Tuesday, 30 October 2018

వెలుగుల దీపావళికి చీకటి బహుమతి


ఈమధ్య కోర్టులు హైందవ ఆచారాలకు, విధానాలకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వటం
హిందువుల్లో తీవ్ర నిరాశకు, న్యాయ వ్యవస్థ పట్ల వ్యతిరేకతకు కారణమవుతున్నాయి
 మొన్న శబరిమలలో ఆడవారి ప్రవేశం గురించిన తీర్పు
ఇప్పుడేమో దీపావళికి రెండు గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చాలని..
ఎక్కడున్నాం మనం..
 హిందూ దేశంలో నా లేక పోతే ఇంకేదైనా దేశంలోనా
హిందూ పండుగలంటే ఎందుకంత చులకన అంటూ మండిపడుతున్నారు.
రెండు గంటల సమయం ఎవడికి సరిపోతుంది
దీపావళి దక్షిణాదిలో రెండు రోజులు జరుపుకుంటారు
కానీ ఉత్తరాది వారైతే వారంపాటు ఘనంగా జరుపుతారు
ప్రపంచ వ్యాప్తంగా హిందూ పండగలని అన్ని మతాలవారు ఘనంగాజరుపుతూ ఉంటే
మన దగ్గర సెక్యులర్ ముసుగులో హిందుత్వాన్ని , ఆచారాలను, సాంప్రదాయాల్ని
అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.
హిందూ పండగల్లో ఉండే ప్రతీ కార్యక్రమం  ఒక శాస్త్రీయ  కారణాన్ని,
ఇంకా అనేక ఆరోగ్య రహస్యాల్ని కలిగి ఉంటుంది.
ఈవిషయం ప్రపంచమంతటికీ తెలుసు
కానీ ఇక్కడి కొందరు హేతువాదులు, కుహనా లౌకిక మేధావుల వల్ల ఇక్కడ
తరచుగా వివాదాలలోకి లాగబడుతోంది .
ముఖ్యంగా వినాయకచవితి, దీపావళి పండగల విషయంలో కాలుష్యం పేరుతొ
నిబంధనలు విధించడంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.
నిజానికి దీపావళినాడు టపాసులు కాల్చడంవల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
ఏడాదికొకసారి సంభవించే ఈ కాలుష్యం యొక్క  ప్రయోజనాలేమిటో తెలుసుకుంటే 
ఈ శుభ సాంప్రదాయం పట్ల ఉన్న అపోహలన్నీ తొలగిపోతాయి,  
ఇటువంటి ఆచారాల్ని త్యజించటం వాళ్ళ కలిగే నష్టాలు కూడా బోధ పడతాయి.
దీపావళి వర్షాకాలం పూర్తిగా గడచిన తర్వాత వస్తుంది 
టపాకాయలు కాల్చటం వల్ల వర్షాకాలంలో విపరీతంగా పెరిగిన క్రిమికీటకాలను నిర్మూలించవచ్చు 
దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది . టపాకాయల్లో వాడే గంధకం వల్ల పప్పుదినుసుల పంటలు 
ఏపుగా పెరిగి దిగుబడికూడా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి . 
చలికాలంలో వేసేది కూడా ఎక్కువగా ఆ పంటలే 
ఇంకా గంధకానికి ఎంతకూ తగ్గని మొండి చర్మ వ్యాధుల్ని(fungal infections) కూడా తగ్గించే గుణం ఉంది 
అందుకే గంధకపు వేడినీటి చెలిమెలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది
 ప్రతిరోజు వెలువడే కాలుష్యం వదిలేసి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరిగే పండగలకు నిబంధన విధించడం ఏమిటి  ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల్లో పేల్చ బాణాసంచా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ దీనిపై  స్పందన ఏమీ ఉండదు అంటూ హిందూ సంఘాలు మండి పడడంచూస్తూనే ఉన్నాం
 శబ్దము మరియు పొగ తక్కువగా వచ్చే టపాకాయలను తయారుచేయాలని కంపెనీలకు సూచిస్తే బాగుంటుంది విదేశాల నుంచి దిగుమతి అయ్యే అటువంటి టపాకాయలను నిషేధిస్తే ఇంకా మంచిది ఆ వైపుగా చర్యలు తీసుకోకుండా సాధారణ ప్రజల పై తీర్పులను రుద్దడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది ఎన్నో ఏళ్ల నుంచి మూలన పడి ఉన్న కేసులు కాకుండా ఇటువంటి కేసుల్లో ఏదో కొంపలు మునిగిపోయినట్లు అత్యంత త్వరగా తీర్పులు ఇవ్వాల్సిన అవసరం ఏముందో.
 కోర్టులు ఇలాంటి తీర్పులు ఇవ్వడం వలన ప్రజలకు కోర్టు పైన ఉండే సదభిప్రాయాన్ని కోల్పోతాయి తప్ప ఒరిగేదేమీ లేదు

Saturday, 4 August 2018

ప్లాస్టిక్ కు దూరంగా ఉండలేమా

"ప్లాస్టిక్ నిషేధం
మాటలకే పరిమితమైన ఒక గొప్ప ప్రణాళిక

ప్లాస్టిక్ కవర్ల వల్ల
పర్యావరణానికి చేటని ఎంతో మంది నిపుణులు
చెబుతున్నా ఆ మాటలను పెడచెవిన పెట్టి
యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం జరుగుతోంది.
ఇంకా..
ప్లాస్టిక్ తీవ్రమైన వాతావరణం కాలుష్యం కలిగిస్తుంది అనేది
అందరికి తెలిసిన గొప్ప సత్యం కానీ మానటం అయిష్టం 
ఎందుకంటే అంత చవకలో మరో ప్రత్యామ్నాయం లేకపోవటం కారణం

కిరాన సరకులు, మందులు తెచ్చుకున్నా , కూరగాయలు,హోటళ్ళనుండి ఇలా కవర్లలో  టీ, టిఫిన్ లాంటి వేడి  ఆహార పదార్థాలు ప్యాక్ చేసినప్పుడు పేగులు, కడుపు సంబంధిత కాన్సర్ లను కలిగించే రసాయనాలు తీవ్ర స్థాయిలో ఆహారం లో కలుసున్నట్టుగా కనుగొన్నారు.


ప్లాస్టిక్ కవర్ల నిషేధంలో భాగంగా 40 మైక్రాన్ల  కంటే మందంగా  ఉండే
కవర్లే వాడాలనే నిబంధన ఉంది కానీ ఇవికూడా భూమిలో త్వరగా కరిగిపోవు,
కానీ పునర్వినియోగానికి అవకాశానికి అవకాశముంటుంది,
వ్యాపారులు కూడా ఆర్ధిక భారం తో
వాడకం తగ్గిస్తారనే ఆలోచన అయివుండొచ్చు.
ప్లాస్తిక్ వినియోగాన్ని క్రమబద్దీకరించి నిషేధాన్ని సరిగా
అమలు పరచటంలో విఫలమైన దేశాల్లో మనది ఒకటి.


కవర్లు పారవేయడం వల్ల భూమిపై ఒక పోరలాగ ఏర్పడి వాన నీటిని ఇంకకుండా అడ్డుకుంటున్నాయి  దాంతో నీటి కరువు ముప్పు పొంచి ఉంది.

ఇంకా సముద్ర కాలుష్యం లో దాదాపు80 శాతం ప్లాస్టిక్ వే ఉంటున్నాయి.
జలచరాలు, పశుపక్ష్యాదుల మరణానికి కారణమౌతోంది 



మనిషిఅలసత్వమే ముఖ్య కారణంగా
మనకి జీవనాధారమైన  గాలి, నీరు, భూమి అన్నీ కలుషితం అవుతున్నాయి

ప్లాస్టిక్ కవర్లతో జరిగే నష్టాలను ప్రజలకు
తెలిసే విధంగా ప్రభుత్వం, మేధావులు కృషి చేయాలి.
ప్రత్యామ్నాయాలు చూపిస్తూ
మెల్లమెల్లగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం నుంచి
దూరం జరిగేలా చర్యలు తీసుకోవాలి.

ప్రతి ఒక్కరూ బాధ్యత గా  ప్లాస్టిక్  వినియోగాన్ని నిలిపివేసినప్పుడే మీపిల్లలు
 " నేను పెరిగి పెద్దవాడినయ్యే వరకు ఈ అందమైన ప్రకృతిఇలాగే ఉంటుందా?
అని అడిగితే
ఉంటుంది అని సమాధానం ఇవ్వగలరు 

కాబట్టి  నేను ప్లాస్టిక్ వాడను అని  వెంటనే ఒక నిర్ణయం తీసుకోండి.
మార్కెట్కు వెళ్ళినా, కిరాణా షాపుకు వెళ్ళిన
ఒక సంచి తెసుకొని వెళ్ళటం అలవాటు చేసుకోండి 

అందమైన ప్రకృతి, ఆరోగ్యకర జీవితాన్ని
పిల్లలకందివ్వలేనపుడు ఎన్ని కోట్లు కూడబెట్టి వారికిచ్చినా ఫలితం శూన్యంకదా !!!

Monday, 30 July 2018

పచ్చని చెట్టు ప్రాణభిక్ష పెట్టు

నాలుగు రోజుల క్రితం ఉదయాన్నే ఊరికి బయలుదేరా, 
బస్టాండ్ లో ఎప్పుడూ మనం ఎక్కాల్సిన బస్సు తప్ప అన్నీ ఉంటాయి 
కానీ  బస్టాండ్ కు వెళ్ళగానే ఎక్కాల్సిన బస్ కనపడింది, అదృష్టం అనుకున్నా . 
వెళ్లాల్సిన ఊరికి ఒక గంటన్నర  ప్రయాణం. 
బస్ బయల్దేరాక గంటకు చిన్న పల్లెటూరులో ఓ ఐదుగురు బడిపిల్లలు ఎక్కారు
నా ప్రక్కనే ఒక అబ్బాయి ఏడుస్తూ వచ్చి కూర్చున్నాడు. 
బడికి వెళ్లటం ఇష్టం లేదేమో అని అడిగా.
కాదు అంటూ తలూపాడు.
మరింకేంటి అడిగా..
మాఇంటిముందు ఉన్న రెండు చెట్లూ కొట్టేస్తున్నారు అన్నాడు.
అయితే నువ్వెందుకు ఎడుస్తున్నావు అన్నా
రోజు ఉదయం, సాయంత్రం వాటికిందే కదా మేము ఆడుకునేది , 
దానికి ఉన్న ఊయల కూడా తీసేశారు,
మా టీచరేమో చెట్లు  లేకుంటే ఆక్సీజన్ ఉండదు 
అది లేకుంటే మనం చచ్చిపోతాము అంది. చెట్లు తీసేస్తే మాకు ఆక్సీజన్ ఎట్లా? 
మా ఇంట్లోవాళ్ళంతా చనిపోతామా అంకుల్ అన్నాడు.
ఏం మాట్లాడాలో తెలియలేదు
ఊళ్ళో బోలెడు చెట్లు ఉన్నాయి కదా ఏమీ కాదులే అన్నానే  కానీ
ఇలాగే చెట్లు నరికేస్తూ వెళ్తే  భవిష్యత్ఏ తరాల పరిస్థితి ఏమిటి అని
ఆ పిల్లవాడిలా కాకున్నా కొంత  తెలియని ఆందోళన నాలో కూడా  అనిపించింది .
చిన్నపిల్లవాడి లాగా కూడా మనం ఆలోచించడం లేదే అనిపించింది.

ప్రకృతే ఆధారంగా మన కథ ఆరంభమైంది.
కానీ ఆ ప్రకృతినే నాశనం చేస్తూ ఎదుగుతున్నాం.
ఇంత అందమైన ప్రకృతి ని  స్వార్దంతో పాడు చేస్తూ
భవిష్యత్  మానవాళికీ  ముప్పు తెస్తున్నాం .
ఇలాంటిది నేను ఒక సారి బెంగుళూరు లో చూసాను 
నిజానికి చెట్లు నరికి వేయటం, అడవులు తగ్గిపోవటం వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయి.

ఈమధ్య కాలంలో బాగా పెరిగిన గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ముప్పులు
పచ్చని పరిసరాలకు ఎంత సమీపంలో జీవిస్తున్నారనే దాంతోనూ ముడిపడి
ఉంటున్నాయి
పిల్లల్లో ఊబకాయం సమస్య కు చెట్లు లేకపోవడం వలన కలిగే
గాలి కాలుష్యం కూడా ఒక ముఖ్య  కారణం
పచ్చని ప్రకృతి మధ్యలో గడిపిన తర్వాత ఎదుటివారి పట్ల
దయ, నమ్మకం పెరుగుతున్నట్టు, కాలిఫోర్నియా
విశ్వవిద్యాలయం వారి పరిశోధన చెబుతోంది
పార్కులు,చెట్లతో కూడిన వీధులు గల చోట్ల నివసించే వృద్ధులు ఐదేళ్లు ఎక్కువగా
జీవిస్తున్నట్టు జపాన్ పరిశోధకులు చెప్తున్నారు
ప్రకృతి సన్నిధిలో గడపటం వలన ఒత్తిడి హార్మోన్ల
స్థాయులు బాగా తగ్గి  మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటాని దోహదం చేస్తుంది.
వినోద సాధనాలకన్నా ఇదే ఉత్తమ ఫలితాల్ని ఇస్తుంది
అంతేకాక ఇవి శబ్ద మరియు ధూలి కాలుష్య కారకాల వడపోతకు ఒక ముఖ్య సాధనంగా పని చేస్తాయి, దాంతో క్షయ వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు 


చెట్టులోనూ దేవుణ్ణి చూసే మనకు ఇలాంటి పరిస్తితి వస్తే???
క్లైమేట్‌ రియాలిటీ ప్రాజెక్టు సర్వే ప్రకారం భూమ్మీద ప్రతి మనిషికి సగటున 422 చెట్లుంటే.. భారత దేశంలో సగటున 28 మాత్రమే ఉన్నాయన్నారు.

వృక్షాలు నరికేస్తూ పొతే భూగోళం ఎడారిగా మారేందుకు ఎంతో సమయం పట్టదు
33శాతంగాఉండాల్సిన అడవులు క్రమేపి తగ్గుతూ ఉండటం వల్ల
ఓజోన్ పోరా దెబ్బతిని ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి
భూగర్భ జలాలు, భూసారం క్షీణిస్తున్నాయి.
కరువు కాటకాలు, ప్రకృతి  వైపరీత్యాలు తరచుగా సంభవిస్తున్నాయి

మనిషి జీవితంతో, ఆరోగ్యంతో ముడిపడిన ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నపుడే
నేటి మన పిల్లలు పెద్దయ్యే సరికి అందమైన ప్రకృతితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని
ఆయుష్షును వారికి అందించవచ్చు



Wednesday, 6 June 2018

సభ్యత లేని జనం


ఆకాశమంత పందిరి.. భూదేవి అంతపీట వేసి వివాహం చేయాలని అంటుం టారు.
ఆ స్థాయిలో కాకపోయినా ఇటీవల వివాహ వేడుకలను అదే తరహాలో నిర్వహిస్తున్నారు
ఒకప్పుడు బాగా ధనవంతులు ఇంట మాత్రమే కనిపించిన ఈ సంస్కృతి
ఇప్పుడు దాదాపుగా అంతటా వ్యాపించింది.
ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది.
ఎంతగా అంటే గ్రామాల్లో అంత భారీగా చేయలేకపోతే కళ్యాణ వేదికలను నగరాలు, పట్టణాల్లోకి మార్చుకుంటున్నారు
ఇప్పుడు పెళ్లంటే సినిమాలను తలపించే సెట్టింగులు.. కళ్లు జిగేల్‌మనిపించే విద్యుద్దీప కాంతులు..
స్వాగత తోరణం నుంచి పెళ్లి పందిరి వరకూ పూలతో డెకరేషన్..
పూలతో డెకరేషన్ అనగానే గుర్తుకొచ్చింది
కొన్ని రోజుల క్రితం బంధువుల వివాహానికి హాజరయ్యా.
అప్పుడు మాంచి ఎండాకాలం...
దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికి చేరుకునేసరికి
బాగా అలసిపోయినట్లనిపించింది.
గేటు దగ్గరకు చేరుకోగానే  వచ్చేవాల్లందరికి కాస్త
అత్తరు చల్లి చిరునవ్వుతో ఓ రెండు గులాబీలు చేతికిచ్చి పంపుతున్నారు.
అలా గులాబీలు తీసుకుని ముందుకు కదిలి హాలులోకి
ప్రవేశించానో లేదో ఒక పెద్ద పూలతోటలోకి మలుపు తిరిగినట్లనిపించింది.
ఒక్కసారిగా అలసటంతా తేలిపోయింది.
అక్కడ పందిరి డెకరేషన్ అనీ, వేదిక అలంకరణ, హాలు మొత్తం బొకేలు, దండలు అనీ లక్షల్లో పూలు.
గులాబీలు, చేమంతులు, ఆర్కిడ్లూ, జెర్బెరాలూ ఇలాంటివి ఎన్నో రకాల
సుకుమారంగా చూడచక్కగా ఉండి, మనసును ఆహ్లాదంలో ముంచెత్తే రంగురంగుల పువ్వులు 
అద్భుతంగా అలంకరించిన  కొన్ని వందల లక్ష పూలు.
సినిమాను తలపించే  సెట్టింగులో, జిగేల్ మనిపించే విద్యుద్దీప కాంతుల్లో
అలంకరణ ఇంకా అందంగా కనిపిస్తోంది. అలాగే చూస్తూండిపోయా.
ఈలోగా వధూవరులను ఆశీర్వదించటం మొదలైంది
నేనూ వరుసలో వెల్లి ఆశీర్వదించి వచ్చి కూర్చున్నా.
నాపక్కనే వచ్చి కూర్చున్న వాళ్ళ చేతిలో జర్బరా పూలు చూసి ఒకసారి వేదిక వైపు చూద్దునుకదా
 ఉదుద్ తుఫానులో ఆకులన్నీ రాలి బోసిపోయిన  మోడులా తయారైంది.
ఎంతమంది పనివాళ్ళు ఎంత శ్రమపడి అలంకరించి ఉంటారు.
అసలు పనివాళ్ళు అని అనటం సరికాదేమో కళాకారులని అనాలి
అటువంటిది వీళ్ళు కేవలం పది నిమిషాల్లో ఎలా పాడు చేశారు
బయట వెళ్ళేటప్పుడు  చూశాను .. కొందరు వెళ్ళిపోతున్న వాళ్ళు 
వాజుల్లోంచి యద్ధేచ్ఛగా, నిర్భయంగా, నిస్సిగ్గుగా గులాబీ, జర్బరా 
పువ్వులు గుత్తులు గుత్తులుగా తీసుకుని పోతున్నారు. 
అందరూ పువ్వులు తీసుకుపోతున్నారు.   
ఎవరైనా ఏమైనా అనుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా ఉండదా.
ఎంత శ్రమపడి వాళ్ళంతా పాపం వాటిని ఎరేంజ్ చేసి ఉంటారు.. 
ఎందుకనిజనాలకు కొన్ని విషయాల్లో సభ్యత,సంస్కారాలు  ఉండవు..?
అందమైన వాటిని సొంతం చేసుకునే తీరాలనే దుర్బుధ్ధి ఎందుకు?
దూరంనుంచి ఆస్వాదించి పోకూడదా? 
లేదా పెళ్లి పూర్తయ్యే దాకా ఆగకూడదా?.. 
నాలా వీరంతా ఎందుకు  అనుభూతి పొందలేదు ఏమో
సహజానుభూతులు కోల్పోయి జీవం ఘనీభవించిన
మనుష్యుల హృదయాలు అందాన్ని ఆస్వాదించలేవేమో..
జవాబు దొరకని ప్రశ్నలే !

Tuesday, 29 May 2018

మరణం తర్వాత మరెన్నో జీవితాలు

మరణాన్ని గెలవలనుకుంటున్నారా?
లేదు మరణం తర్వాత మళ్లీ
జీవించాలని ఆశిస్తున్నారా?
అయితే మీకున్నది ఒకే ఒక మార్గం
అదే
అవయవ దానం


మనిషి మరణానంతరం కళ్ళు, గుండె,
ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, 
జీర్ణ వ్యవస్థలోని ఫ్రాంకియాస్, 
చిన్న, పెద్ద ప్రేవులు, గుండె కవాటాలు, చర్మం,
ఎముకలు, నరాలు తదితర అవయవాలన్నీ
అవయవ మార్పిడీకి దానం చేయవచ్చు. 


అలా సేకరించిన వాటితో మరణం అంచున ఉన్న 
8 నుండి 10 మందికి ప్రాణ దానం చేయచ్చు 
ఇంకా మరో 50 మందికి కావలసిన అవయవాలను అందించి 
వారి జీవన విధానాన్ని మెరుగుపరచవచ్చు.
బ్రతికి ఉన్న దాత కూడా అవయవ దానం చేయవచ్చు 
తన జీవితంలో ఒకవ్యక్తి 
ఒక మూత్రపిండంను, క్లోమం యొక్క భాగంను,
మరియు కాలేయం యొక్క కొంత భాగంను దానం చేయవచ్చు. 
కానీ బతికి ఉన్నపుడు కుటుంబ సభ్యులు, 
రక్త సంబంధీకులకు మాత్రమే అవయవ దానం చేయవచ్చు.


ప్రంపంచంలోనే అత్యధికంగా స్పెయిన్లో  10లక్షలకు 34మంది, 
అమెరికాలో 26మంది అవయవ దానం చేస్తుండగా 
మన దేశంలో మాత్రం 0.8 మంది మాత్రమే 
అవయవ దాతలుగా ఉన్నారు.
మనదేశంలో నిరక్షరాస్యత, పేదరికం 
అమాయకత్వం, మూఢ నమ్మకాల కారణంగా 
దీనిపట్ల అవగాహన చాలా తక్కువ. 
ప్రభుత్వం, మీడియాఈ దిశగా ప్రజలను చైతన్యపరిస్తే 
ఎక్కువ మందిని అవయవ దానం వైపు మళ్లించవచ్చు. 
ఇప్పుడిప్పుడే ఆదిశగా అడుగులు పడుతున్నాయి.
హిందూ పురాణాల ప్రకారం మొదటి అవయవ మార్పిడి 
వినాయకుడికి జరిగింది. ఇక ఆధునిక వైద్య చరిత్రలో 1905 లో 
కార్నియల్ ట్రాన్స్ ప్లాంటేషన్ తో మొదలైంది.

అవయవదానానికి 10 ఏళ్ళ వయసు నుండి 90 ఏళ్ళ
వయసు వారెవరైనా అర్హులే.
దేశవ్యాప్తంగా అవయవాల దానం
కోసం ఏటా 5 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. 
వీరందరికోసం రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ కేసుల పైననే 
ఎక్కువగా ఆధార పడవలసి వస్తోంది. 
సాధారణ మరణాలప్పుడు కూడా 
అవయవ దానం జరిగితే  కొంత కొరత తీరినట్టే.
అవయవ దానం చేసినవారి కుటుంబాల్లో పిల్లలకు 
మోహన్ బాబు తమ విద్యాసంస్థల్లో 
5వ తరగతి నుంచి పీజీ వరకూ ఉచిత విద్యను అందిస్తానని
2015 లో ప్రకటించి తన సామాజిక బాధ్యత ను నిర్వర్తిస్తున్నారు. 
అలాగే ప్రతిఒక్కరు అవయవ దానాన్ని  ఒక బాధ్యతగా స్వీకరిస్తే 
ఏటా జరుగుతున్న 5లక్షల మరణాలలో కొన్నింటినైనా ఆపవచ్చు.



అవయవ దానం చేయాలనుకునే వారు ఈ క్రింది లంకె పై క్లిక్ చేయండి
 Link  👉 ( మరణం తర్వాత నాకు మరో జీవితం కావాలి  )

Tuesday, 17 April 2018

మెట్రో రైలు

మొన్నామధ్య ఒకసారి  హైదరాబాద్ వెళ్ళినప్పుడు మెట్రో రైలు ఎక్కాలని అనుకున్నాను.
అప్పటికి ప్రారంభమై ఓ పది రోజులు అయిఉండొచ్చు.
విపరీతమైన రద్దీ కారణంచేత కుదరలేదు.
ఎందుకంటే ముఖ్యమైన పనులు చాల ఉన్నాయి.
వరంగల్లో బయల్దేరి ఉప్పల్ రింగ్ రోడ్ లో దిగితే
మెట్రో కంటే ముందే నేను వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళొచ్చు.
అయినా దాంట్లో ఎక్కాలంటే సవాలక్ష రూల్స్ ఉంటాయని
గతంలో పేపర్లో చదివాను కాబట్టి అటువైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను.
ఎందుకంటే టికెట్ తీసుకొని రైలెక్కడం తెలుసు
రెండు టోకెన్లు తీసుకొని ఎక్కినచోట ఒకటి దిగినచోట ఒకటి ఇవ్వాలట.
స్టేషన్ లో కూడా టైం ప్రకారమే ఉండాలట.
అదికూడా చాలా పద్దతిగా ఉండాలట.
ట్రైన్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదట.
సేల్ఫీలు దిగ కూడదు అంటూ
ఇలా సవాలక్ష.
ఈ గొడవంతానాకెందుకులే అని ఊరుకున్నా.
తర్వాత
హైదరాబాద్ మిత్రులు  ఒకసారి ఫోన్ చేసి
వచ్చినపుడు కలవనే లేదు. ఈసారి వచ్చినపుడు రారా
అలా మెట్రో ఎక్కుదువుగాని  అన్నారు
ఎందుకులేరా అన్నాన్నేను
ఏరా అన్నారు
నాకున్న భయాలు చెపితే నవ్వి ఊరుకున్నారు.
కాని వాళ్ళు మెట్రో దగ్గర దిగిన ఫోటోలు వాట్సప్ లో పంపినప్పుడు
అర్థం అయింది పెద్దగ జనం లేరు కాబట్టి నిబంధనలు ఎత్తేసారేమో అని.
అట్లయితే ఈసారి వెళ్ళినపుడు నేనుకూడా ఎక్కాలి అనుకున్నా..
అయినా ఎవరో ఒక ఫ్రెండ్ ను వెంటబెట్టుకొనే ఎక్కాలె..

స్నేహం

ఈమధ్య నన్ను చాలా  బాధ పెట్టిన విషయం
నా ఇద్దరు  మిత్రుల  మరణం.
మిత్రులంటే .... బాల్యమిత్రులు  ..
ఒకరేమో తిరుపతి రెడ్డి (హనుమకొండ)
ఇంకొకరేమో  పేరు సత్తిబాబు.
విశాఖ జిల్లా పాడేరు, అరకు వ్యాలీ  దగ్గర చిన్న వూరు మఠం.
కానీ చదివింది  వరంగల్ దగ్గరలోని ఓకే రెసిడెన్షియల్ స్కూల్ లో.(1986-90)

10వ తరగతి తర్వాత నేను కాలేజ్ హైదరాబాదు లో చేస్తే
సత్తిబాబు  పాడేరు లో చేసాడు. 
మేము విడిపోయిన తర్వాత
కొన్ని సంవత్సరాలు ఉత్తరాలు వ్రాసుకునేవాల్లం. 
కానీ 1997  సం నుండి ఆగి పోయాయి.
కానీ ఈమధ్య మళ్లీ తనను కలవాలి లేదా
కనీసం  మాట్లాడాలని అనిపించింది.
ఎలా? లెటర్ వ్రాస్తే తిరిగి వస్తున్నాయి. 
కానీ వాడితో  ఎలాగైనా మాట్లాడాలనే బలీయమైన  కోరికతో
ఒకసారి వైజాగ్ వెళ్లి రావాలని నేను ఇంకో మిత్రుడు ప్లాన్ చేసుకున్నాం.
కాని చివరి నిమిషంలో రద్దైంది.
ఇక కథ మళ్ళీ మొదటికొచ్చింది.
అప్పుడు ఒక్క ఐడియా వాడితో మాట్లాడేలా చేసింది.
అది google సెర్చ్ తో సాధ్యం అయింది.
నేను ఉత్తరాలు రాసేవాడ్ని కాబట్టి ఆ రూట్లోనే ప్రయత్నం చేశా.
ఫలించింది.
మొదట పాడేరు పోస్ట్ ఆఫీస్ నంబరు సెర్చ్ చేశా ,
నాలుగు నంబర్లు వచ్చాయి.
అందులో రెండు పనిచేయటంలేదు,
ఒకటి చాలాసేపు ఎంగేజ్ వచ్చింది.
ఇక చివరి నంబర్ ...
కలుస్తుందా లేదా ??
చూద్దాం కలవకపోతే ఇంకేదైనా మార్గం చూడాలి
అనుకుంటూనే చేశా . అవతల ఫోన్ లిఫ్ట్ చేయగానే
ఒక్కసారి పట్టలేని సంతోషం.
వరంగల్ నుంచి మాట్లాడుతున్నా అనటంతో
కొంచం ఆసక్తిగా ఏంకావాలి అని అడిగారు.
మఠం పోస్ట్ ఆఫీస్ ఫోన్ నంబర్ కావాలి అన్నాను.
మాదగ్గర లేదు అని సమాధానం వచ్చింది.
25సంవత్సరాల క్రితం నేను, నా మిత్రుడు కలసి
చదువుకున్నదీ , అన్నీ వివరించా.
మాస్టారూ అని ఎవరినో  పిలుస్తూ నన్ను కాసేపాగి ఫోన్ చేయమన్నాడు.
కాని 10 నిమిషాల్లో తనే చేసి మా దగ్గర లేదు
కాని హుకుంపేట నంబర్ ఇస్తాను అక్కడ అడగండి అన్నాడు.
వెంటనే నంబర్ తీసుకుని ఫోన్ చేశా.
మఠం ఫోన్ నెంబర్ అడగ్గానే ఎందుకు అని ప్రశ్న.
విషయం వివరించగానే ఆశ్చర్యపోయి ఒక్క నిమిషం ఉండండి
మఠం పోస్ట్ మాస్టర్ ఇక్కడే ఉన్నాడు అని ఎవరినో
పంపించాడు తీసుకురమ్మని. తిరిగి వచ్చిన అతను వెళ్లిపోయాడని
చెప్పటంతో నాకు నంబెర్ ఇస్తూ ఫోన్ సరిగా కలవదు
సిగ్నల్  ప్రాబ్లం  చేస్తూ ఉండండి అని చెప్పటంతో
సందేహిస్తూనే ఫోన్ చేశా కలవలేదు.
వెంటనే ఒక ఐడియా తట్టింది.
కాల్ బ్యాక్  చేయమని మెసేజ్ పెట్టి
డెలివరీ రిపోర్ట్ ఆన్ చేసి పెట్టాను.
ఒక గంటకు మెసేజ్ చేరినట్టుగా రెప్లై
రావటంతో నేనే ఫోన్ చేశా.
అతనికీ విషయం వివరించటంతో  తను మా బంధువే
కాని దూరంగా ఉంటారు సాయంత్రం మాట్లాడిస్తాను అనటంతో
ఎదురు చూస్తూ ఉన్నా.
 సాయంత్రం ఆరు గంటలప్పుడు ఫోన్ వచ్చింది .
మాట్లాడాను ...
వాడే..
దాదాపు  ఇరవై ఏడు  సంవత్సరాల తర్వాత
 ఆ గొంతు విన్న ఎంతో ఆనందంతో మాట్లాడా.
వాడు మాత్రం ఏడ్చాడు,, అవును
సంతోషం లోను కష్టంలోనూ కూడా కళ్ళువర్షిస్తాయి 
కానీభేదం ఒక్కటే  ఆనందాశ్రువులు కన్ను దాటి బయటకు రావు
కన్నీళ్లు కంట్లో ఆగనూలేవు 
ఇన్ని రోజుల తర్వాత మాట్లాడిన సంతోషం
ఎన్నో రోజులు నిలవదని అప్పుడు ఊహించలేదు ..
తర్వాత ఒక నెలలోపే వాడు హైపటైటిస్ బారిన పడి మరణించాడు
అదీ మేము ఫోన్ చేస్తే వాడి అబ్బాయి చెప్పే దాక తెలియలేదు.
ఇరవైసంవత్సరాలుగా లేనిది
వాడితో మాట్లాడాలని ఎందుకు అనిపించిందో కదా...
కేవలం ఈ దుర్వార్త వినడానికేనా ...

ఇక తిరుపతిరెడ్డి కూడా ఒకే స్కూల్
తను చాలా పెద్ద కాంట్రాక్టర్
ఎప్పుడు ఫోన్ చేసినా చాలా కూల్ గా మాట్లాడేవాడు
స్కూల్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు
ఫోన్ చేస్తే ఎక్కువగా మాట్లాడేవాడు
కాని చిన్నప్పటి అందరి మిత్రుల గురించి మాత్రం
తప్పక అడిగి తెలుసుకొనేవాడు
అందరూ లైఫ్ లో సెటిల్ అయ్యారా అని అడిగేవాడు.
ఎప్పుడూ ఎదో బిజీగా ఉండేవాడు
కానీ ఎప్పుడు కూడా అలా మాట్లాడే వాడు కాదు.
అందరం ఒకసారి కలుద్దాం
నేనే అన్నీ అరేంజ్ చేస్తాను వచ్చేయండి అనేవాడు.
ఉద్యోగాలు వ్యాపారాల్లో ఉంది అందరం కలవలేకపోయేవాళ్ళం .
ఎవరికీ ఏ సహాయం అవసరమైనా వెంటనే ఫోన్ చేయమనేవాడు.
మనసారా వీడు నా స్నేహితుడు అని గర్వంగా చెప్పుకోవడంలో 
ఏదో తెలియని దర్పం కనిపించేది 
కొన్నిరోజుల క్రితం వాడికి కాన్సర్ వచ్చింది అని తెలియగానే
అందరం వెళ్లి కలవాలనుకున్నాం.
కాని ఒకరోజు ఉదయాన నా  మొబైల్ కి ఒక మేసేజ్ వచ్చింది
ఇక లేడని....
మేము వెళ్ళే లోపే వాడు వెళ్లిపోతాడనుకోలేదు.
ఇందుకేనా వాడు అందరమూ ఒకసారి కలుద్దామని అన్నది
మాకు అర్థం కాలేదురా సారీ.....
అప్పుడు మరొక్కసారి అనిపించింది.

సంతోషం లోను బాధ లోనూ కళ్ళువర్షిస్తాయి 
కానీభేదం ఒక్కటే  ఆనందాశ్రువులు కన్ను దాటి బయటకు రావు
కన్నీళ్లు కంట్లో ఆగనూలేవు 

కులమతాలు, వేషభాషలు, ప్రాంతీయ బేధాలకు అతీతంగా అంకురించే సౌరభమే స్నేహం.
మంచిని, చెడుని గమనిస్తూ... అవసరమైనప్పుడు మందలిస్తూ మలగడం మనసెరిగిన మిత్రుడికే సాధ్యం.

Monday, 9 April 2018

సెలవులు

సెలవు!
ఈ మాట వింటేనే చెవిలో అమృతం పోసినట్టుగా ఉంటుంది చాలా మందికి.
ఇక పిల్లలకో.. వేసవి సెలవులంటే......ఎంత సంతోషం
స్కూల్, ట్యూషన్, హోంవర్క్ అన్నీ బంద్.




చిన్నప్పుడైతే ఎంత సరదాగా ఉండేదో,
వేసవి సెలవులు వచ్చాయంటే చాలు
మా వయసు పిల్లలతో ఇల్లంతా నిండిపోయేది.
ఒకటే అల్లరి
పొద్దున్న పొతే ఏ వేప చెట్టుకిందో చింత చెట్టుకిందో మా అడ్రస్
గోలీలాట, చిర్రగోనే ,పల్లీ, పొద్దున్న పొతే సాయంత్రందాక
ఇక ఇంటికి వచ్చేది పొద్దుగూకినంకనే.

తాటి ముంజలు, ఈతకాయలు వాటికోసం పాట్లు చెప్పనవసరమే లేదు
సీమ చింతకాయలు సరేసరి.

అప్పుడప్పుడు చింతపండు గింజ తీయటం, సాయంత్రం ఐతే
ఊరి చెరువు దగ్గర ఉన్న బావి నుండి బిందెల కొద్దీ నీళ్ళు తేవడం
సరదాగా గడిచిపోయేది.

కాని ఇప్పుడు పిల్లల్ని ఆడుకోనిచ్చే తల్లితండ్రులు ఎంతమంది ఉన్నారు.
చదవాలి, ఇంకాచదవాలి లేదంటే సమ్మర్ క్యాంపుల్లో ఎదో ఒకటి నేర్చుకోవాలి.


వేసవి = ఆహ్లాదకరమైన ఉదయాలు + విసుగెత్తించే మధ్యాహ్నాలు + ఫర్వాలేదనిపించే సాయంత్రాలు + టన్నులకొద్దీ మామిడికాయలు + గ్యాలన్ల కొద్దీ కొబ్బరి నీళ్లు +  గంటలకొద్దీ ఆటలు ముందే ఊహించిన ఊహించని బంధువులు అని ఎక్కడో చదివిన గుర్తు 

పైన నేను రాసిందంతా మీకు కూడా ఖచ్చితంగా చిన్నప్పుడు ఎప్పుడోకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటుంది కదా 
ఐతే కామెంట్ రాయండి 

Wednesday, 21 March 2018

భూమ్మీద నూకలు చెల్లకుండా ఉండాలంటే

ఎపుడైనా కొత్త వాళ్ళు కాని, చాల రోజుల తర్వాత కలిసిన మిత్రులుకాని
నన్ను, పిల్లల్ని ఒక్క చోట చూస్తే మాత్రం ఆశ్చర్య పోతుంటారు.
నలభై దాటినా ఇరవై లాగే పిల్లలతో సమానంగా ఉన్నావు అంటారు.
మా ఫ్రెండ్స్ నన్ను తరచుగా అడిగే మాట కూడా ఇదే
ఎలా ఇంత బాగా  fitness మేంటైన్ చేస్తున్నావు అని.
ఆ రహస్యం ఏంటో మాకూ చెప్పకూడదు అంటుంటారు.
నేను మాత్రం తలకు రంగు వేసుకోకపోతే 
వీళ్ళే నన్ను ముసలోడివైపోయావురోయ్ 
అనేవాళ్ళని నవ్వుకునేవాడిని. నేను కూడా 
రెండు మూడేళ్ళ క్రితం వరకు జుట్టుకు రంగు వేసేవాడినే కాదు.
అలా వేసుకొని ఒకసారి మా అమ్మాయి వాళ్ళ కాలేజికి వెళ్తే 
అక్కడ స్టాఫ్ నన్ను పేరెంట్ అంటే నమ్మనే లేదు.
ఇక పిల్లలైతే వెళ్లి మీ అన్నయ్యోచ్చాడు అని చెప్పటంతో 
మా అమ్మాయీ నవ్వుకుంది. అప్పుడు రంగు వేసుకోవటం మానేస్తే... 
మరీ వెంట్రుకలు తెల్లబడిపోయాయని ఈ మధ్యే మళ్ళీ మొదలెట్టాను.

ఇక టాపిక్ లోకి వస్తే...
ఎవరైనా చనిపోతే
భూమ్మీద నూకలు చెల్లిపోయాయి అనటం మనం చూస్తుంటాం.
అసలు అర్థం అంతా అందులోనే ఉంది.
మనం తక్కువగా తిని ఎక్కువరోజులు బతుకొచ్చు అని.-
సాధారణంగా ఎక్కువ పని చేసే  ఒక మనిషికి శాస్త్రీయంగా 
రోజుకి 2000 క్యాలరీల శక్తికితగ్గ ఆహార పదార్ధాలు కావాలి . 
దానిని 1200 లకో, 1300 లకో తగ్గించుకుంటే ఎక్కువకాలం బ్రతకొచ్చట. 
అలా తగ్గించాలంటే జివ్హచాపల్యం చంపుకోలేని వాళ్ళు ఎన్నో 
 కష్టాలు పడాలి మరి. నలభై ఏళ్ళు వచ్చిన తరువాత
మన శరీర జీవక్రియల వేగం తక్కువవుతుంది కాబట్టి వ్యాయామం తో పాటు
క్యాలరీలు తగ్గించాలి మరి. యుక్తవయస్సు లో ఉన్నప్పుడు రాల్లైన 
అరిగించుకోవచ్చు అని కొసరి కొసరి వడ్డించే వాళ్ళనిప్రేమతో 
ఏమి అనకపోయినా నలభై దాటాక మాత్రం 
నిర్మొహమాటంగా వద్దని చెప్పాల్సిందే. అథవా తిన్నా ఎదో ఒక వ్యాయామం 
చేసి తిన్నది కాస్తా కొవ్వుగా మారక  ముందే  కరిగించాల్సిందే.
ఇది చదివాక కూడా మీరు మారలేదనుకోండి నేనేమీ చేయలేను 
నాలా షాపులో కూర్చునేవాడికి, సాఫ్టువేరు వాళ్లకు, కుర్చీ లోంచి లేవకుండా పని
చేసుకోనేవాల్లకు  రోజుకి 1500-1700 కాలరీలు అవసరం
ఇక మీ మీ అవసరాల ద్రష్ట్యా మీకు ఎంత అవసరమో తినండి .
నా మట్టుకు నేను  మాత్రం తినేదేదైన 1200-1500 కాలరీల వరకు ఉండేలా
 కూరలు ఎక్కువగాను అన్నం తక్కువగాను అదీ కూడా మూడు పూటలు
తినేలా ప్లాన్ చేసుకున్నాను.  ఇక మీరు కూడా  మీకోసం
 దేవుడిచ్చిన నూకలు పొదుపుగా వాడుకొంటే ఎక్కువ రోజులు  ఫిట్ గా బతకొచ్చు.
(తక్కువ తినేవారే ఎక్కువ కాలం బ్రతుకుతారని శాస్త్రీయంగా ధ్రువీకరింపబడింది)

Tuesday, 6 March 2018

నాకో తుపాకీ కావాలి


స్త్రీ గౌరవాన్ని మలినం చేస్తూ స్శర్శించే ఒక మగవాడి దురహంకారాన్ని 
సమాజంలోంచి చంపేసి, తుదముట్టించే తుపాకి కావాలి . 

అభంశుభం తెలియని  బాలల జీవితాలను చిద్రం చేసే కర్కోటకులను కడతేర్చే తుపాకీ కావాలి.

కోట్లాది అమాయక ప్రజల  జీవితాలని బలి తీసుకుంటున్న 
ఉగ్రమూలాల్ని  సమూలంగా పెకిలించే  తుపాకి కావాలి .

చట్టాలను అతిక్రమించే చుట్టాలను తుదముట్టించే తుపాకీ కావాలి. 

ఆర్టిక అసమానతలను పెంచుతున్న విధానాలని నిషేధించే తుపాకీ కావాలి.

మతం పేరుతొ జనం ప్రాణాల్ని హరిస్తున్న మూర్ఖులను  నిలువరించే తుపాకీ కావాలి.

ఆ తుపాకి మోత వింటే చాలు ఎవరైనా తప్పు చేయాలంటేనే భయపడాలి .

అటువంటి ఒక తుపాకి నాకు కావాలి 

"ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే "

అన్న మాట మరిచిన ఓ గోపాల....
 
నీ పాంచజన్యాన్ని తుపాకిగా నాకందించు!

కృత, త్రేత, ద్వాపర యుగాలను మించిన స్వర్ణ యుగాన్ని నేనీ ప్రపంచానికందిస్తా.



Tuesday, 27 February 2018

పెళ్లి లాంటి నిశ్చితార్ధం


నా చిన్నప్పుడు నిశ్చితార్ధం అంటే 
ఓ పది మంది మగ పెళ్లి వాళ్ళు వచ్చి అమ్మాయి మెళ్ళో 
ఎదో ఒక నగ వేసి, బట్టలు, "పూలు పండ్లు" పెట్టి వెళ్ళేవారు.
ఆడపెళ్ళి వాళ్ళు సైతం ఓ పదిమంది వెళ్లి వరునికి 
ఏ సైకిలో గడియారమో ముట్టజెప్పి కాసిన్ని డబ్బులతో "వరపూజ" చేసెటోల్లు.
అదికూడా కాస్త పెళ్ళికి ఎక్కువ సమయం ఉంటేనే.
అదీ లేకుంటే ఇంకాస్త చిన్నగానే చేసేవాళ్ళు.
అప్పుడే లగ్నపత్రికలు రాయించుకొని మార్చుకోనేవాళ్ళు. 
అంతే అంతటితో నిశ్చితార్థం అయిపోయినట్టే.

కాని ఈమధ్యకాలంలో 
పెళ్ళికి నిశ్చితార్దానికి పెద్దగా తేడా ఉండడంలేదు
పెళ్ళికి వచినంత చుట్టాలు, హంగు ఆర్భాటాలు
ఉంటున్నాయి.
జిలకర బెల్లం, తాళిబొట్టు తప్పించి అన్నీ ఉంటున్నాయి.
దాదాపు పెళ్లి లాగాఆర్భాటాలు, బంధువులు, 
ఆర్కెస్ట్రా, డాన్స్ లు....
వెల్ కం డ్రింక్నుండి మొదలుకొని ఆఖర్న ఐస్ క్రీం వరకు 
పళ్ళెం లో కనీసం ఇరవై రకాల పైననే ఉంటున్నాయి.

ఇక అతిథుల ముందు ఉంగరాలు మార్చుకోవడం 
తోటి మొదలవుతుంది ఫోటోల తంతు 
సినిమా షూటింగు లను తలపించేలా  
ఓ క్రేను,ఐదారుగురు కేమరామేన్లు... 
అబ్బో అదో అన్నపూర్ణ స్టూడియో ,
(నా కాలేజ్ రోజుల్లో యూసుఫ్ గూడలో ఉన్నప్పుడు 
అన్నపూర్ణ స్టుడియోలో షూటింగ్ చూడ్డానికి వెళ్ళా )
అదే గుర్తుకొస్తుంది.

ఏదేమైనా ఈ అనవసరపు ఆర్భాటాలు 
పెళ్ళికూతురి తండ్రికి ఆర్ధిక భారాన్ని మోపేవే  తప్పించి 
పెద్దగా అవసరం లేదని నా అభిప్రాయం...

Tuesday, 13 February 2018

అన్నా మనం చేపలు తినవచ్చా?


అన్నా మనం చేపలు తినవచ్చా?
అంటూ ఒక మిత్రుడు అడిగిన ప్రశ్న ఈ పోస్ట్ రాసేందుకు ఉపక్రమించేలా చేసింది.

వాస్తవానికి శాకాహారం వలన సాత్విక లక్షణాలు పెరుగుతాయి.
మాంసాహారం తినటం వలన కలిగే రజో గుణం మనల్ని తప్పు దారిలో నడిపిస్తుంది.
అదే సాత్విక గుణం మనల్ని ధర్మాధర్మ విచక్షణ చేసే స్థితిలో ఉంచి జ్ఞానం వైపు నడిపిస్తుంది. 

అందుకే ప్రాచీన కాలంలో సమాజంలో ఆచార్యులుగా వ్యవరించే బ్రాహ్మణులకు,
వ్యాపార వర్గాలైన వైశ్యులకు ఇంకా మరికొన్ని సామాజిక వర్గాలకు నిషేధించి ఉండవచ్చు.
వీళ్ళకే ఎక్కువగా సహనాన్ని, శాంతిని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.

ఎంతకాలం మానవులు జీవులను హింసిస్తుంటారో, చంపుతుంటారో అంత కాలం యుద్ధాలుంటాయి అని  జార్జి బెర్నాడ్ షా అన్నారు 

హిందువులు, బౌద్దులు, జైనులు ఎక్కువగా ఉండే భారత్, నేపాల్, భూటాన్,శ్రీలంక తదితర దేశాలలో శాకాహారుల జనాభా మొదటి నుంచి ఎ క్కువగానే ఉంది. మాంసాహారంపై మతపరమైన ఆంక్షలేవీ లేని పాశ్చాత్య ప్రపంచంలో మా త్రం శాకాహారుల జనాభా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది .
కొన్ని నివేదికల ప్రక్కరం భారతదేశంలో 31 శాతం,బ్రిటన్‌లో 21 వాతం, యురోప్‌లో 10 శాతం,అమెరికాలో 4 శాతం శాకాహారులు ఉన్నారట.
మాంసాహారులు ఎక్కువగా ఉండే స్పెయిన్, నెదర్లాండ్, స్వీడన్, ఇజ్రాయిల్ వంటి యురోపియన్ దేశాల్లో.... కానీ మన దేశంలో తగ్గుతున్నాయి.

ఇక  నాలాంటి శాకా హారులుగానే ఉందామనుకునే నిర్ణయమున్న
వారికి బయటకెళ్లి తినటం అనేది జటిలంగా
మరుతోంది మన శాకాహార దేశంలో నిజమేనండీ !!
నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను శాకాహారులు తగ్గిపోవడం వల్ల.
నలుగురితో కలసి పార్టీ లకు, ఫంక్షన్లకు  వెళ్ళాలంటే
నా వల్ల వారికి, వారి వల్ల నాకు ఇబ్బంది కలుగుతోంది.
ఏదైనా వెజ్ ఆర్డర్ చేస్తే దానిలో ముక్కలు తీసేసి
తీసుకోస్తారని అనుమానం బాగా.. ఇంకా బిర్యానికి ఇచ్చే సూప్ ఐతే మరీ.. 
గతంలో ఒకసారి కేరళ టూర్ వెళ్ళినపుడు భోజనానికి చాలా ఇబ్బంది అన్నాను కదా.  clik hear
మాతో వచ్చిన ఒక మిత్రుని కోసం ప్యూర్ వెజ్ హోటల్ కోసం గంటన్నర వెదకాల్సి వచ్చింది.

Saturday, 3 February 2018

గుడిలేదు గోపురంలేదు అయినా కోట్లాది జనం



ఈ రోజే జాతర చివరి రోజు కావటంతో , దేవతల వనప్రవేశంలోపు వెళ్లాలని ఉదయాన్నే బయల్దేరనుకున్నాం.



ఎందుకంటే దాదాపు 100 కిలోమీటర్లు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుంటే
 ఓ రెండున్నర గంటల్లో వెళ్ళొచ్చు కాని జామ్ అయితే అమ్మల దర్శనం కుదరదని
ముందుగానే రెడీ అయి వెళ్ళినా భయపడినంతా అయింది.
 ట్రాఫిక్ జామ్ లో దాదాపు గంటన్నర ఆగిపోవాల్సివచ్చింది. ఎప్పుడూ  ట్రాఫిక్ జామ్ లు ఎరుగని మాకు ఇవి మాకు కాస్త విసుగనిపించింది. కానీ మా హైదరాబాద్ లాంటి నగరవాసులకు అలవాటే అని పక్క సీటు లో కూర్చున్నతను అన్నాడు. దాదాపు 200 కిలోమీటర్లు వన్ వే చేసినా, కొన్నిచోట్ల అధికార్ల సమన్వయలోపం, కొందరు వాహనదార్ల అత్యుత్సాహం, ముందుగా వెళ్ళాలనే తపనతో అడ్డ దిడ్డంగా వెళ్ళటం ట్రాఫిక్ జామ్కి కారణమట. అయినా మేడారం చేరేసరికి మధ్యాహ్నం రెండైనా
మా తమ్ముడి బంధువు గుడి దగ్గర డ్యూటీలో ఉండటంతో vip దర్శనం పది నిమిషాల్లో అయింది.
కాని గద్దెల దగ్గరికి వెళ్ళగానే మిత్రుడు చెప్పినట్టు
గుడిలేదు గోపురంలేదు                  
అర్చనలేదు అభిషేకం అంతకన్నాలేదు                           
తీర్థంలేదు తియ్యని లడ్డులేదు        
 మడిలేదు మంగళహారతిలేదు 
కోలవడానికి ఓ రూపంలేదు 
కలవడానికి ప్రత్యేకదారుల్లేవు   
ఉన్నదొక్కటే నమ్మకం 'అమ్మ' అంటే ఆకలితీరుస్తది' 
ఆనమ్మకమే 'సమ్మక్క-సారక్క అనిపించింది. 
ఒకప్పుడు వేళల్లో ఉన్న భక్తులు కోట్లకు చేరటమే అందుకు నిదర్శనం.
ఇక్కడ క్లిక్ చేయండి వివరాలకు 
తెచ్చిన బంగారం(బెల్లం), టెంకాయలు అమ్మలకు సమర్పించి 
బయటకు రాగానే జ్యోతిష్యం చేపుతామంటూ కోయదొరలు,
పూసలదండలు, రుద్రాక్ష మాలలు కొనండని ఒకరు,
బొమ్మలు కొనమని ఇంకొకరు, వాళ్ళందరిని తప్పించుకొని
తెచ్చుకున్న  భోజనాలు ముగించుకొని తిరుగుప్రయానమయ్యాం
అమ్మల ఆశీర్వాదంతో,

గిరిజన మ్యూజియం


వేలాది బస్సులు ఒకే చోట 

Saturday, 20 January 2018

భక్తి


TV సరిగా రాకపోవటంతో ట్యూనింగ్ మొదలుపెట్టా 
దాదాపు 300 చానల్స్  వస్తున్నా తెలుగువి మాత్రం ఓ 50 ఉండొచ్చు.
అందులో భక్తి ,దైవసంబధిత మతపరమైన విషయాలను బోధించే చానల్స్ కూడా చాలానే కనిపించాయి
ఒక్క తెలుగులోనే 10కి పైగా  కనిపించాయి.
ఇది ఒకందుకు మంచిదే అనిపించింది.
మతం మనుషులకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అంటే 
భక్తి భావం మనిషిలో విలువలను మాత్రం  పెంచుతుంది. 
అది ఏ మతమైనా కావచ్చు దైవాన్ని విశ్వసించే వాడు మొత్తం సమాజం మంచిని కోరుతారు.
అని నా నమ్మకం.
ఇక ఒక్క మానసిక ప్రశాంతత తప్ప అన్ని రకాలైన ఆధునిక సౌకర్యాలనూ 
మనిషి అత్యంత సులువుగా పొందుతున్నాడు. 
అందుకే ప్రశాంతత కోసం మనిషి దేవుడిని ఆశ్రయిస్తున్నాడు .
మనం గమనిస్తే ఇప్పుడు ఆలయాలను సందర్శించే వారిలో పెద్దవాళ్ళ కంటే  
యువతీ యువకులే ఎక్కువగా కనిపిస్తున్నారు .
మనిషి జీవితంలో కష్టాలు పెరిగినా కొద్దీ  దైవంపై భక్తి మరింతగా పెరుగుతుంది కదా.
ఈ నమ్మకం అతనికి కొంత మానసిక ప్రశాంతతను పాజిటివ్ థింకింగ్ను
ఇస్తుంది అంతే తప్ప వారికి గానీ సమాజానికి గానీ నష్టమేమీ లేదు.
ఐతే భక్తి, మత సంబధిత విషయాలలో, మత గురువులు, ప్రబోధకుల విషయాలలో
చానల్స్ కొంత విచక్షణతో వ్యవహరిస్తే బాగుంటుంది .
గురువులు, ప్రబోధకులను పిలిచి డిబేట్ లు పెట్టేటప్పుడు ఆయా విషయాలపై 
తమకు అవగాహన ఉన్నదా, చర్చించే తాహతు తమకుందా, తదుపరి పర్యవసానాలు 
ఏమిటీ అని ముందే చూసుకుని బేరీజు వేసుకుంటే  మంచిది. 
(ఇట్లా డిబేట్ లు పెట్టేఒక చానల్ గతంలో సర్వమత చానల్ అంటూ ఒక చానల్ను 
ప్రారంభించి తక్కువ సమయంలోనే మూసుకున్నది గుర్తుండే ఉంటుంది )
ప్రేక్షకులు కూడా తమ విచక్షణ తో అటువంటి చానల్స్ ను పక్కన పెడితే మంచిది.
ఏదేమైనా భక్తీ అనేది మనిషిలో ప్రశాంతతను, సాత్వికతను,భూత దయను 
కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

Tuesday, 16 January 2018

మ్యూజియంలో మన పండగలు


దేశంలోని వివిధ సాంప్రదాయక పండగలని, భిన్న ప్రాంతాల కళలను
 పరిచయం చేసేందుకు ఏర్పాటైన శిల్పారామంలో
ఇక్కడి  మన స్థానిక సాంప్రదాయ పండగలని కూడా
కొత్తగా ఎక్కడివో అన్నట్టు వింతగా  చూడవలిసి రావటం ..
అంటే ఆధునికత ముసుగులో మనం మన సంప్రదాయాల్ని, రుచులని ఎలా మరచిపోతున్నామో అద్దం పడుతోంది.

నిన్న ఒక మిత్రుడికి  శుభాకాంక్షలుచెబుతామని ఫోన్ చేస్తే
మాటల  మధ్యలో శిల్పారామం వెళ్లిందీ అక్కడ మన సంక్రాంతి హరిదాసులు,
గంగిరెద్దులవాళ్ళు, బుడబుక్కల వాళ్ళను చూసి పిల్లలు సంతోష పడ్డారని చెప్పాడు.
చిన్నప్పుడు చాల మంది ఇలాంటి వాళ్ళు పండగలకి మన ఊళ్లలో వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు
వస్తున్నారా అన్నాడు.
ఏం వస్తార్రా బాబు మొన్ననే  హైదరాబాద్లో గంగిరెద్దుల వాళ్ళని భిక్షగాల్లంటూ అరెస్ట్ చేసారట
కదా అన్నా, అవునురా అలా  అరెస్ట్ చేయడం ఎందుకు? మళ్ళా  వాళ్ళని శిల్పారామంలో ప్రదర్శనల కోసమని ఆంధ్రా నుండి పిలిపించటం ఎందుకు? అన్నాడు

ఇప్పటికే మన పండగల కంటే ఎక్కువ స్థాయిలో ఇంగ్లిషోడి పండగలే జరుపుకుంటున్నాం.
మన సాంప్రదాయ పిండి వంటలకంటే వాడి పిజ్జా బుర్గర్ లే మనకు నచ్చుతున్నాయి.
ఏమోరా! ఇలాగైతే మన పండగలని మన పిల్లలిక మ్యుజియంలోనే చూసుకోవాలి అన్నాడు.

పండగలు మనకు మన పూర్వీకులు ఇచ్చిన వరం.
దీంట్లో ఎన్నో ఆహార,  ఆరోగ్య, వ్యవహారిక సూత్రాలు ఇమిడి ఉన్నాయి.
బెల్లం నువ్వుండలు, అరిసెలు, కొత్తబియ్యంతో చేసిన పిండి వంటలు
చలికాలంలో శరీరానికి వేడిని అందించి సంవత్సరమంతా
ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి .
ఇలా ప్రతి పండగకి వండే  ప్రసాదాలు ఆయా కాలాలకు అనుగుణంగా ఆరోగ్య సూత్రాలను
ఇముడ్చుకొని ఉంటాయి.
కాని గ్లోబలైజేషన్, మోడరన్ కల్చర్ ముసుగులో
మన సాంప్రదాయాలను ఫణంగా పెడుతున్నాం అనిపిస్తోంది
ఎంత అభివృద్ధి చెందిన మన మూలాల్ని మాత్రం మరవకూడదు.
అలా మరచిపోయిననాడు మ్యుజియంలే దిక్కు మనకు  .....