Tuesday, 7 December 2021

తిరుమలలో ఉచిత సదుపాయాలు


కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని సంవత్సరానికి ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకునే వాళ్ళు, అలా దర్శించుకునే కుటుంబాలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో.. ఇంకా సంవత్సరం లోపే ఎన్నో సార్లు దర్శించుకునే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు.
ఉచితంగా తిరుమలకు అనగానే ఆశ్చర్యపోకండి. మన ఊరినుండి తిరుపతికి వెళ్ళడం ఉచితం కాకపోవచ్చు కానీ ఒక్కసారి తిరుపతిలో అడుగుపెట్టిన క్షణం నుండి మీరు మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యే వరకు చాలా సేవలు ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి భక్తులకు ఆర్థిక భారం తగ్గించేలా టీటీడీ ఎన్నో సేవలను ఉచితంగానూ లేదా నామమాత్రపు రుసుముతో అందుబాటులోకి తెచ్చింది. అందులో ముఖ్యమైనవి దర్శనం, భోజనం, వసతి.
తిరుపతిలో రైలు లేదా బస్సు దిగగానే మనకు మొదట కావల్సింది వసతి. దానికోసం రైల్వేస్టేషన్ పక్కనే విష్ణు నివాసంలో గానీ, లేదా బాస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీనివాసం వసతి సముదాయాల్లో ఉచిత లాకర్ సదుపాయం, పెద్ద పెద్ద డార్మెటరీలు అందుబాటులో ఉన్నాయి. నామ మాత్రపు రుసుముతో రూములు కూడా లభిస్తాయి.


భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలవరకు చేరుకునేందుకు ధర్మరథం పేరుతో ప్రతీ రెండు నిమిషాలకు ఒక బస్సు విష్ణు నివాసం నుండి బయల్దేరుతుంది. మన లగేజిని అక్కడే ఇస్తే ఉచితంగా తిరుమలకు చేరుస్తారు. 

కాలిబాటలో కొండ ఎక్కే భక్తులకు మధ్యలో ఉచిత దర్శనానికి టోకెన్, ఉచిత లడ్డూ కూపన్ ఇస్తారు. అదనపు లడ్డూలకు కూడా అక్కడే డబ్బు చెల్లించి కూపన్లు పొందవచ్చు. మెట్ల మార్గం గుండా పైకి చేరుకున్న భక్తులు బస్టాండ్ ఎదురుగా ఉన్న CRO ఆఫీస్ వద్ద ఉచిత గదులు పొందవచ్చు. ఒక్కరికి గది ఇవ్వరు కనీసం ఇద్దరు ఉండాలి.

వృద్ధులు, చంటిపిల్లల తల్లులకు కూడా ఉచితంగా ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు.
(ప్రస్తుతం కోవిడ్ వల్ల తాత్కాలికంగా నిలిపివేశారు)

తిరుమలలో నాలుగైదు చోట్ల అన్నప్రసాద కేంద్రాల్లో ఉచిత భోజన వితరణ ఉదయం 8 గంటల నుండే మొదలవుతుంది.

తిరుమల లోని అశ్విని ఆసుపత్రితోపాటు అపోలో ఆసుపత్రిలో వైద్యం ఉచితం .
ఇక ఘాట్ రోడ్డులో వాహనాలు చెడిపోయినా, ప్రమాదానికి గురైనా రిపేర్లు, భక్తులను గమ్యం చేర్చడం ఉచితంగా టీటీడీ ఏర్పాటు చేస్తుంది.
ఇవేకాక మరికొన్ని సేవలను కూడా టీటీడీ ఉచితంగా అందిస్తోంది. 

Sunday, 7 March 2021

మగువలు కావాలి మహారాణులు


ప్రత్యేకంగా ఏదో ఒక రోజున మాత్రమే కాకుండా అనుక్షణం మహిళను గౌరవించే ఏకైక సమాజం భారతీయ సమాజం

యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః*
యత్రే తాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురాః క్రియాః
ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను దేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వసంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుంది

'ప్రణమ్యా మాతృదేవతాః "
మాతృదేవోభవ అంటూ అమ్మను తొలిదైవంగా భావించింది భారతీయసమాజం

మాతృవత్పరదారేషు - పరస్త్రీని కన్నతల్లిగా భావించాలని ఉద్భోధించింది భారతీయ సమాజం
కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని సంస్కరించే గురుతరమైన బాధ్యతను గృహిణిగా మహిళకు అప్పజెప్పింది మన భారతీయ సమాజం

భూమితో బాటు సమస్త ప్రకృతిని మాతృస్వరూపంగా భావించి ఆరాధిస్తుంది మన భారతీయ సమాజం.
స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం

ప్రాచీన భారతంలో స్త్రీలు జీవితం లోని అన్ని కోణాల్లోనూ పురుషు లతో సమంగా తమ స్థాయిని అనుభవించే వారు . పురుషులు మాదిరిగానే చదువుకునే వారు . గొప్ప పండితులు , కవయిత్రులు , తత్వవేత్తలుగా ఎదిగినవారూ ఉన్నారు .
ఒక్కమాటలో చెప్పలంటే స్త్రీ ఆరోజుల్లో " లక్ష్మీదేవి " కి తీసిపోని స్థానాన్ని అనుభవించింది. అర్ధాంగిగా సంపూర్ణ పాత్ర పోషించేది .
స్వయంవరం ద్వారా తన భర్త ను ఎంఫికచేసుకునే స్వేచ్చ ఆనాటి మహిళలకు ఉండేదని పురాణాలు వలన మనకు అవగతం అవుతుంది .

మనదేశంపై విదేశీయుల దండయాత్రలు మొదలైన తరువాత స్త్రీల మాన ప్రాణాలను రక్షించుకునేందుకు వారిని ఇంటికే పరిమితం చేయటం మొదలైంది.
వారి మతాల ప్రాబల్యం పెరుగుతూ స్త్రీ ప్రాధాన్యం తగ్గనారంభించింది.
ఆయా మతాల సామ్రాజ్య విస్తరణతోపాటే సమాజములో లింగవివక్షత పాకడం మొదలైంది .
కొంతకాలం గడిచే నాటికి మహిళల స్థితిగతుల్లో గణనీయమైన తేడాలొచ్చేశాయి.
వారు వంటింటికే పరిమితం అయ్యారు .
నిజం చెప్పాలంటే స్త్రీ జీవితంలో చీకటికోణము అప్పటినుండే మొదలైంది ..
అయినా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీభాయి, చెన్నమ్మ తదితర వీర వనితలు తమ శక్తి సామర్ధ్యాలను చాటుకున్నారు.
స్వాతంత్ర్య అనంతరం సమాజంలో స్త్రీల ప్రాధాన్యతను పెంచేందుకు యెన్నో చట్టాలు వచ్చినా అవగాహనా లోపాలు, నిరక్షరాస్యతల వల్ల అమలుకు నోచుకోలేదు. కానీ గత రెండు, మూడు దశాబ్దాలుగా ఎంతో మార్పు వచ్చినప్పటికీ, ఇంకా స్త్రీ వివక్ష, బ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. పొద్దున్నే పేపర్ తెరచినా, టీవీ ఛానళ్లు చూసినా ప్రముఖంగా కనిపించే మహిళలపై అత్యాచారాలు హింస, వరకట్న వేధింపులు లాంటి వార్తలు బాధను కలిగిస్తుంటాయి..
మహిళల హక్కులు, గౌరవం, ప్రాధామ్యాల విషయంలో పోరాటాలు చేసే దుస్థితికి కారణం ఎవరు , ఎందుకు?..
ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.
మార్పు అనేది మన కుటుంబాల నుంచే రావాలి.. మన ఇళ్లలోని మహిళా మూర్తులను గౌరవించండి.. ఆడ పిల్లలను మగపిల్లలతో సమానంగా చదివించండి.. వారు స్వశక్తిపై ఎదిగేందుకు తోడ్పడండి.. చాలు
ఇక ప్రతిరోజు మహిళాదినోత్సవమే అవుతుంది
ఇదీ చదవండి👉 మహిళాదినోత్సవం