Wednesday, 21 March 2018

భూమ్మీద నూకలు చెల్లకుండా ఉండాలంటే

ఎపుడైనా కొత్త వాళ్ళు కాని, చాల రోజుల తర్వాత కలిసిన మిత్రులుకాని
నన్ను, పిల్లల్ని ఒక్క చోట చూస్తే మాత్రం ఆశ్చర్య పోతుంటారు.
నలభై దాటినా ఇరవై లాగే పిల్లలతో సమానంగా ఉన్నావు అంటారు.
మా ఫ్రెండ్స్ నన్ను తరచుగా అడిగే మాట కూడా ఇదే
ఎలా ఇంత బాగా  fitness మేంటైన్ చేస్తున్నావు అని.
ఆ రహస్యం ఏంటో మాకూ చెప్పకూడదు అంటుంటారు.
నేను మాత్రం తలకు రంగు వేసుకోకపోతే 
వీళ్ళే నన్ను ముసలోడివైపోయావురోయ్ 
అనేవాళ్ళని నవ్వుకునేవాడిని. నేను కూడా 
రెండు మూడేళ్ళ క్రితం వరకు జుట్టుకు రంగు వేసేవాడినే కాదు.
అలా వేసుకొని ఒకసారి మా అమ్మాయి వాళ్ళ కాలేజికి వెళ్తే 
అక్కడ స్టాఫ్ నన్ను పేరెంట్ అంటే నమ్మనే లేదు.
ఇక పిల్లలైతే వెళ్లి మీ అన్నయ్యోచ్చాడు అని చెప్పటంతో 
మా అమ్మాయీ నవ్వుకుంది. అప్పుడు రంగు వేసుకోవటం మానేస్తే... 
మరీ వెంట్రుకలు తెల్లబడిపోయాయని ఈ మధ్యే మళ్ళీ మొదలెట్టాను.

ఇక టాపిక్ లోకి వస్తే...
ఎవరైనా చనిపోతే
భూమ్మీద నూకలు చెల్లిపోయాయి అనటం మనం చూస్తుంటాం.
అసలు అర్థం అంతా అందులోనే ఉంది.
మనం తక్కువగా తిని ఎక్కువరోజులు బతుకొచ్చు అని.-
సాధారణంగా ఎక్కువ పని చేసే  ఒక మనిషికి శాస్త్రీయంగా 
రోజుకి 2000 క్యాలరీల శక్తికితగ్గ ఆహార పదార్ధాలు కావాలి . 
దానిని 1200 లకో, 1300 లకో తగ్గించుకుంటే ఎక్కువకాలం బ్రతకొచ్చట. 
అలా తగ్గించాలంటే జివ్హచాపల్యం చంపుకోలేని వాళ్ళు ఎన్నో 
 కష్టాలు పడాలి మరి. నలభై ఏళ్ళు వచ్చిన తరువాత
మన శరీర జీవక్రియల వేగం తక్కువవుతుంది కాబట్టి వ్యాయామం తో పాటు
క్యాలరీలు తగ్గించాలి మరి. యుక్తవయస్సు లో ఉన్నప్పుడు రాల్లైన 
అరిగించుకోవచ్చు అని కొసరి కొసరి వడ్డించే వాళ్ళనిప్రేమతో 
ఏమి అనకపోయినా నలభై దాటాక మాత్రం 
నిర్మొహమాటంగా వద్దని చెప్పాల్సిందే. అథవా తిన్నా ఎదో ఒక వ్యాయామం 
చేసి తిన్నది కాస్తా కొవ్వుగా మారక  ముందే  కరిగించాల్సిందే.
ఇది చదివాక కూడా మీరు మారలేదనుకోండి నేనేమీ చేయలేను 
నాలా షాపులో కూర్చునేవాడికి, సాఫ్టువేరు వాళ్లకు, కుర్చీ లోంచి లేవకుండా పని
చేసుకోనేవాల్లకు  రోజుకి 1500-1700 కాలరీలు అవసరం
ఇక మీ మీ అవసరాల ద్రష్ట్యా మీకు ఎంత అవసరమో తినండి .
నా మట్టుకు నేను  మాత్రం తినేదేదైన 1200-1500 కాలరీల వరకు ఉండేలా
 కూరలు ఎక్కువగాను అన్నం తక్కువగాను అదీ కూడా మూడు పూటలు
తినేలా ప్లాన్ చేసుకున్నాను.  ఇక మీరు కూడా  మీకోసం
 దేవుడిచ్చిన నూకలు పొదుపుగా వాడుకొంటే ఎక్కువ రోజులు  ఫిట్ గా బతకొచ్చు.
(తక్కువ తినేవారే ఎక్కువ కాలం బ్రతుకుతారని శాస్త్రీయంగా ధ్రువీకరింపబడింది)

Tuesday, 6 March 2018

నాకో తుపాకీ కావాలి


స్త్రీ గౌరవాన్ని మలినం చేస్తూ స్శర్శించే ఒక మగవాడి దురహంకారాన్ని 
సమాజంలోంచి చంపేసి, తుదముట్టించే తుపాకి కావాలి . 

అభంశుభం తెలియని  బాలల జీవితాలను చిద్రం చేసే కర్కోటకులను కడతేర్చే తుపాకీ కావాలి.

కోట్లాది అమాయక ప్రజల  జీవితాలని బలి తీసుకుంటున్న 
ఉగ్రమూలాల్ని  సమూలంగా పెకిలించే  తుపాకి కావాలి .

చట్టాలను అతిక్రమించే చుట్టాలను తుదముట్టించే తుపాకీ కావాలి. 

ఆర్టిక అసమానతలను పెంచుతున్న విధానాలని నిషేధించే తుపాకీ కావాలి.

మతం పేరుతొ జనం ప్రాణాల్ని హరిస్తున్న మూర్ఖులను  నిలువరించే తుపాకీ కావాలి.

ఆ తుపాకి మోత వింటే చాలు ఎవరైనా తప్పు చేయాలంటేనే భయపడాలి .

అటువంటి ఒక తుపాకి నాకు కావాలి 

"ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే "

అన్న మాట మరిచిన ఓ గోపాల....
 
నీ పాంచజన్యాన్ని తుపాకిగా నాకందించు!

కృత, త్రేత, ద్వాపర యుగాలను మించిన స్వర్ణ యుగాన్ని నేనీ ప్రపంచానికందిస్తా.



Tuesday, 27 February 2018

పెళ్లి లాంటి నిశ్చితార్ధం


నా చిన్నప్పుడు నిశ్చితార్ధం అంటే 
ఓ పది మంది మగ పెళ్లి వాళ్ళు వచ్చి అమ్మాయి మెళ్ళో 
ఎదో ఒక నగ వేసి, బట్టలు, "పూలు పండ్లు" పెట్టి వెళ్ళేవారు.
ఆడపెళ్ళి వాళ్ళు సైతం ఓ పదిమంది వెళ్లి వరునికి 
ఏ సైకిలో గడియారమో ముట్టజెప్పి కాసిన్ని డబ్బులతో "వరపూజ" చేసెటోల్లు.
అదికూడా కాస్త పెళ్ళికి ఎక్కువ సమయం ఉంటేనే.
అదీ లేకుంటే ఇంకాస్త చిన్నగానే చేసేవాళ్ళు.
అప్పుడే లగ్నపత్రికలు రాయించుకొని మార్చుకోనేవాళ్ళు. 
అంతే అంతటితో నిశ్చితార్థం అయిపోయినట్టే.

కాని ఈమధ్యకాలంలో 
పెళ్ళికి నిశ్చితార్దానికి పెద్దగా తేడా ఉండడంలేదు
పెళ్ళికి వచినంత చుట్టాలు, హంగు ఆర్భాటాలు
ఉంటున్నాయి.
జిలకర బెల్లం, తాళిబొట్టు తప్పించి అన్నీ ఉంటున్నాయి.
దాదాపు పెళ్లి లాగాఆర్భాటాలు, బంధువులు, 
ఆర్కెస్ట్రా, డాన్స్ లు....
వెల్ కం డ్రింక్నుండి మొదలుకొని ఆఖర్న ఐస్ క్రీం వరకు 
పళ్ళెం లో కనీసం ఇరవై రకాల పైననే ఉంటున్నాయి.

ఇక అతిథుల ముందు ఉంగరాలు మార్చుకోవడం 
తోటి మొదలవుతుంది ఫోటోల తంతు 
సినిమా షూటింగు లను తలపించేలా  
ఓ క్రేను,ఐదారుగురు కేమరామేన్లు... 
అబ్బో అదో అన్నపూర్ణ స్టూడియో ,
(నా కాలేజ్ రోజుల్లో యూసుఫ్ గూడలో ఉన్నప్పుడు 
అన్నపూర్ణ స్టుడియోలో షూటింగ్ చూడ్డానికి వెళ్ళా )
అదే గుర్తుకొస్తుంది.

ఏదేమైనా ఈ అనవసరపు ఆర్భాటాలు 
పెళ్ళికూతురి తండ్రికి ఆర్ధిక భారాన్ని మోపేవే  తప్పించి 
పెద్దగా అవసరం లేదని నా అభిప్రాయం...

Tuesday, 13 February 2018

అన్నా మనం చేపలు తినవచ్చా?


అన్నా మనం చేపలు తినవచ్చా?
అంటూ ఒక మిత్రుడు అడిగిన ప్రశ్న ఈ పోస్ట్ రాసేందుకు ఉపక్రమించేలా చేసింది.

వాస్తవానికి శాకాహారం వలన సాత్విక లక్షణాలు పెరుగుతాయి.
మాంసాహారం తినటం వలన కలిగే రజో గుణం మనల్ని తప్పు దారిలో నడిపిస్తుంది.
అదే సాత్విక గుణం మనల్ని ధర్మాధర్మ విచక్షణ చేసే స్థితిలో ఉంచి జ్ఞానం వైపు నడిపిస్తుంది. 

అందుకే ప్రాచీన కాలంలో సమాజంలో ఆచార్యులుగా వ్యవరించే బ్రాహ్మణులకు,
వ్యాపార వర్గాలైన వైశ్యులకు ఇంకా మరికొన్ని సామాజిక వర్గాలకు నిషేధించి ఉండవచ్చు.
వీళ్ళకే ఎక్కువగా సహనాన్ని, శాంతిని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.

ఎంతకాలం మానవులు జీవులను హింసిస్తుంటారో, చంపుతుంటారో అంత కాలం యుద్ధాలుంటాయి అని  జార్జి బెర్నాడ్ షా అన్నారు 

హిందువులు, బౌద్దులు, జైనులు ఎక్కువగా ఉండే భారత్, నేపాల్, భూటాన్,శ్రీలంక తదితర దేశాలలో శాకాహారుల జనాభా మొదటి నుంచి ఎ క్కువగానే ఉంది. మాంసాహారంపై మతపరమైన ఆంక్షలేవీ లేని పాశ్చాత్య ప్రపంచంలో మా త్రం శాకాహారుల జనాభా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది .
కొన్ని నివేదికల ప్రక్కరం భారతదేశంలో 31 శాతం,బ్రిటన్‌లో 21 వాతం, యురోప్‌లో 10 శాతం,అమెరికాలో 4 శాతం శాకాహారులు ఉన్నారట.
మాంసాహారులు ఎక్కువగా ఉండే స్పెయిన్, నెదర్లాండ్, స్వీడన్, ఇజ్రాయిల్ వంటి యురోపియన్ దేశాల్లో.... కానీ మన దేశంలో తగ్గుతున్నాయి.

ఇక  నాలాంటి శాకా హారులుగానే ఉందామనుకునే నిర్ణయమున్న
వారికి బయటకెళ్లి తినటం అనేది జటిలంగా
మరుతోంది మన శాకాహార దేశంలో నిజమేనండీ !!
నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను శాకాహారులు తగ్గిపోవడం వల్ల.
నలుగురితో కలసి పార్టీ లకు, ఫంక్షన్లకు  వెళ్ళాలంటే
నా వల్ల వారికి, వారి వల్ల నాకు ఇబ్బంది కలుగుతోంది.
ఏదైనా వెజ్ ఆర్డర్ చేస్తే దానిలో ముక్కలు తీసేసి
తీసుకోస్తారని అనుమానం బాగా.. ఇంకా బిర్యానికి ఇచ్చే సూప్ ఐతే మరీ.. 
గతంలో ఒకసారి కేరళ టూర్ వెళ్ళినపుడు భోజనానికి చాలా ఇబ్బంది అన్నాను కదా.  clik hear
మాతో వచ్చిన ఒక మిత్రుని కోసం ప్యూర్ వెజ్ హోటల్ కోసం గంటన్నర వెదకాల్సి వచ్చింది.

Saturday, 3 February 2018

గుడిలేదు గోపురంలేదు అయినా కోట్లాది జనం



ఈ రోజే జాతర చివరి రోజు కావటంతో , దేవతల వనప్రవేశంలోపు వెళ్లాలని ఉదయాన్నే బయల్దేరనుకున్నాం.



ఎందుకంటే దాదాపు 100 కిలోమీటర్లు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుంటే
 ఓ రెండున్నర గంటల్లో వెళ్ళొచ్చు కాని జామ్ అయితే అమ్మల దర్శనం కుదరదని
ముందుగానే రెడీ అయి వెళ్ళినా భయపడినంతా అయింది.
 ట్రాఫిక్ జామ్ లో దాదాపు గంటన్నర ఆగిపోవాల్సివచ్చింది. ఎప్పుడూ  ట్రాఫిక్ జామ్ లు ఎరుగని మాకు ఇవి మాకు కాస్త విసుగనిపించింది. కానీ మా హైదరాబాద్ లాంటి నగరవాసులకు అలవాటే అని పక్క సీటు లో కూర్చున్నతను అన్నాడు. దాదాపు 200 కిలోమీటర్లు వన్ వే చేసినా, కొన్నిచోట్ల అధికార్ల సమన్వయలోపం, కొందరు వాహనదార్ల అత్యుత్సాహం, ముందుగా వెళ్ళాలనే తపనతో అడ్డ దిడ్డంగా వెళ్ళటం ట్రాఫిక్ జామ్కి కారణమట. అయినా మేడారం చేరేసరికి మధ్యాహ్నం రెండైనా
మా తమ్ముడి బంధువు గుడి దగ్గర డ్యూటీలో ఉండటంతో vip దర్శనం పది నిమిషాల్లో అయింది.
కాని గద్దెల దగ్గరికి వెళ్ళగానే మిత్రుడు చెప్పినట్టు
గుడిలేదు గోపురంలేదు                  
అర్చనలేదు అభిషేకం అంతకన్నాలేదు                           
తీర్థంలేదు తియ్యని లడ్డులేదు        
 మడిలేదు మంగళహారతిలేదు 
కోలవడానికి ఓ రూపంలేదు 
కలవడానికి ప్రత్యేకదారుల్లేవు   
ఉన్నదొక్కటే నమ్మకం 'అమ్మ' అంటే ఆకలితీరుస్తది' 
ఆనమ్మకమే 'సమ్మక్క-సారక్క'  అనిపించింది. 
ఒకప్పుడు వేళల్లో ఉన్న భక్తులు కోట్లకు చేరటమే అందుకు నిదర్శనం.
ఇక్కడ క్లిక్ చేయండి వివరాలకు 
తెచ్చిన బంగారం(బెల్లం), టెంకాయలు అమ్మలకు సమర్పించి 
బయటకు రాగానే జ్యోతిష్యం చేపుతామంటూ కోయదొరలు,
పూసలదండలు, రుద్రాక్ష మాలలు కొనండని ఒకరు,
బొమ్మలు కొనమని ఇంకొకరు, వాళ్ళందరిని తప్పించుకొని
తెచ్చుకున్న  భోజనాలు ముగించుకొని తిరుగుప్రయానమయ్యాం
అమ్మల ఆశీర్వాదంతో,

గిరిజన మ్యూజియం


వేలాది బస్సులు ఒకే చోట 

Saturday, 20 January 2018

భక్తి


TV సరిగా రాకపోవటంతో ట్యూనింగ్ మొదలుపెట్టా 
దాదాపు 300 చానల్స్  వస్తున్నా తెలుగువి మాత్రం ఓ 50 ఉండొచ్చు.
అందులో భక్తి ,దైవసంబధిత మతపరమైన విషయాలను బోధించే చానల్స్ కూడా చాలానే కనిపించాయి
ఒక్క తెలుగులోనే 10కి పైగా  కనిపించాయి.
ఇది ఒకందుకు మంచిదే అనిపించింది.
మతం మనుషులకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అంటే 
భక్తి భావం మనిషిలో విలువలను మాత్రం  పెంచుతుంది. 
అది ఏ మతమైనా కావచ్చు దైవాన్ని విశ్వసించే వాడు మొత్తం సమాజం మంచిని కోరుతారు.
అని నా నమ్మకం.
ఇక ఒక్క మానసిక ప్రశాంతత తప్ప అన్ని రకాలైన ఆధునిక సౌకర్యాలనూ 
మనిషి అత్యంత సులువుగా పొందుతున్నాడు. 
అందుకే ప్రశాంతత కోసం మనిషి దేవుడిని ఆశ్రయిస్తున్నాడు .
మనం గమనిస్తే ఇప్పుడు ఆలయాలను సందర్శించే వారిలో పెద్దవాళ్ళ కంటే  
యువతీ యువకులే ఎక్కువగా కనిపిస్తున్నారు .
మనిషి జీవితంలో కష్టాలు పెరిగినా కొద్దీ  దైవంపై భక్తి మరింతగా పెరుగుతుంది కదా.
ఈ నమ్మకం అతనికి కొంత మానసిక ప్రశాంతతను పాజిటివ్ థింకింగ్ను
ఇస్తుంది అంతే తప్ప వారికి గానీ సమాజానికి గానీ నష్టమేమీ లేదు.
ఐతే భక్తి, మత సంబధిత విషయాలలో, మత గురువులు, ప్రబోధకుల విషయాలలో
చానల్స్ కొంత విచక్షణతో వ్యవహరిస్తే బాగుంటుంది .
గురువులు, ప్రబోధకులను పిలిచి డిబేట్ లు పెట్టేటప్పుడు ఆయా విషయాలపై 
తమకు అవగాహన ఉన్నదా, చర్చించే తాహతు తమకుందా, తదుపరి పర్యవసానాలు 
ఏమిటీ అని ముందే చూసుకుని బేరీజు వేసుకుంటే  మంచిది. 
(ఇట్లా డిబేట్ లు పెట్టేఒక చానల్ గతంలో సర్వమత చానల్ అంటూ ఒక చానల్ను 
ప్రారంభించి తక్కువ సమయంలోనే మూసుకున్నది గుర్తుండే ఉంటుంది )
ప్రేక్షకులు కూడా తమ విచక్షణ తో అటువంటి చానల్స్ ను పక్కన పెడితే మంచిది.
ఏదేమైనా భక్తీ అనేది మనిషిలో ప్రశాంతతను, సాత్వికతను,భూత దయను 
కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

Tuesday, 16 January 2018

మ్యూజియంలో మన పండగలు


దేశంలోని వివిధ సాంప్రదాయక పండగలని, భిన్న ప్రాంతాల కళలను
 పరిచయం చేసేందుకు ఏర్పాటైన శిల్పారామంలో
ఇక్కడి  మన స్థానిక సాంప్రదాయ పండగలని కూడా
కొత్తగా ఎక్కడివో అన్నట్టు వింతగా  చూడవలిసి రావటం ..
అంటే ఆధునికత ముసుగులో మనం మన సంప్రదాయాల్ని, రుచులని ఎలా మరచిపోతున్నామో అద్దం పడుతోంది.

నిన్న ఒక మిత్రుడికి  శుభాకాంక్షలుచెబుతామని ఫోన్ చేస్తే
మాటల  మధ్యలో శిల్పారామం వెళ్లిందీ అక్కడ మన సంక్రాంతి హరిదాసులు,
గంగిరెద్దులవాళ్ళు, బుడబుక్కల వాళ్ళను చూసి పిల్లలు సంతోష పడ్డారని చెప్పాడు.
చిన్నప్పుడు చాల మంది ఇలాంటి వాళ్ళు పండగలకి మన ఊళ్లలో వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు
వస్తున్నారా అన్నాడు.
ఏం వస్తార్రా బాబు మొన్ననే  హైదరాబాద్లో గంగిరెద్దుల వాళ్ళని భిక్షగాల్లంటూ అరెస్ట్ చేసారట
కదా అన్నా, అవునురా అలా  అరెస్ట్ చేయడం ఎందుకు? మళ్ళా  వాళ్ళని శిల్పారామంలో ప్రదర్శనల కోసమని ఆంధ్రా నుండి పిలిపించటం ఎందుకు? అన్నాడు

ఇప్పటికే మన పండగల కంటే ఎక్కువ స్థాయిలో ఇంగ్లిషోడి పండగలే జరుపుకుంటున్నాం.
మన సాంప్రదాయ పిండి వంటలకంటే వాడి పిజ్జా బుర్గర్ లే మనకు నచ్చుతున్నాయి.
ఏమోరా! ఇలాగైతే మన పండగలని మన పిల్లలిక మ్యుజియంలోనే చూసుకోవాలి అన్నాడు.

పండగలు మనకు మన పూర్వీకులు ఇచ్చిన వరం.
దీంట్లో ఎన్నో ఆహార,  ఆరోగ్య, వ్యవహారిక సూత్రాలు ఇమిడి ఉన్నాయి.
బెల్లం నువ్వుండలు, అరిసెలు, కొత్తబియ్యంతో చేసిన పిండి వంటలు
చలికాలంలో శరీరానికి వేడిని అందించి సంవత్సరమంతా
ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి .
ఇలా ప్రతి పండగకి వండే  ప్రసాదాలు ఆయా కాలాలకు అనుగుణంగా ఆరోగ్య సూత్రాలను
ఇముడ్చుకొని ఉంటాయి.
కాని గ్లోబలైజేషన్, మోడరన్ కల్చర్ ముసుగులో
మన సాంప్రదాయాలను ఫణంగా పెడుతున్నాం అనిపిస్తోంది
ఎంత అభివృద్ధి చెందిన మన మూలాల్ని మాత్రం మరవకూడదు.
అలా మరచిపోయిననాడు మ్యుజియంలే దిక్కు మనకు  .....