Saturday, 30 November 2019

హైదరాబాద్ టూ మేడారం 2


ఇక వరంగల్ నుండి మేడారం వెళ్లే ముందే నిర్ణయించుకోవలసిన విషయం...
ఈ రెండు రూట్లలో ఎటువైపు నుండి తిరుగు ప్రయాణం అని..
1. వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తే మొదట లక్నవరం సరస్సు, తర్వాత రామప్ప, ఘణపురం కోట గుళ్లు, కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు, పాండవుల గుట్టలు (trekking)






2. ఏటూరునాగారం అభయారణ్యం (site seeing),
మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, వాజేడు జలపాతం, పర్ణశాల, భద్రాచలం

మేడారం నుండి తిరుగు ప్రయాణ మార్గంలో చల్వాయి నుండి 8 కిమీ దూరం లో ఉన్న లక్నవరం సరస్సు చూడొచ్చు. సాధారణంగా కాకతీయుల నిర్మాణాలు సరస్సు, జనావాసం, దేవాలయం అనే ప్రాధాన్యం గా ఉంటాయి. కానీ ఇక్కడ కేవలం సరస్సు మాత్రమే నిర్మించారు. అక్కడి నుండి ప్రపంచ ప్రఖ్యాత యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన కట్టడం పాలంపేటలోని రామప్ప దేవాలయం 30 కిమీ. ఇక పక్కనే 15 కిమీ దూరంలో ఘణపురం కోట గుళ్ళను చూడొచ్చు.
తర్వాత కాళేశ్వరం వెళ్లాలనుకుంటే 80 కిమీ, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది ఇక్కడే.
లేదు ఘణపురం నుండి తిరిగి వెళ్లాలనుకుంటే మార్గమధ్యలో ద్వాపరయుగంలో పాండవులు వనవాసం చేసిన గుహలు, లక్కమేడలు చూసి (ఇక్కడ సేద తీరేందుకు , పర్వతారోహణ కుపర్యాటక శాఖ   వారి ఏర్పాట్లు ఉన్నాయి ) దగ్గరలోనే ఉన్న త్రేతాయుగం నాటి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ని దర్శించుకోండి.

 2.
మేడారం నుండి ఏటూరునాగారం 30 కిమీ ఇక్కడి నుండి అభయారణ్యం లోకి వెళ్లి చూసేందుకు, సేద తీరేందుకు అటవీశాఖ వారి ఏర్పాట్లు ఉన్నాయి.
(ఇక్కడే కాకుండా వరంగల్ జిల్లాలోని మరికొన్ని చోట్ల కూడా ఈ ఏర్పాట్లు ఉన్నాయి) 
ఇక్కడి నుండి భద్రాచలం వెళ్లే దారిలో మంగపేట వద్ద మల్లూరు అటవీప్రాంతంలో కొలువై ఉన్న హేమాచల లక్ష్మీ నరసింహస్వామి మానవ శరీరం వలె మెత్తని విగ్రహాన్ని కలిగి ఉంటారు. అక్కడినుండి నేరుగా భద్రాచలం చెరుకోవచ్చు. 
మరోటి ఏటూరునాగారం నుండి మల్లూరు కాకుండా 17 కిమీ దూరంలో ఉన్న వాజేడు జలపాతాన్ని చేరుకొని అక్కడి నుండి పర్ణశాల మీదుగా భద్రాచలం వెళ్ళవచ్చు.

Tuesday, 12 November 2019

హైదరాబాద్ టూ మేడారం

ప్రపంచంలోనే అతిపెద్ద జాతర మేడారం
ఈసారి 2020 ఫిబ్రవరి5 నుండి  8 వరకు జరగనుంది.
5న సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకోనున్నారు.
ఫిబ్రవరి 6న సమ్మక్క గద్దెకు చేరుకోనుంది.
ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు,
ఇక 8న అమ్మవార్ల వనప్రవేశం.
జాతర గురించి ఇక్కడ తెలుసుకోండి .  
 కొన్నేళ్ల కింద జాతర ఎలా ఉండేదో ఇక్కడ చదవండి 


మేడారం చుట్టూ, వెళ్లే దారిలో నూ ఎన్నో,మరెన్నో
చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయి. 
ఆలయ దర్శనం అనగానే  రాయలసీమ, గోదావరి జిల్లాలవైపు
దృష్టి మల్లే మనకు మన తెలంగాణ లొనే మనకు తెలియని ఎన్నో ఆలయాలు
పురాతన కాలం నుండి ఎన్నో రాజవంశాల పాలనలో సంరక్షించబడి మనకందించబడ్డాయనేది
పెద్దగా తెలియకపోవడం మన  దురదృష్టం.
తగినంత ప్రచారం లేకపోవడం లేదా కొన్ని చిన్నచిన్ని గ్రామాలలో,
మారుమూల ప్రాంతాలలో ఉండటం వలన వీటికి రావలసిన గుర్తింపు, దక్కవలసిన గౌరవం
దక్కలేదని భావించవలసి వస్తుంది.
ఇంకా కొన్ని వందల సంవత్సరాల పాటు మహమ్మదీయుల పాలనలో
తీవ్ర నిర్లక్ష్యానికి గురవడం కూడా ఒక కారణం.
అయితే చాలా చోట్ల ప్రజలు సంస్కృతి సాంప్రదాయాల, భాష మరియు
ఆరాధనా విధానాల పట్ల ప్రేమతో వాటి అభివృద్ధికి విశేష కృషిచేస్తుండడం అభినందనీయం.
ఈసారి మేడారం
జాతరకు వెళ్లే ముందు కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే
 జాతరతోపాటు   ఆలాంటి కొన్ని ప్రదేశాలు చూసే అవకాశం ఉంటుంది.
వీలైతే ఈవిధంగా ప్లాన్ చేసుకోండి.

హైదరాబాద్ నుండి బయల్దేరితే మొదట వచ్చేది
చారిత్రక ప్రదేశం అయిన భువనగిరి కోట
అక్కడినుంచి యాదాద్రి దగ్గరే.
ఇక ఆలేరు కు రాగానే ఎడమవైపు వెళ్తే
6 కిమి దూరం లో 2000 సంవత్సరాల నాటి  జైన క్షేత్రం కొలనుపాక,
కుడివైపు వెళ్తే పురాణపురుషుడు  శ్రీరాముడు
మాయాలేడి ని  చంపిన ప్రదేశం జీడీకల్ క్షేత్రాన్ని చేరుకోవచ్చు.
ఇవి అన్నీ  చూడడానికి ఒకరోజు పడుతుంది.

ఇక అక్కడి నుండి తర్వాతి మజిలీగా వరంగల్ చేరుకోవచ్చు.
ఒకప్పటి కాకతీయ సామ్రాజ్య రాజధాని ఓరుగల్లే నేటి వరంగల్.
తెలంగాణా రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం.
ఇక్కడ సాధారణమైన వాటినుంచి స్టార్ హోటల్ల వరకు
అన్నీ ఉన్నాయి కాబట్టి వసతి కి కొదవ లేదు. మిగతా తర్వాతి పోస్ట్ లో........

Tuesday, 15 October 2019

బస్సులు బందు

RTC సమ్మె
ప్రస్తుతం తెలంగాణా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది
తెలంగాణ లో పెద్ద పండుగ బతుకమ్మ, దసరా
ఈ టైంలో బస్సులు లేక పుట్టింటికి వెళ్ళే ఆడపడుచులు, స్కూలు, కాలేజీలునుండి సెలవులకు వచ్చేపిల్లలు ఇలా ఎంతోమందికి చాలా కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తోంది.
ఇటువంటి రద్దీ సమయంలో ఈ సమ్మె ప్రజలకు అసౌకర్యం కలిగించడమే కాకుండా సంస్థ కు కూడా భారీ నష్టాన్ని కలిగిస్తోంది. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేసిన పరిస్థితి.
ప్రస్తుతానికి కొన్ని బస్సులను తిప్పుతున్నప్పటికీ వాటిని నడుపుతున్న వాళ్ళ అనుభవ రాహిత్యం తో భద్రత గురించి ఆందోళనే. ఇక టిక్కెట్లు ఇవ్వడమే లేదు. డబ్బులు మాత్రం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు వసూలు చేస్తున్నారు. దీంతో సమ్మెపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండగా మరికొంత RTC ఉద్యోగుల పట్ల సానుభూతి కూడా ఉంది.
దేశంలోని మిగతా రాష్ట్రాల్లో లాగా కాకుండా మన రాష్ట్రంలో మాత్రం బస్సులు బాగానే నడుస్తాయి. ఒకసారి తమిళనాడు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ నుండి తిరుపతి కి వచ్చేలోపు ప్రయాణీకులు లేరంటూ బస్ ఆపరేటర్ నన్ను వేలూరు లో ఒకసారి చిత్తూరు లో రెండుసార్లు అలా మూడు బస్సులు మార్పించాడు. దాంతో మూడు గంటలు లేటు, ట్రైన్ మిస్సయ్యే పరిస్థితి ఏర్పడింది. కానీ మనదగ్గర ప్రయాణీకులు లేరంటూ దాదాపుగా సర్వీసులు రద్దు చేసిన సంఘటనలు ఉండవు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నడుస్తాయి. రూరల్ సర్వీసులు ఎప్పుడూ ఒక వైపు మాత్రమే లాభదాయకం, రిటన్ ట్రిప్పు ఖాళీ గా రావలసిందే. అయినా ప్రజల సౌకర్యార్ధం బస్సులు నడుపుతూనే ఉంది. ఉద్యోగులు కూడా ఆక్యుపెన్సీ ని పెంచి సంస్థ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు ప్రయాణీకులకు ఇచ్చే రాయితీలు RTC కి గుదిబండగా మారాయి అని చెప్పవచ్చు. RTC ని ప్రయివేటు పరం చేస్తే చార్జీలు పెరగడమే కాక ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది. ఉదా: సమ్మె కారణంగా ప్రస్తుతం ప్రయివేటు ఆపరేటర్ లు వరంగల్ నుండి హైదరాబాద్కు 500 రూ నుంచి 800 వరకు తీసుకుంటున్నారు. RTC లో AC బస్ లో అయిన 250 మించి లేదు. హైదరాబాద్ నుండి బెంగళూరుకు 4000 వరకు తీసుకున్నారు.
దీంతో ప్రత్యక్షంగా నష్టపోయేది సామాన్యులే ఐనా దాని ప్రభావం అందరిపైనా ఉంటుంది. ఇప్పుడు కార్మికులు సమ్మె చేస్తున్నారని ప్రతీరోజూ దాదాపు 90 లక్షల మందిని తమ గమ్యాలకు చేర్చే RTC ని విడతల వారీగా ప్రయివేటు పరం చేస్తే బస్సులు అందుబాటులో ఉండక అందరూ క్యాబ్ లను ఆశ్రయిస్తే లక్షలాది ట్యాక్సీ లకు మన రోడ్లు సరిపోవు. ఇక కాలుష్యం సంగతి చెప్పనేలేము.
ఏదేమైనా పంతానికి పోయి ప్రభుత్వం కానీ ఉద్యోగులు కానీ సంస్థ మనుగడను ప్రమాదంలో పెట్టకూడదు.

Tuesday, 9 April 2019

ఇంకుడు గుంత

" ప్రపంచంలోని ఆధునిక నగరాలలో తాగునీరు సరఫరా నిలిచిపోబోతున్న  మొదటి నగరం దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్  " (11 మే 2019 నుండి )
 కొంత కాలంగా  ప్రపంచమంతా చర్చిస్తున్న  ఒక అత్యంత  దూర్వార్త 
చుట్టూ సముద్రం ఉన్నా కేవలం 40 లక్షల జనాభా ఉన్న నగరానికి 
తాగేందుకు చుక్క నీటిని అక్కడి ప్రభుత్వం ఎందుకు అందించలేకపోతోంది
కారణం ఏమిటో తెలుసా కోటిమంది జనాభా ఉన్న
మన  హైదరాబాద్ వినియోగించే నీటికంటే ఎక్కువగా వాడతారు
నీటి పొదుపు చేయండని అక్కడి ప్రభుత్వం
ఎంత మొత్తుకున్నా వినని నిర్లక్ష్యం ఇప్పుడు వారికి శాపంగా మారింది
ఇది ప్రారంభం మాత్రమే
ఇకనైనా మనం కళ్ళు  తెరవాలి

ప్రపంచంలోని 500 నగరాల్లో చేసిన పరిశోధనల్లో నీటి కరువుకు చేరువలో ఉన్న మొదటి 10 నగరాల్లో మనదేశంలోని బెంగళూరు రెండవది
1. సౌపాలో - బ్రెజిల్
2.బెంగుళూరు
3.బీజింగ్ - చైనా
4.కైరో - ఈజిప్ట్
5.జకార్త - ఇండోనేషియా
6.మాస్కో - రష్యా
7.ఇస్తాంబుల్  - టర్కీ
8.మేక్సికోసిటి
9. లండన్
10. టోక్యో - జపాన్ 

ప్రపంచంలో ఏ చిన్న వాతావరణ మార్పు జరిగినా 
మొదట  ప్రభావం చూపేది  భారత ఉపఖండం పైనే అనేది సుస్పష్టం 
ఇటువంటి పరిస్తితులల్లో 
నీటి కరువు మన దరిదాపుల్లోకి రాకూడదంటే
ఇంకుడు గుంతలే శరణ్యం అనేది శాస్త్రజ్ఞుల మాట
వాన నీటి సంరక్షణ లేకపోవడం వలన
నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తోంది.
దీన్ని అధికమించాలంటే ప్రతీ ఒక్కరు ఇంకుడుగుంతల అవశ్యాన్ని గుర్తించాలి.
ప్రభుత్వాలు  ఆదిశగా వాల్టా లాంటి కొన్ని చట్టాలు చేసినా
అమలులో అలసత్వం వలన భవిష్యత్ తరానికి
ఎంతో ద్రోహాన్ని చేస్తున్నాం
కురిసే వర్షంలో పట్టణాల్లో 92% వృధాగా పోతోందని అంచనా
ఈ విషయంలో పల్లెలు కొంచం నయం
చెరువుల్లోనో, ఫాంపాండ్స్ లోనో నిలువ చేసుకుంటున్నారు
ఇంకుడు గుంతల వంటి సంరక్షణ ఏర్పాట్లు ఉంటే
ఒక్క సంవత్సరంలో కురిసే వర్షంతో ఒక కుటుంబానికి
3 సంవత్సరాల పాటు సరిపోయే నీటిని  సేకరించుకోవచ్చు
కాబట్టి ప్రతీ ఒక్కరు వాటి ప్రాముఖ్యాన్ని గుర్తించాలి


ఇంకుడు గుంత నిర్మాణం:
సుమారు రెండు మీటర్లు పొడవు, ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు లోతు గల గుంతలను త్రవ్వాలి.
ఆ గుంతలో పావు భాగము పెద్ద బండ రాళ్ళతో నింపాలి,
ఆ తర్వాత రెండు పావు భాగాలు పెద్ద కంకర,  తర్వాత చిన్న కంకరతో  నింపాలి.
ఆపైన కర్ర బొగ్గుతో ఒక వరుస వేయాలి 
దాని పైన దొడ్డు ఇసకను వేయాలి, 
వర్షపు నీటిని ఆ గుంతలోకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయాలి 
ప్రతీ సంవత్సరం పైన ఉన్న ఇసకను మార్చాలి 
లేదా బయటకు తీసి కడిగి మల్లి వేయాలి 
మీ ఇంటి, వ్యవసాయ బోర్లు, బావుల్లో జలసిరులు చేరాలంటే 
ఇంతకంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు 
దీనికి ప్రభుత్వం తరపున సహాయం కూడా అందుతుంది


Monday, 25 February 2019

విషకౌగిలిలో దీర్ఘాయుష్షు


దీర్ఘాయుష్మాన్ భవ అని ఎవరైనా దీవిస్తే  భయమేస్తోంది!!
అయినా
30 ఏళ్లకే బీపీ 35 కు షుగరు
40 కి రాగానే గుండెపోటు 45 కి రాగానే ఏదో కాన్సర్  
లేదంటే పక్షవాతం.... ఇక వందేళ్లు బతకాలని ఎవడనుకుంటాడు
అన్నాడు మిత్రుడొకరు
ఔను! మన కంటే ఒకటి రెండు తరాల ముందు వాళ్ళు బాగానే ఉండే వాళ్ళు 
మరి మన కి ఏమైంది??
ఏముంది
1960-70 లో హరిత విప్లవంతో మొదలైన 
విచ్చలవిడి రసాయన ఎరువులు, పురుగుమందుల
వాడకం కాస్తా మన ఆరోగ్యానికి ముప్పు తెచ్చింది
వ్యవసాయ భూముల్లో వరి,పత్తి, మిరప,
కూరగాయలు మరేఇతర వ్యవసాయ పంటలు వినియోగిస్తున్న
రసాయనాలు (అగ్రోకెమికల్స్) నేరుగా
చెరువుల్లోకి అక్కడినుండి బోర్లు, బావుల్లోకి ఇంకా నదుల్లోకి చేరుతున్నాయి.
దాంతోభూగర్భ జలాలు
కలుషితమవుతున్నాయి అలా కలుషితమైన
నీటినే వంటకు, తాగడానికి వాడుతున్నాం 
అదే ఈవ్యాధులకు ముఖ్య కారణమని కొన్ని పరిశోధనలు చెపుతున్నాయి 
అయినా ఇవి ఒక కొలిక్కి రావడంలేదు ఎందుకంటే ఇవి
పరస్పర ఆధారిత మరియు బహుళ విభాగ
పరిశోధనలతో ముడిపడి ఉంటాయి


అదీకాక మనం తినే ఆహారంలో 
పురుగుమందులు, రసాయనాల అవశేషాల స్ధాయి చాలా ఎక్కువట. 
ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేసిన తర్వాత 
పంటలు (ఆకు కూరలు, కాయగూరలు) కోయటానికి 
కనీసం పది రోజులు ఆగాలి కానీ అలా జరగడం లేదు.
లేదంటే అలాంటి కూరల వల్ల నాడివ్యవస్థ, నరాల
వ్యవస్థ దెబ్బతింటుంది.. కాలేయం పనితీరు పాడయ్యే
అవకాశం ఉంటుంది. మూర్చ వచ్చే ఆవకాశం ఉంటుంది. రోగ నిరోధక
శక్తి తగ్గిపోయి చిన్నచిన్న వ్యాధులకు కూడా శరీరం
తట్టుకోదు. తరచూ జలుబు, తలనొప్పి వస్తుంది. నీరసంగా ఉంటుంది.
కొన్ని మందుల వల్ల క్యాన్సర్ వంటివి కూడా సోకే ప్రమాదం కూడా ఉంది.
వాహనకాలుష్యంతో  వెలువడే పొగలో ఉండే సీసం, మరికొన్ని రసాయనాల వల్ల క్షయ, మెదడు సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి 



ఇక రెస్టారెంట్లు , ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడే అజినమోటో, వెనిగర్, ఫుడ్ కలర్స్ లాంటివే కాక నిలువ ఉంచేందుకు వాడే రసాయనాలు ఎన్నో ...
మరో విషయం కూడా పరిగణనలోకి
తీసుకోవాలి. చిన్న చిన్న జలుబు,దగ్గు,జ్వరం లాంటి జబ్బులకు,
చీటికీ మాటికి ఆర్.ఎం.పి.ల ప్రెస్క్రిప్షన్ తో మందుల గోళీలు
వాడటం కూడా ఆరోగ్యం దెబ్బతినటానికి ఓ కారణం . 
క్లిష్టమైన అనారోగ్య పరిస్థితుల్లో వాడాల్సిన కొన్ని మందుల్ని  RMP లు అతి సాధారణంగా వాడేస్తున్నారట. దాంతో అత్యవసర పరిస్థితుల్లో ఆయా మందులకు జబ్బులు లొంగటం లేదు అనేది కొన్ని పెద్ద ఆసుపత్రుల ఫిర్యాదు..
చీటికీ మాటకి మందులు మింగకుండా,
రసాయనాలతో కూడిన ఆహారాన్ని త్యజించి సేంద్రీయ ఆహారం తీసుకునే దిశగా ప్రయత్నిస్తూ అందరూ కాస్త అవగాహన పెంచుకుంటే వందేళ్లు బతికినా బాధ ఏమీ ఉండదు..
ఎవరికీ భారమవ్వరు..

                                          దీర్ఘాయుష్మాన్ భవ

Friday, 15 February 2019

రెండు రోజుల్లో పంచారామాలు ...

బిజీ బిజీ జీవితంలో కాస్త విశ్రాంతి కోసం అలా ఓ రెండ్రోజుల 
ఏదైనా విహారాయాత్రకు వెల్దామని నిర్ణయించుకున్నదే తడవుగా  
మా మిత్రులందరూ మేము సైతం అంటూ ok చెప్పారు
మరి ఎటు వెళదాం??
విహారయాత్రకు.....
ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలు..
ముక్కోటి దేవతలు కొలువైన ఆలయాలు..
ఆకుపచ్చని అరణ్యాలు..
ఆకాశం నుండి దూకే జలపాతాలు..
ఎన్నో ఉన్నా ఈసారి ప్రకృతి రమణీయతకు, 
అపురూపమైన ఆధ్యాత్మిక కేంద్రాలకూ 
నెలవుగా ఉన్న గోదావరి జిల్లాలోని
పంచారామ క్షేత్రాలను చుట్టి రావాలనుకున్నాం
సమయం అనుకూలిస్తే మధ్య మధ్యలో ఉండే 
ఇతర క్షేత్రాలను చూడాలనుకుంటున్నాం
వెళ్తున్నామనగానే ఎక్కడ ప్రారంభించాలి, ఎలా వెళ్ళాలి, 
ఎక్కడ బస చేయాలి, ఎక్కడముగించాలి అని కొందరు మిత్రులు  
వారి అమూల్యమైన సలహాలు,సూచనలు  తెలియజేసారు 
వారందరికీ  ధన్యవాదాలు. 
 రెండు రోజుల్లో చుట్టి రావడానికి ఉపయోగపడే సమాచారం ఏదైనా ఉంటె 
కామెంట్ చేయండి please


Saturday, 26 January 2019

ఫోన్ సెన్స్


మన దేశంలో దాదాపుగా ప్రతీ ఒక్కరికి ఫోన్ ఉంది
ఇంకా కొందరికి రెండు కూడా ఉన్నాయి
భారత టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం
31 డిసెంబర్ 2018 నాటికి మనదేశంలో
121 కోట్ల సెల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారని అంచనా
అందులో 50 కోట్ల వరకు స్మార్ట్ ఫోన్లే
ఇంకా ల్యాండ్ ఫోన్లు అదనం .....
పుస్తకం హస్త భూషణం అనేవారు ఒకప్పుడు, మొబైల్ హస్తభూషణం అయిపోయింది ఇప్పుడు
కానీ ఈ ఫోన్లు మనుషుల పరువు తీయటమే కాకుండా కొన్నిసార్లు ప్రాణాల మీదికి తెస్తున్నాయి

మొన్నొకతను బస్ లో ఫోన్ మాట్లాడుతూ టికెట్ తీసుకోవడమే మరిచిపోయాడు
దాదాపు 20 కిలోమీటర్లు వెళ్ళినతర్వాత గుర్తుకొచ్చింది పాపం
ఇంకొందరికైతే ఎప్పుడూ ఫోన్ చెవికి ఆనించే ఉంటుంది ఆఫీస్ అయినా రోడ్ మీదైనా
మనమెవరితోనైనా మాట్లాడుతూ ముఖ్యమైన ఉంటామా
ఇంతలో వాళ్లకు  ఫోన్ వచ్చిందనుకోండి మనల్ని మరిచిపోయి మరీ అందులో లీనమైపోతారు
అదేమైనా ముఖ్య విషయమా అంటే ఏ పార్టీకో వస్తావా అనో నిన్న చూసిన సినిమా గురించి రివ్యూ నో అవుతుంది
కానీ ఎదురుగా ఉన్న మనిషిని పట్టించుకోవడం ఉండదు. కొందరైతే  ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదు
 ఒకసారి నాకు తెలిసిన ఒకతను అలా మాట్లాడుతూ వెళ్లి ఒక  కరెంటు  ట్రాన్స్ఫార్మర్  మీదే చెయ్యి వేయబోయాడు.
పక్కనే ఎవరో ఉండి ఆపారు కాబట్టి సరిపోయింది లేదంటే ....
ఇంకొకాయనైతే ఒక బస్సు  ఎక్కాల్సింది ఇంకోటి ఎక్కాడు.
ఇంకా చాలా చూస్తున్నాం హెడ్ సెట్ పెట్టుకొని రోడ్డు దాటేవాళ్ళు ప్రమాదాలకు గురికావటం,
సెల్ఫీలు దిగుతూ, ఫోన్ మాట్లాడుతూ బండి నపడం వల్ల ప్రమాదాలకు గురికావడం .
ఇంకా కొందరైతే మనకు ఫోన్ చేసి ఇంకెవరితోనో మాట్లాడుతూవుంటారు
  
ఆఫీసులో ఉన్నప్పుడు పర్సనల్ కాల్స్ తక్కువగా అటెండ్ చేయడం మంచిది
మిత్రులు, బంధువుల మధ్య ఉన్నప్పుడు ఫోన్ కంటే వాళ్ళకే ఎక్కువ ప్రాధ్యాన్యం ఇవ్వడం మంచిది
దానివల్ల వాళ్లు మనల్ని గౌరవంగా చూడడమే కాకుండా వాళ్ళు మనకు ముఖ్యులు అనే నమ్మకం వాళ్లకు కలుగుతుంది
సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్  వచ్చాక బంధాలు , బంధుత్వాలు పలచబడుతున్నాయి,  ప్రేమలు తగ్గుతున్నాయి
నా చిన్నప్పుడు TV  వచ్చి కుటుంబ సభ్యల మధ్య దూరం పెంచింది అనేవారు
ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు బంధాలను పూర్తిగా తెంచేలా ఉన్నాయి
హాస్పిటల్స్ కి వెళ్ళినపుడు సెల్ ఫోన్లు ఆఫ్ చేయడం మంచిది
ఒక్కోసారి ఫోన్ రేడియేషన్ వల్ల అక్కడి కొన్ని పరికరాలు పనిచేయకపోవచ్చుకూడా
దాంతో రోగులకు సరైన సమయంలో అత్యవసరమైన వైద్యం అందించలేకపోవచ్చు
ఫోన్ ఎలా మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో ఎందుకు  మాట్లాడకూడదో ఎవరో వచ్చి చెప్పరు కదా 
కాబట్టి మనమే కాస్త విచక్షణతో వ్యవహరించటం మంచిది