ఉచితంగా తిరుమలకు అనగానే ఆశ్చర్యపోకండి. మన ఊరినుండి తిరుపతికి వెళ్ళడం ఉచితం కాకపోవచ్చు కానీ ఒక్కసారి తిరుపతిలో అడుగుపెట్టిన క్షణం నుండి మీరు మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యే వరకు చాలా సేవలు ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి భక్తులకు ఆర్థిక భారం తగ్గించేలా టీటీడీ ఎన్నో సేవలను ఉచితంగానూ లేదా నామమాత్రపు రుసుముతో అందుబాటులోకి తెచ్చింది. అందులో ముఖ్యమైనవి దర్శనం, భోజనం, వసతి.
తిరుపతిలో రైలు లేదా బస్సు దిగగానే మనకు మొదట కావల్సింది వసతి. దానికోసం రైల్వేస్టేషన్ పక్కనే విష్ణు నివాసంలో గానీ, లేదా బాస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీనివాసం వసతి సముదాయాల్లో ఉచిత లాకర్ సదుపాయం, పెద్ద పెద్ద డార్మెటరీలు అందుబాటులో ఉన్నాయి. నామ మాత్రపు రుసుముతో రూములు కూడా లభిస్తాయి.
భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలవరకు చేరుకునేందుకు ధర్మరథం పేరుతో ప్రతీ రెండు నిమిషాలకు ఒక బస్సు విష్ణు నివాసం నుండి బయల్దేరుతుంది. మన లగేజిని అక్కడే ఇస్తే ఉచితంగా తిరుమలకు చేరుస్తారు.
కాలిబాటలో కొండ ఎక్కే భక్తులకు మధ్యలో ఉచిత దర్శనానికి టోకెన్, ఉచిత లడ్డూ కూపన్ ఇస్తారు. అదనపు లడ్డూలకు కూడా అక్కడే డబ్బు చెల్లించి కూపన్లు పొందవచ్చు. మెట్ల మార్గం గుండా పైకి చేరుకున్న భక్తులు బస్టాండ్ ఎదురుగా ఉన్న CRO ఆఫీస్ వద్ద ఉచిత గదులు పొందవచ్చు. ఒక్కరికి గది ఇవ్వరు కనీసం ఇద్దరు ఉండాలి.
వృద్ధులు, చంటిపిల్లల తల్లులకు కూడా ఉచితంగా ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు.
(ప్రస్తుతం కోవిడ్ వల్ల తాత్కాలికంగా నిలిపివేశారు)
తిరుమలలో నాలుగైదు చోట్ల అన్నప్రసాద కేంద్రాల్లో ఉచిత భోజన వితరణ ఉదయం 8 గంటల నుండే మొదలవుతుంది.
తిరుమల లోని అశ్విని ఆసుపత్రితోపాటు అపోలో ఆసుపత్రిలో వైద్యం ఉచితం .
ఇక ఘాట్ రోడ్డులో వాహనాలు చెడిపోయినా, ప్రమాదానికి గురైనా రిపేర్లు, భక్తులను గమ్యం చేర్చడం ఉచితంగా టీటీడీ ఏర్పాటు చేస్తుంది.
ఇవేకాక మరికొన్ని సేవలను కూడా టీటీడీ ఉచితంగా అందిస్తోంది.