Tuesday, 19 December 2017

సవారి కచ్చరం నుంచి గాలిమోటర్ దాక



మేడారం జాతర అంటే తెలవనోల్లు లేరు ఇప్పుడు దేశంల 
జాతర అంటే మేడారమే గింత పెద్ద జాతర ఇంతవరకు జూడనేలే.
ఔ మరి దేశం మొత్తంల  ఇదే పెద్దది గద.
చిన్నప్పుడు జాతరకు  పోతే ఆ జనంల ఏడ  తప్పిపోతమో  
అని పెద్దోల్ల  చేయి వదిలేటోల్లం  కాదు 
తప్పి పోతావ్ ర పిలగా అటిటు ఉరకకు అనేటోల్లు .
ఎవ్వలన్నతప్పిపోతే గనక గద్దెల ముందట ఉండే మా ఊరివాళ్ళ  మిఠాయి దుకాణం కాడికి రావాలని గుర్తు చెప్పేటోల్లు
జాతర దినాలల్ల అమ్మల గద్దెల సుట్టూ దుకానలు లేస్తయి తాడిఫత్రీలు, తడకలేస్కొని. 
బంగారం (బెల్లం), బట్టలు, కోళ్ళు, బోళ్ళు,బొమ్మలు  మిఠాయిలు  అమ్మేటియి.
ఇంకా సర్కసోల్లు, రికార్డింగ్ డాన్స్, డ్రామా వోళ్ళు నుమాష్(exibitation) గూడా ఉంటై. 
నుమాష్ ల రంగుల రాట్నం గూడ వస్తయి. కానీ బయపడుతమని మా వొళ్ళు రాట్నం ఎక్కనియ్యక పోయేది  యింక ఓ బల్ల మీద సబ్బు పెట్టెలు, సబ్బులు, పవుడర్లు గసోంటి సామన్లు పెట్టి, చారానకొ, ఆటానకొ ఒక రింగు ఇచ్చేటోల్లు. ఆ రింగు దేని మీదనన్న పడితే అది మనదే, కని ఆ రింగు చెంగున ఎగుర్తుండె స్ప్రింగోలిగె దేని మీద పడకుంట. 
జాతరకు నా చిన్నప్పుడు ఇప్పటి లెక్క  ఇంతగనం కోట్లల్ల జనం వచ్చేటోల్లే గాదు. 
ఇప్పుడంటే డబల్ రోడ్లు ఐనై గావట్టి ఎక్కడ ఆగకుంట పోతాన్లు 
ఒక్క రోజుల తిరిగి వత్తాన్లు గని మా చిన్నప్పుడు రొండు మూడు  రోజులు పట్టేటిది. 
ఇప్పుడు  గాలి మోటార్లు కూడా పెడుతాండ్లు . 
గాలి మోటార్ ల పొతే ఒక్క  గంటలనే  పోవచ్చట. 
ఎన్కట జాతరంటే వారం రోజుల ముందుగాల్నే పనులు  షురూ చేసేటోల్లట మా బాపు చెప్పేటిది. వారం ముందుగాల ఓ మంచిరోజు  ఎడ్లను, బండిని (మాకు సవారి కచ్చరం  ఉండేది,ఊళ్లో ఏ పటేల్ కో, పట్వారికో, దొరకో మాత్రమే సవ్వారి కచ్చరం బండి ఉండేది.) రైతులందరికీ ఎడ్ల బండి ఉండేది మంచిగ కడిగి  గీరెలకు సుద్ద పూసి, పసుపు కుంకుమ రాసి, కానికి పసుపు కుంకుమ రాసి పల్లాకి లెక్క తయారు చెసేడ్ది. ఎడ్లకు కూడ బొట్లు పెట్టి, గజ్జెల దుత్తలు,బుడిగలు  గట్టి, కుంకుమ సల్లి ఎనకటి రాజుల గుర్రాల లెక్క తయారు జేసి .బండ్లె కూసునెటానికి మందం వరి గడ్డి ఏసుకుని . పొయిల కట్టెలు, వంట సామాన్, కొబ్బరి కాయలు, మొక్కు బంగారం, ఈత సాపలు, ఙంపఖాన బండ్లె ఏసుకోని, వాడ బండ్లు మొత్తం ఒక్క సారి బయిల్దేరేటియట. వారం మొత్తం బండ్లు నడ్సుడేనట, ఆడ ఆడ ఆక్కుంట....  మా ఊరికాంచి ఓ పది మైళ్ళు పోయినంక జంగల్ మొదలయ్యేటిదట, ఇగ మేడారం దాక ఎనభై మైళ్ళు జంగలే నట ఎక్కడనో ఓ పల్లె ఉండేటిదట . 
ఇదివరకు జాతర ఐపోయినంక మేడారంల మళ్ళా రొండు ఏండ్ల   దాక ఒక్కలు గూడ కనపడక పోయేటిదట  కానీ ఇప్పుడు రోజూ జాతర లెక్కనే ఉంటాన్లు జనం.
1964 దాకా ఎడ్లబండ్లె తప్ప ఇంకోటి తెల్వని జాతరకు 1966 ల 101 బస్సులు మొదలుపెట్టిన్లు 
మెల్లమెల్లగా పెరుగుతా.. పోయిన జాతరకు 3600 బస్సులు నడిపిన్లు.2010 నుంచి హెలికాప్టర్లు గూడ మొదలైనై ఇంకా ప్రైవేటు కార్లు, జీపులు, బస్సులూ,,ఇంకా ఎన్నో, లెక్కనే లేదు. 
1996 జాతరను స్టేట్ ఫెస్టివల్ అని ప్రకటించినంక బాగా జనం పెరిగి 
పోయిన సారి జాతరకు రెండు కోట్ల మంది వచ్చిన్లట ,
అంటే హైదరాబాద్ పట్నంల ఉండే జనం కంటే రెండంతలు.
అడివి మొత్తం జనంతోటి నిండిపోతది. 
ఎన్ని పనులున్నా  కాని జాతర మాత్రం మిస్ అయ్యేటోల్లం కాదు ఈ సారిగూడ ఇంట్ల కెళ్ళి ఒక్కలమైన పోవాలె అమ్మలకు మొక్కులు అప్పజెప్పాలె...


No comments:

Post a Comment