Monday, 30 July 2018

పచ్చని చెట్టు ప్రాణభిక్ష పెట్టు

నాలుగు రోజుల క్రితం ఉదయాన్నే ఊరికి బయలుదేరా, 
బస్టాండ్ లో ఎప్పుడూ మనం ఎక్కాల్సిన బస్సు తప్ప అన్నీ ఉంటాయి 
కానీ  బస్టాండ్ కు వెళ్ళగానే ఎక్కాల్సిన బస్ కనపడింది, అదృష్టం అనుకున్నా . 
వెళ్లాల్సిన ఊరికి ఒక గంటన్నర  ప్రయాణం. 
బస్ బయల్దేరాక గంటకు చిన్న పల్లెటూరులో ఓ ఐదుగురు బడిపిల్లలు ఎక్కారు
నా ప్రక్కనే ఒక అబ్బాయి ఏడుస్తూ వచ్చి కూర్చున్నాడు. 
బడికి వెళ్లటం ఇష్టం లేదేమో అని అడిగా.
కాదు అంటూ తలూపాడు.
మరింకేంటి అడిగా..
మాఇంటిముందు ఉన్న రెండు చెట్లూ కొట్టేస్తున్నారు అన్నాడు.
అయితే నువ్వెందుకు ఎడుస్తున్నావు అన్నా
రోజు ఉదయం, సాయంత్రం వాటికిందే కదా మేము ఆడుకునేది , 
దానికి ఉన్న ఊయల కూడా తీసేశారు,
మా టీచరేమో చెట్లు  లేకుంటే ఆక్సీజన్ ఉండదు 
అది లేకుంటే మనం చచ్చిపోతాము అంది. చెట్లు తీసేస్తే మాకు ఆక్సీజన్ ఎట్లా? 
మా ఇంట్లోవాళ్ళంతా చనిపోతామా అంకుల్ అన్నాడు.
ఏం మాట్లాడాలో తెలియలేదు
ఊళ్ళో బోలెడు చెట్లు ఉన్నాయి కదా ఏమీ కాదులే అన్నానే  కానీ
ఇలాగే చెట్లు నరికేస్తూ వెళ్తే  భవిష్యత్ఏ తరాల పరిస్థితి ఏమిటి అని
ఆ పిల్లవాడిలా కాకున్నా కొంత  తెలియని ఆందోళన నాలో కూడా  అనిపించింది .
చిన్నపిల్లవాడి లాగా కూడా మనం ఆలోచించడం లేదే అనిపించింది.

ప్రకృతే ఆధారంగా మన కథ ఆరంభమైంది.
కానీ ఆ ప్రకృతినే నాశనం చేస్తూ ఎదుగుతున్నాం.
ఇంత అందమైన ప్రకృతి ని  స్వార్దంతో పాడు చేస్తూ
భవిష్యత్  మానవాళికీ  ముప్పు తెస్తున్నాం .
ఇలాంటిది నేను ఒక సారి బెంగుళూరు లో చూసాను 
నిజానికి చెట్లు నరికి వేయటం, అడవులు తగ్గిపోవటం వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయి.

ఈమధ్య కాలంలో బాగా పెరిగిన గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ముప్పులు
పచ్చని పరిసరాలకు ఎంత సమీపంలో జీవిస్తున్నారనే దాంతోనూ ముడిపడి
ఉంటున్నాయి
పిల్లల్లో ఊబకాయం సమస్య కు చెట్లు లేకపోవడం వలన కలిగే
గాలి కాలుష్యం కూడా ఒక ముఖ్య  కారణం
పచ్చని ప్రకృతి మధ్యలో గడిపిన తర్వాత ఎదుటివారి పట్ల
దయ, నమ్మకం పెరుగుతున్నట్టు, కాలిఫోర్నియా
విశ్వవిద్యాలయం వారి పరిశోధన చెబుతోంది
పార్కులు,చెట్లతో కూడిన వీధులు గల చోట్ల నివసించే వృద్ధులు ఐదేళ్లు ఎక్కువగా
జీవిస్తున్నట్టు జపాన్ పరిశోధకులు చెప్తున్నారు
ప్రకృతి సన్నిధిలో గడపటం వలన ఒత్తిడి హార్మోన్ల
స్థాయులు బాగా తగ్గి  మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటాని దోహదం చేస్తుంది.
వినోద సాధనాలకన్నా ఇదే ఉత్తమ ఫలితాల్ని ఇస్తుంది
అంతేకాక ఇవి శబ్ద మరియు ధూలి కాలుష్య కారకాల వడపోతకు ఒక ముఖ్య సాధనంగా పని చేస్తాయి, దాంతో క్షయ వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు 


చెట్టులోనూ దేవుణ్ణి చూసే మనకు ఇలాంటి పరిస్తితి వస్తే???
క్లైమేట్‌ రియాలిటీ ప్రాజెక్టు సర్వే ప్రకారం భూమ్మీద ప్రతి మనిషికి సగటున 422 చెట్లుంటే.. భారత దేశంలో సగటున 28 మాత్రమే ఉన్నాయన్నారు.

వృక్షాలు నరికేస్తూ పొతే భూగోళం ఎడారిగా మారేందుకు ఎంతో సమయం పట్టదు
33శాతంగాఉండాల్సిన అడవులు క్రమేపి తగ్గుతూ ఉండటం వల్ల
ఓజోన్ పోరా దెబ్బతిని ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి
భూగర్భ జలాలు, భూసారం క్షీణిస్తున్నాయి.
కరువు కాటకాలు, ప్రకృతి  వైపరీత్యాలు తరచుగా సంభవిస్తున్నాయి

మనిషి జీవితంతో, ఆరోగ్యంతో ముడిపడిన ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నపుడే
నేటి మన పిల్లలు పెద్దయ్యే సరికి అందమైన ప్రకృతితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని
ఆయుష్షును వారికి అందించవచ్చు