Showing posts with label పండగలు. Show all posts
Showing posts with label పండగలు. Show all posts

Saturday, 20 January 2018

భక్తి


TV సరిగా రాకపోవటంతో ట్యూనింగ్ మొదలుపెట్టా 
దాదాపు 300 చానల్స్  వస్తున్నా తెలుగువి మాత్రం ఓ 50 ఉండొచ్చు.
అందులో భక్తి ,దైవసంబధిత మతపరమైన విషయాలను బోధించే చానల్స్ కూడా చాలానే కనిపించాయి
ఒక్క తెలుగులోనే 10కి పైగా  కనిపించాయి.
ఇది ఒకందుకు మంచిదే అనిపించింది.
మతం మనుషులకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అంటే 
భక్తి భావం మనిషిలో విలువలను మాత్రం  పెంచుతుంది. 
అది ఏ మతమైనా కావచ్చు దైవాన్ని విశ్వసించే వాడు మొత్తం సమాజం మంచిని కోరుతారు.
అని నా నమ్మకం.
ఇక ఒక్క మానసిక ప్రశాంతత తప్ప అన్ని రకాలైన ఆధునిక సౌకర్యాలనూ 
మనిషి అత్యంత సులువుగా పొందుతున్నాడు. 
అందుకే ప్రశాంతత కోసం మనిషి దేవుడిని ఆశ్రయిస్తున్నాడు .
మనం గమనిస్తే ఇప్పుడు ఆలయాలను సందర్శించే వారిలో పెద్దవాళ్ళ కంటే  
యువతీ యువకులే ఎక్కువగా కనిపిస్తున్నారు .
మనిషి జీవితంలో కష్టాలు పెరిగినా కొద్దీ  దైవంపై భక్తి మరింతగా పెరుగుతుంది కదా.
ఈ నమ్మకం అతనికి కొంత మానసిక ప్రశాంతతను పాజిటివ్ థింకింగ్ను
ఇస్తుంది అంతే తప్ప వారికి గానీ సమాజానికి గానీ నష్టమేమీ లేదు.
ఐతే భక్తి, మత సంబధిత విషయాలలో, మత గురువులు, ప్రబోధకుల విషయాలలో
చానల్స్ కొంత విచక్షణతో వ్యవహరిస్తే బాగుంటుంది .
గురువులు, ప్రబోధకులను పిలిచి డిబేట్ లు పెట్టేటప్పుడు ఆయా విషయాలపై 
తమకు అవగాహన ఉన్నదా, చర్చించే తాహతు తమకుందా, తదుపరి పర్యవసానాలు 
ఏమిటీ అని ముందే చూసుకుని బేరీజు వేసుకుంటే  మంచిది. 
(ఇట్లా డిబేట్ లు పెట్టేఒక చానల్ గతంలో సర్వమత చానల్ అంటూ ఒక చానల్ను 
ప్రారంభించి తక్కువ సమయంలోనే మూసుకున్నది గుర్తుండే ఉంటుంది )
ప్రేక్షకులు కూడా తమ విచక్షణ తో అటువంటి చానల్స్ ను పక్కన పెడితే మంచిది.
ఏదేమైనా భక్తీ అనేది మనిషిలో ప్రశాంతతను, సాత్వికతను,భూత దయను 
కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

Tuesday, 16 January 2018

మ్యూజియంలో మన పండగలు


దేశంలోని వివిధ సాంప్రదాయక పండగలని, భిన్న ప్రాంతాల కళలను
 పరిచయం చేసేందుకు ఏర్పాటైన శిల్పారామంలో
ఇక్కడి  మన స్థానిక సాంప్రదాయ పండగలని కూడా
కొత్తగా ఎక్కడివో అన్నట్టు వింతగా  చూడవలిసి రావటం ..
అంటే ఆధునికత ముసుగులో మనం మన సంప్రదాయాల్ని, రుచులని ఎలా మరచిపోతున్నామో అద్దం పడుతోంది.

నిన్న ఒక మిత్రుడికి  శుభాకాంక్షలుచెబుతామని ఫోన్ చేస్తే
మాటల  మధ్యలో శిల్పారామం వెళ్లిందీ అక్కడ మన సంక్రాంతి హరిదాసులు,
గంగిరెద్దులవాళ్ళు, బుడబుక్కల వాళ్ళను చూసి పిల్లలు సంతోష పడ్డారని చెప్పాడు.
చిన్నప్పుడు చాల మంది ఇలాంటి వాళ్ళు పండగలకి మన ఊళ్లలో వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు
వస్తున్నారా అన్నాడు.
ఏం వస్తార్రా బాబు మొన్ననే  హైదరాబాద్లో గంగిరెద్దుల వాళ్ళని భిక్షగాల్లంటూ అరెస్ట్ చేసారట
కదా అన్నా, అవునురా అలా  అరెస్ట్ చేయడం ఎందుకు? మళ్ళా  వాళ్ళని శిల్పారామంలో ప్రదర్శనల కోసమని ఆంధ్రా నుండి పిలిపించటం ఎందుకు? అన్నాడు

ఇప్పటికే మన పండగల కంటే ఎక్కువ స్థాయిలో ఇంగ్లిషోడి పండగలే జరుపుకుంటున్నాం.
మన సాంప్రదాయ పిండి వంటలకంటే వాడి పిజ్జా బుర్గర్ లే మనకు నచ్చుతున్నాయి.
ఏమోరా! ఇలాగైతే మన పండగలని మన పిల్లలిక మ్యుజియంలోనే చూసుకోవాలి అన్నాడు.

పండగలు మనకు మన పూర్వీకులు ఇచ్చిన వరం.
దీంట్లో ఎన్నో ఆహార,  ఆరోగ్య, వ్యవహారిక సూత్రాలు ఇమిడి ఉన్నాయి.
బెల్లం నువ్వుండలు, అరిసెలు, కొత్తబియ్యంతో చేసిన పిండి వంటలు
చలికాలంలో శరీరానికి వేడిని అందించి సంవత్సరమంతా
ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి .
ఇలా ప్రతి పండగకి వండే  ప్రసాదాలు ఆయా కాలాలకు అనుగుణంగా ఆరోగ్య సూత్రాలను
ఇముడ్చుకొని ఉంటాయి.
కాని గ్లోబలైజేషన్, మోడరన్ కల్చర్ ముసుగులో
మన సాంప్రదాయాలను ఫణంగా పెడుతున్నాం అనిపిస్తోంది
ఎంత అభివృద్ధి చెందిన మన మూలాల్ని మాత్రం మరవకూడదు.
అలా మరచిపోయిననాడు మ్యుజియంలే దిక్కు మనకు  .....

Tuesday, 19 December 2017

సవారి కచ్చరం నుంచి గాలిమోటర్ దాక



మేడారం జాతర అంటే తెలవనోల్లు లేరు ఇప్పుడు దేశంల 
జాతర అంటే మేడారమే గింత పెద్ద జాతర ఇంతవరకు జూడనేలే.
ఔ మరి దేశం మొత్తంల  ఇదే పెద్దది గద.
చిన్నప్పుడు జాతరకు  పోతే ఆ జనంల ఏడ  తప్పిపోతమో  
అని పెద్దోల్ల  చేయి వదిలేటోల్లం  కాదు 
తప్పి పోతావ్ ర పిలగా అటిటు ఉరకకు అనేటోల్లు .
ఎవ్వలన్నతప్పిపోతే గనక గద్దెల ముందట ఉండే మా ఊరివాళ్ళ  మిఠాయి దుకాణం కాడికి రావాలని గుర్తు చెప్పేటోల్లు
జాతర దినాలల్ల అమ్మల గద్దెల సుట్టూ దుకానలు లేస్తయి తాడిఫత్రీలు, తడకలేస్కొని. 
బంగారం (బెల్లం), బట్టలు, కోళ్ళు, బోళ్ళు,బొమ్మలు  మిఠాయిలు  అమ్మేటియి.
ఇంకా సర్కసోల్లు, రికార్డింగ్ డాన్స్, డ్రామా వోళ్ళు నుమాష్(exibitation) గూడా ఉంటై. 
నుమాష్ ల రంగుల రాట్నం గూడ వస్తయి. కానీ బయపడుతమని మా వొళ్ళు రాట్నం ఎక్కనియ్యక పోయేది  యింక ఓ బల్ల మీద సబ్బు పెట్టెలు, సబ్బులు, పవుడర్లు గసోంటి సామన్లు పెట్టి, చారానకొ, ఆటానకొ ఒక రింగు ఇచ్చేటోల్లు. ఆ రింగు దేని మీదనన్న పడితే అది మనదే, కని ఆ రింగు చెంగున ఎగుర్తుండె స్ప్రింగోలిగె దేని మీద పడకుంట. 
జాతరకు నా చిన్నప్పుడు ఇప్పటి లెక్క  ఇంతగనం కోట్లల్ల జనం వచ్చేటోల్లే గాదు. 
ఇప్పుడంటే డబల్ రోడ్లు ఐనై గావట్టి ఎక్కడ ఆగకుంట పోతాన్లు 
ఒక్క రోజుల తిరిగి వత్తాన్లు గని మా చిన్నప్పుడు రొండు మూడు  రోజులు పట్టేటిది. 
ఇప్పుడు  గాలి మోటార్లు కూడా పెడుతాండ్లు . 
గాలి మోటార్ ల పొతే ఒక్క  గంటలనే  పోవచ్చట. 
ఎన్కట జాతరంటే వారం రోజుల ముందుగాల్నే పనులు  షురూ చేసేటోల్లట మా బాపు చెప్పేటిది. వారం ముందుగాల ఓ మంచిరోజు  ఎడ్లను, బండిని (మాకు సవారి కచ్చరం  ఉండేది,ఊళ్లో ఏ పటేల్ కో, పట్వారికో, దొరకో మాత్రమే సవ్వారి కచ్చరం బండి ఉండేది.) రైతులందరికీ ఎడ్ల బండి ఉండేది మంచిగ కడిగి  గీరెలకు సుద్ద పూసి, పసుపు కుంకుమ రాసి, కానికి పసుపు కుంకుమ రాసి పల్లాకి లెక్క తయారు చెసేడ్ది. ఎడ్లకు కూడ బొట్లు పెట్టి, గజ్జెల దుత్తలు,బుడిగలు  గట్టి, కుంకుమ సల్లి ఎనకటి రాజుల గుర్రాల లెక్క తయారు జేసి .బండ్లె కూసునెటానికి మందం వరి గడ్డి ఏసుకుని . పొయిల కట్టెలు, వంట సామాన్, కొబ్బరి కాయలు, మొక్కు బంగారం, ఈత సాపలు, ఙంపఖాన బండ్లె ఏసుకోని, వాడ బండ్లు మొత్తం ఒక్క సారి బయిల్దేరేటియట. వారం మొత్తం బండ్లు నడ్సుడేనట, ఆడ ఆడ ఆక్కుంట....  మా ఊరికాంచి ఓ పది మైళ్ళు పోయినంక జంగల్ మొదలయ్యేటిదట, ఇగ మేడారం దాక ఎనభై మైళ్ళు జంగలే నట ఎక్కడనో ఓ పల్లె ఉండేటిదట . 
ఇదివరకు జాతర ఐపోయినంక మేడారంల మళ్ళా రొండు ఏండ్ల   దాక ఒక్కలు గూడ కనపడక పోయేటిదట  కానీ ఇప్పుడు రోజూ జాతర లెక్కనే ఉంటాన్లు జనం.
1964 దాకా ఎడ్లబండ్లె తప్ప ఇంకోటి తెల్వని జాతరకు 1966 ల 101 బస్సులు మొదలుపెట్టిన్లు 
మెల్లమెల్లగా పెరుగుతా.. పోయిన జాతరకు 3600 బస్సులు నడిపిన్లు.2010 నుంచి హెలికాప్టర్లు గూడ మొదలైనై ఇంకా ప్రైవేటు కార్లు, జీపులు, బస్సులూ,,ఇంకా ఎన్నో, లెక్కనే లేదు. 
1996 జాతరను స్టేట్ ఫెస్టివల్ అని ప్రకటించినంక బాగా జనం పెరిగి 
పోయిన సారి జాతరకు రెండు కోట్ల మంది వచ్చిన్లట ,
అంటే హైదరాబాద్ పట్నంల ఉండే జనం కంటే రెండంతలు.
అడివి మొత్తం జనంతోటి నిండిపోతది. 
ఎన్ని పనులున్నా  కాని జాతర మాత్రం మిస్ అయ్యేటోల్లం కాదు ఈ సారిగూడ ఇంట్ల కెళ్ళి ఒక్కలమైన పోవాలె అమ్మలకు మొక్కులు అప్పజెప్పాలె...


Sunday, 6 August 2017

రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు


అందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు....

ప్రపంచంలోని ఏ మతానికీ  లేని  ప్రత్యేకత హిందూ ధర్మానికి  సొంతం .
ఎన్నో మతాలు, ధర్మాలు, వర్గాలు, కులాలూ ఉన్నప్పటికీ
పూల దండలోని దారం ఎలాగైతే వివిధ రకాల, రంగుల, వాసనల
 పూవులను కలిపి ఉంచుతుందో  అదేవిధంగా
భారతీయులందరినీ హిందూ ధర్మం అలాగే కలిపి ఉంచుతుంది.
ఇదే ఇక్కడి గొప్పతనం.
అటువంటి హిందూ ధర్మంలోని సాంప్రదాయాలు,
ఆచారాలు, పండుగలు విభిన్నం,ప్రత్యేకం.
ఇందులో ముఖ్యమైనది రాఖీపౌర్ణమి.
అన్నచెల్లి, అక్కాతమ్ముల్ల అనుబంధానికి ప్రతీక ఈ పండగ .
ప్రపంచంలోని ఏ మతంలోనూ,దేశంలోనూ ఈ పండుగ కనిపించదు.
నిజానికి అన్నాచెల్లెల బంధం ఎంత అపురూపమైనది!
అన్నాచెల్లెల బంధము చిక్కని స్నేహానుబంధ సీమలకన్నన్
మిక్కిలి పైస్థాయినిపెంపెక్కిన చక్కని విశిష్ట ప్రేమామృతమౌ
అంటాడో కవి...
అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు…. 
కుటుంబంలో ఆప్యాయతలకు నెలవైన
అనుబంధాలు. 
చెరిగిపోని, కరిగిపోని ప్రేమానుబంధాలు. 
అమ్మ, నాన్న తర్వాత అంతటి
ప్రేమాభిమానాలు ఉండేది సోదరీసోదరుల మధ్యనే.  
అక్కో చెల్లినో రాఖీ కడుతుంటే 
మురిసిపోని సోదరుడు ఉంటాడా చెప్పండి.
కానీ 'ప్రేమా... గీమా'
అంటూ వెంటపడేవారిని వదిలించుకోవడానికో..      
 బహుమతులను  ఆశించి  'అన్నా' అంటూ పొడి పొడి అప్యాయతలతోనో 
రాఖీలు కట్టి నవ్వులపాలు కాకండి. 

మరొక్కసారి

అందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు....

Tuesday, 28 March 2017

ఉగాది శుభాకాంక్షలు

మావిచిగురు, వేపపవ్వు,
మల్లెల గుబాళింపులు,
కోయిల కుహూరావాలు....
ఉగాది రాకకు సంకేతాలు.
ప్రకృతితో ముడిపడి ప్రతి జీవికి చైతన్యంతో కూడిన ఆనందాన్ని,
ఉల్లాసాన్ని
కల్గించే పండగ ఉగాది.
అచ్చంగా జీవితం
మనకి చూపించే రకరకాల
రుచులకు మల్లే 
తీపి, కారం, చేదు, ఉప్పు,
పులుపు, వగరు ఇత్యాది రుచుల సమ్మేళనమైన
ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ పలుకుదాం కొత్త సంవత్సరానికి ఆహ్వానం ......
అందరికీ హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Thursday, 23 February 2017

చిదానంద రూపం శివోహం శివోహం



ప్రతి సంవత్సరం మాఘ
బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి
అత్యంత ప్రాధాన్యంగల పవిత్రదినం.
శివుడు ఈ రోజే
లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.
క్షీరసాగర మధన సమయంలో వచ్చిన గరళాన్ని శివుడు తన గళాన నిలిపి
ముల్లోకాలను కల్లోలం నుంచి కాపాడిన
కాళరాత్రీ శివరాత్రేనట.
శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం
ఏమిటంటే- శివుని పేరు పలికే నాలుకే నాలుక,
శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని
పూజించే చేతులే చేతులు. శివుని సదా
స్మరించేవాడే ధన్యుడు.
'శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనటంలోని
ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు
సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే.
సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ
శివమయమే. శివం కానిది 'శవ'మంటారు
జ్ఞానులు.
ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ
ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండటమే
నిజమైన నియంత్రణం. అదే నిజమైన ఉపవాసం.
మితృలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

Friday, 27 January 2017

పట్టుపట్టి జల్లికట్ట్టు

నెమ్మదిగా హిందువుల పండుగలు, ఉత్సవాలను కనుమరుగు చేసేందుకు జరుగుతున్న కుట్రలు న్యాయస్థానాలనుకూడా ప్రభావితం చేసి తమకనుగుణంగా తీర్పు రాబట్టడంలో సఫలీకృతం అవుతున్నాయి కొన్ని విదేశీ శక్తులు.
భారత దేశ వెన్నుముక
అయిన తన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వాని
చిన్నాభిన్నం చేయకుండా మనం ఆ దేశాన్ని ఆక్రమించగలమని
నేను భావించటం లేదు అని  అన్న మెకాలే వారసులు విదేశీ విష సంస్కృతిని మన పై రుద్దుతూ వారసత్వ పండుగలు, ఉత్సవాలను అపహాస్యం చేస్తున్నారు. వీరికి కొన్ని విదేశీ సంస్థలు సహకరించడం, ఇంకా మన  సెలబ్రిటీలు తందాన అని వంతపాడుతూ వకాల్తా తీసుకోవడం....
        కొన్ని సార్లు కోర్టులు కూడా సాంప్రదాయాలు, సామాజిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని తమపరిధిని అవసరానుగుణంగా  మార్చుకొంటే  బాగుంటుంది. ఎక్కడో విదేశాల్లో పుట్టిన పండగలు, ప్రత్యేక దినాలు జరుపుకునే మనం మన సాంప్రదాయాలను ఎందుకు కొనసాగించలేకపోతున్నాం . అంటే వారి సాంప్రదాయాలు మాత్రమే గొప్పవనే విషబీజాన్ని మన మదిలో నాటుతున్నారు.

తమిళనాడు లో జల్లికట్టు, కర్ణాటక లో కంబల, మహారాష్ట్ర లో ఎడ్ల బండ్ల పందాలు, తెలుగునాట కోళ్ళ పందాలు మరోచోట మరోటి... ఏదైతేనేం. ఉత్సవం హిందువులదైతే చాలు దానిపై నానా రభస చేసి వాటిని శాశ్వతంగా కనుమరుగు చేయాలకున్న ఆలోచన కే మంచి గుణపాఠం తమిళుల తిరుగుబాటు..  మరికొన్ని ప్రాంతాల ప్రజలు కూడా వీరి బాటలో నడిచేందుకు  ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభిచడం వారి సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఆతృతగానే చూడాలి తప్ప వేరొకలా కాదు

Friday, 6 January 2017

ముక్కోటి ఏకాదశి

         ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూపుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాబారతయుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజునఉపదేశించాడని విశ్వాసం ఉంది. 

ముక్కోటి ఏకాదశిధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశిపవిత్రమైనది.

విష్ణు ప్రీతికరమైన
ఏకాదశులలో ఇది అత్యంత
ప్రధానమైనది.
అధరం మధురం వదనం మధురం నయనం
మధురం హసితం మధురం|
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతే
రఖిలం మధురం||
అట్టి సుమధుర మూర్తిని ఈ
'ఏకాదశి' రోజున వేయికనులతో
వీక్షించి సేవించి తరంచి
పోవాలని మూడు కోట్లమంది
దేవతలు వైకుంఠమునకు చేరుకునే
పుణ్యప్రదమైన రోజు కనుక ఇది
వైకుంఠ ఏకాదశిగా "ముక్కోటి
ఏకాదశి" గా
భక్తులు పిలుస్తూ ఉంటారు.
ఇట్టి
పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో
పూర్ణిమకు ముందు వచ్చే
ఏకాదశి అవుతుంది.
ప్రముఖ దేవాలయాలలో
(తిరుపతి,
భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి వైష్ణవ)
పుణ్యక్షేత్రాలలో మామూలు రోజులలో అయితే,
ఉత్తర ద్వారాలను మూసి
ఉంచుతారు. ఈ "ముక్కోటి
ఏకాదశి" రోజున
మాత్రం వాటిని తెరచి
ఉంచుతారు. ఆ
రోజు భక్తులు సూర్యోదయానికి
పూర్వమే నిద్రలేచి
కాలకృత్యములు,
స్నానసంధ్యాదులు ముగించుకొని
అట్టి ప్రముఖ ఆలయాలలో ఉత్తర
ద్వారం ద్వారా ప్రవేశించి
ప్రదక్షిణలు ముగించుకుని
దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు.
అలా ప్రదక్షిణ క్రమాన్నే
"ముక్కోటి ప్రదక్షిణ" అని
పిలుస్తూ ఉంటారు.