ్డి ఏసుకుని . పొయిల కట్టెలు, వంట సామాన్, కొబ్బరి కాయలు, మొక్కు బంగారం, ఈత సాపలు, ఙంపఖాన బండ్లె ఏసుకోని, వాడ బండ్లు మొత్తం ఒక్క సారి బయిల్దేరేటియట. వారం మొత్తం బండ్లు నడ్సుడేనట, ఆడ ఆడ ఆక్కుంట....  మా ఊరికాంచి ఓ పది మైళ్ళు పోయినంక జంగల్ మొదలయ్యేటిదట, ఇగ మేడారం దాక ఎనభై మైళ్ళు జంగలే నట ఎక్కడనో ఓ పల్లె ఉండేటిదట . 
ఇదివరకు జాతర ఐపోయినంక మేడారంల మళ్ళా రొండు ఏండ్ల   దాక ఒక్కలు గూడ కనపడక పోయేటిదట  కానీ ఇప్పుడు రోజూ జాతర లెక్కనే ఉంటాన్లు జనం.
1964 దాకా ఎడ్లబండ్లె తప్ప ఇంకోటి తెల్వని జాతరకు 1966 ల 101 బస్సులు మొదలుపెట్టిన్లు 
మెల్లమెల్లగా పెరుగుతా.. పోయిన జాతరకు 3600 బస్సులు నడిపిన్లు.2010 నుంచి హెలికాప్టర్లు గూడ మొదలైనై ఇంకా ప్రైవేటు కార్లు, జీపులు, బస్సులూ,,ఇంకా ఎన్నో, లెక్కనే లేదు. 
1996 జాతరను స్టేట్ ఫెస్టివల్ అని ప్రకటించినంక బాగా జనం పెరిగి 
పోయిన సారి జాతరకు రెండు కోట్ల మంది వచ్చిన్లట ,
అంటే హైదరాబాద్ పట్నంల ఉండే జనం కంటే రెండంతలు.
అడివి మొత్తం జనంతోటి నిండిపోతది. 
ఎన్ని పనులున్నా  కాని జాతర మాత్రం మిస్ అయ్యేటోల్లం కాదు ఈ సారిగూడ ఇంట్ల కెళ్ళి ఒక్కలమైన పోవాలె అమ్మలకు మొక్కులు అప్పజెప్పాలె...


Tuesday, 9 May 2017

జై హనుమాన్



నేటితో హనుమద్దీక్షలకు చివరి రోజు కావటంతో
ఆలయాలన్నీ కిటకిటలాడాయి.

దీక్షావస్త్రాల దుకాణాలు ఒక్కసారిగా జనంతో నిండిపోయాయి.
ఇక పూజాసామాగ్రి, మాలలు అమ్మే దుకాణాలు సరేసరి.

పరిస్టితులు అనుకూలించపునపుడు,
సహకరించనపుడు మాత్రమే 11రోజుల దీక్షకు ఉపక్రమించాలి.
లేదంటే 41లేదా 21రోజులకే తీసుకోవటం మంచిది.

దీక్షాకాలంలో
 కాషాయ  రంగు వస్త్రా లనే ధరించాలి.
దీక్షను చేపట్టేముందు కనీసం మూడు రోజుల ముందు సాత్వికాహారం తీసుకోవాలి.
దీక్షా కాలంలో తల, గడ్డం, వెంట్రుకలు, గోళ్లను కత్తిరించకూడదు. పాదరక్షలు ధరించరాదు.
దీక్షా సమయంలో ఒకసారి కనీసం తమ శక్తికొద్దీ ఐదుగురు స్వాములకు
 భిక్ష ఏర్పాటు చేయాలి. మధ్యాహ్నం ఒకపూట భిక్ష (భోజనం)చేయాలి.
 రాత్రి అల్పాహారం తీసుకోవాలి . మితంగా భుజించటం అలవర్చుకోవాలి
అహింస, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహం,
బ్రహ్మచర్యం పాటించాలి. సత్కర్మలతో పాటు వాక్కు శుద్ధిగా ఉండాలి.
మత్తు పానీయాలు తీసుకోకూడదు. ధూమపానం చేయవద్దు .
(మద్యం, మాంసం  వ్యాపారులు ఆలోచించి,గురుస్వాముల లేదా
 అర్చకుల సలహా తీసుకొని  దీక్ష తీసుకోవటం మంచిది.)
దీక్షా సమయంలో కటిక నేలపై నిద్రించాలి.

గుండెనిండా చీకట్లు మాత్రమే పొంగిపోర్లుతున్నపుడు
భగవంతున్నిమనస్పూర్తిగా  వేడుకో
 కమ్ముకున్న ఉదాసీనతలన్నీ ఒక్కసారిగా కరిగిపోతాయి.

నాస్తికత,హేతువాదం ప్రబలినప్పటికి,
పరమత ప్రభావం వల్లనూ సనాతన ధర్మం
ఇక కనుమరుగుకాదు అని ఇవ్వాల బలంగా అనిపించింది
ఈమధ్య హిందూ జీవన విధానంలో అంతర్భాగమైన
మతాల మధ్య చిచ్చుపెట్టి హిందూ ఐక్యతను
దెబ్బ తీయాలనిచూస్తున్న విదేశీ శక్తులనుండి
తర్వాతి తరాలకు హైందవ ధర్మాన్ని  అందించాలి 

Friday, 27 January 2017

పట్టుపట్టి జల్లికట్ట్టు

నెమ్మదిగా హిందువుల పండుగలు, ఉత్సవాలను కనుమరుగు చేసేందుకు జరుగుతున్న కుట్రలు న్యాయస్థానాలనుకూడా ప్రభావితం చేసి తమకనుగుణంగా తీర్పు రాబట్టడంలో సఫలీకృతం అవుతున్నాయి కొన్ని విదేశీ శక్తులు.
భారత దేశ వెన్నుముక
అయిన తన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వాని
చిన్నాభిన్నం చేయకుండా మనం ఆ దేశాన్ని ఆక్రమించగలమని
నేను భావించటం లేదు అని  అన్న మెకాలే వారసులు విదేశీ విష సంస్కృతిని మన పై రుద్దుతూ వారసత్వ పండుగలు, ఉత్సవాలను అపహాస్యం చేస్తున్నారు. వీరికి కొన్ని విదేశీ సంస్థలు సహకరించడం, ఇంకా మన  సెలబ్రిటీలు తందాన అని వంతపాడుతూ వకాల్తా తీసుకోవడం....
        కొన్ని సార్లు కోర్టులు కూడా సాంప్రదాయాలు, సామాజిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని తమపరిధిని అవసరానుగుణంగా  మార్చుకొంటే  బాగుంటుంది. ఎక్కడో విదేశాల్లో పుట్టిన పండగలు, ప్రత్యేక దినాలు జరుపుకునే మనం మన సాంప్రదాయాలను ఎందుకు కొనసాగించలేకపోతున్నాం . అంటే వారి సాంప్రదాయాలు మాత్రమే గొప్పవనే విషబీజాన్ని మన మదిలో నాటుతున్నారు.

తమిళనాడు లో జల్లికట్టు, కర్ణాటక లో కంబల, మహారాష్ట్ర లో ఎడ్ల బండ్ల పందాలు, తెలుగునాట కోళ్ళ పందాలు మరోచోట మరోటి... ఏదైతేనేం. ఉత్సవం హిందువులదైతే చాలు దానిపై నానా రభస చేసి వాటిని శాశ్వతంగా కనుమరుగు చేయాలకున్న ఆలోచన కే మంచి గుణపాఠం తమిళుల తిరుగుబాటు..  మరికొన్ని ప్రాంతాల ప్రజలు కూడా వీరి బాటలో నడిచేందుకు  ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభిచడం వారి సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఆతృతగానే చూడాలి తప్ప వేరొకలా కాదు