Thursday, 17 August 2017

కన్నీరే మిగిలిందిక


వృద్ధులను బాగున్నావా? అని పలకరిస్తే ఆనందం కన్నా కన్నీళ్ళే రాలుతున్నాయి .
 తగ్గుతున్న మానవత్వ విలువలకు నిదర్శనం ఇది.
ఈ రోజు కంటి చూపు పరీక్ష చేయించుకుందామని ఆసుపత్రికి  వెళ్ళాను.
నాలాగే చాలా మంది వచ్చారు, అందులో వృద్ధులే ఎక్కువ . 
తెలిసిన వారి హాస్పిటల్ కాబట్టి 
ఎక్కువగా వెయిట్ చేయాల్సిన పని లేదు కాని 
డాక్టర్ లంచ్ చేస్తుండటంతో పావుగంట ఆగాల్సివచ్చింది.
వచ్చిన పేషంట్లలో కొంత మంది తెలిసిన వాళ్ళు
ఉండటంతో మాటలు కలిపాను.
వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటూ వీళ్ళకు కొంత డబ్బు పంపిస్తున్నారట,
పండక్కో పబ్బానికో కానీ రావటంలేదట ,
 కొందరైతే అదీ లేదట ఎన్ని సంవత్సరాలైందో
అని కన్నీటి పర్యంతమయ్యారు.
వాళ్ళను పెంచి పెద్ద చేసేందుకు తెచ్చిన అప్పులే తీరలేదట.

 అమ్మా నాన్నలను మిస్ అవుతున్నట్టు ఫేస్బుక్ వాట్స్ అప్ స్టేటస్ లు పెట్టేకంటే
రోజు ఒక్కసారైనా ఫోన్ లో పలకరిస్తే ఎంత ఆనందిస్తారో.
తల్లి దండ్రులకు శుభాకాంక్షలు చెప్పటమంటే
జీవితాంతం వాళ్లకి సేవ చేయటమే కాని
స్టేటస్ లు పెట్టడం కాదు.
అయినా స్వతంత్ర భావాలకు అలవాటు పడి
ఏదైనా మనకెందుకులే అని బ్రతుకుతున్న వాళ్లకి
ఇదంతా ఎప్పుడు బోధపడుతుంది  అత్యాశ కాకపొతే...



Sunday, 6 August 2017

రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు


అందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు....

ప్రపంచంలోని ఏ మతానికీ  లేని  ప్రత్యేకత హిందూ ధర్మానికి  సొంతం .
ఎన్నో మతాలు, ధర్మాలు, వర్గాలు, కులాలూ ఉన్నప్పటికీ
పూల దండలోని దారం ఎలాగైతే వివిధ రకాల, రంగుల, వాసనల
 పూవులను కలిపి ఉంచుతుందో  అదేవిధంగా
భారతీయులందరినీ హిందూ ధర్మం అలాగే కలిపి ఉంచుతుంది.
ఇదే ఇక్కడి గొప్పతనం.
అటువంటి హిందూ ధర్మంలోని సాంప్రదాయాలు,
ఆచారాలు, పండుగలు విభిన్నం,ప్రత్యేకం.
ఇందులో ముఖ్యమైనది రాఖీపౌర్ణమి.
అన్నచెల్లి, అక్కాతమ్ముల్ల అనుబంధానికి ప్రతీక ఈ పండగ .
ప్రపంచంలోని ఏ మతంలోనూ,దేశంలోనూ ఈ పండుగ కనిపించదు.
నిజానికి అన్నాచెల్లెల బంధం ఎంత అపురూపమైనది!
అన్నాచెల్లెల బంధము చిక్కని స్నేహానుబంధ సీమలకన్నన్
మిక్కిలి పైస్థాయినిపెంపెక్కిన చక్కని విశిష్ట ప్రేమామృతమౌ
అంటాడో కవి...
అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు…. 
కుటుంబంలో ఆప్యాయతలకు నెలవైన
అనుబంధాలు. 
చెరిగిపోని, కరిగిపోని ప్రేమానుబంధాలు. 
అమ్మ, నాన్న తర్వాత అంతటి
ప్రేమాభిమానాలు ఉండేది సోదరీసోదరుల మధ్యనే.  
అక్కో చెల్లినో రాఖీ కడుతుంటే 
మురిసిపోని సోదరుడు ఉంటాడా చెప్పండి.
కానీ 'ప్రేమా... గీమా'
అంటూ వెంటపడేవారిని వదిలించుకోవడానికో..      
 బహుమతులను  ఆశించి  'అన్నా' అంటూ పొడి పొడి అప్యాయతలతోనో 
రాఖీలు కట్టి నవ్వులపాలు కాకండి. 

మరొక్కసారి

అందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు....