Tuesday, 27 February 2018

పెళ్లి లాంటి నిశ్చితార్ధం


నా చిన్నప్పుడు నిశ్చితార్ధం అంటే 
ఓ పది మంది మగ పెళ్లి వాళ్ళు వచ్చి అమ్మాయి మెళ్ళో 
ఎదో ఒక నగ వేసి, బట్టలు, "పూలు పండ్లు" పెట్టి వెళ్ళేవారు.
ఆడపెళ్ళి వాళ్ళు సైతం ఓ పదిమంది వెళ్లి వరునికి 
ఏ సైకిలో గడియారమో ముట్టజెప్పి కాసిన్ని డబ్బులతో "వరపూజ" చేసెటోల్లు.
అదికూడా కాస్త పెళ్ళికి ఎక్కువ సమయం ఉంటేనే.
అదీ లేకుంటే ఇంకాస్త చిన్నగానే చేసేవాళ్ళు.
అప్పుడే లగ్నపత్రికలు రాయించుకొని మార్చుకోనేవాళ్ళు. 
అంతే అంతటితో నిశ్చితార్థం అయిపోయినట్టే.

కాని ఈమధ్యకాలంలో 
పెళ్ళికి నిశ్చితార్దానికి పెద్దగా తేడా ఉండడంలేదు
పెళ్ళికి వచినంత చుట్టాలు, హంగు ఆర్భాటాలు
ఉంటున్నాయి.
జిలకర బెల్లం, తాళిబొట్టు తప్పించి అన్నీ ఉంటున్నాయి.
దాదాపు పెళ్లి లాగాఆర్భాటాలు, బంధువులు, 
ఆర్కెస్ట్రా, డాన్స్ లు....
వెల్ కం డ్రింక్నుండి మొదలుకొని ఆఖర్న ఐస్ క్రీం వరకు 
పళ్ళెం లో కనీసం ఇరవై రకాల పైననే ఉంటున్నాయి.

ఇక అతిథుల ముందు ఉంగరాలు మార్చుకోవడం 
తోటి మొదలవుతుంది ఫోటోల తంతు 
సినిమా షూటింగు లను తలపించేలా  
ఓ క్రేను,ఐదారుగురు కేమరామేన్లు... 
అబ్బో అదో అన్నపూర్ణ స్టూడియో ,
(నా కాలేజ్ రోజుల్లో యూసుఫ్ గూడలో ఉన్నప్పుడు 
అన్నపూర్ణ స్టుడియోలో షూటింగ్ చూడ్డానికి వెళ్ళా )
అదే గుర్తుకొస్తుంది.

ఏదేమైనా ఈ అనవసరపు ఆర్భాటాలు 
పెళ్ళికూతురి తండ్రికి ఆర్ధిక భారాన్ని మోపేవే  తప్పించి 
పెద్దగా అవసరం లేదని నా అభిప్రాయం...

3 comments:



  1. పెళ్ళంటే టీజర్లు, ట్రైలర్లు, మెహందీలు, సంగీత్ లు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఏడే అడుగులు, మొత్తం కలిసి నూరే లక్షలు అని స్త్రీలే ఎక్కువగా కోరుకుంటున్నట్లు సర్వేలో తేలిందని ఈనాడులో నిన్న వ్రాసారు.

    ReplyDelete
  2. అతి ఎక్కువై పోయి, షో చేయడం ఎక్కువై పోయి .... ఈ రోజుల్లో నిశ్చితార్థం కూడా పెళ్ళిలా చేస్తున్నారు.

    ఆ మధ్య నేను హాజరైన ఓ నిశ్చితార్థంలో వచ్చిన అతిధులకు రిటర్న్ గిఫ్ట్ లు కూడా ఇచ్చారంటే ఈ అతిశయపు పనులు ఏ స్ధాయికి చేరుకున్నాయో తెలుస్తోంది. మరో కేసులో - పగలు జరిగిన నిశ్చితార్ధానికి మళ్ళా ఆ రోజు రాత్రి రిసెప్షన్ కూడా పెట్టమని పెళ్లికొడుకు తండ్రి డిమాండ్ చేసిన సంగతి నాకు తెలుసు. కలిగినవారు చేసుకుంటారు, నీకేమిటి నొప్పి అని అడిగేవారికి నేను చెప్పేది - వాళ్ళని చూసి స్తోమత లేని వారు కూడా వాతలు పెట్టుకుంటున్నారు, అప్పుల పాలవుతున్నారు, సమాజంలో ఇది సరైన పోకడ (ట్రెండ్ అనాలేమో) కాదు కదా అని.

    నా పెళ్ళికి తాంబూలాలు తీసుకునే కార్యక్రమం ఈ క్రిందివారి సమక్షంలో జరిగింది -
    (1), నా తల్లిదండ్రులు, వేరే పని మీద రావడం తటస్ధించిన నా అన్నగారు, ఉళ్ళోనే ఉంటున్న నా మేనమామ మరియు వారి భార్య;
    (2). వధువు తల్లిదండ్రులు, ఊళ్ళోనే ఉంటున్న తన పెదతండ్రి.

    ఆ రోజుల్లో దాదాపు అన్ని కుటుంబాలలోనూ నిశ్చితార్ధ కార్యక్రమాలు ఇలాగే సింపుల్ గా జరిగేవి. ఆ కాలం నుండి ఇప్పటి ఆర్భాటపు పద్ధతి కి వచ్చింది సమాజం - వ్యాపారుల పబ్లిసిటీ మాయ, దర్శకదిగ్గజాలు తమ సినిమాల్లో రిచ్ గా చూపించే ఫంక్షన్ల ప్రభావం, వాటిని అనుకరించే టీవీ సీరియళ్ము ముఖ్య కారణాలని నాకనిపిస్తుంది. నీహారిక గారన్నట్లు ఇవన్నీ చూసి ఇలాగే రిచ్ గా కనబడేట్లు జరపాలని ఇంట్లోని ఆడవారు పట్టు పట్టడం కూడా.

    మంచి టపా వ్రాశారు బద్రీనాథ్ గారూ 👌.

    ReplyDelete
    Replies
    1. నిశ్చితార్దానికి రిసెప్షన్??? ఖర్మ.
      మీరన్నట్టు వాతలు పెట్టుకోవడంలో మధ్యతరగతి కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందుల్లో పడుతున్నాయి.
      ఇంటికి ఒకరిద్దరే పిల్లలు ఉండడం, వాళ్ళనూగారాబంగా పెంచడం, వాళ్ళ మాట కాదనలేకపోవడం, పొద్దస్తమానం టీవీలలో వచ్చే సీరియళ్ళ ప్రభావంతో ఇంట్లో వాళ్ళు కోరే కోరికలు మధ్యతరగతి తండ్రులను అప్పులపాలు చేస్తున్నాయి.

      Delete