Friday, 15 September 2017

స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్ళిలాంటిదే


మొన్న ఒక రోజు  సిటీకి వెళ్ళినప్పుడు  
ఆటోలో వెళ్తుంటే పెద్ద ఊరేగింపు
ఎదురుగా రావటంతో ఆటో పక్కకు ఆపాడు డ్రైవర్.
ముందు పెద్ద బ్యాండు మేళం ,ఆ వెనకే చప్పుడ్లు
కొంత మంది డాన్స్ లు చేస్తున్నారు,
ఇంకా ఓ 30,40 కార్ల వరుస
దాదాపు ఓ 50మందితో  పెళ్లి ఊరేగింపు అనుకున్నా,
కాని ఎక్కడో తేడా కొడుతోంది
దగ్గరికొచ్చాక చూద్దునుగదా అది శవయాత్ర.
ఆశ్చర్యం ఇంతపెద్దగానా  అంతిమయాత్ర .
బాగా డబ్బు, పలుకుబడి కలిగిన వ్యక్తట.
దాదాపు ఓ 3  లక్షల పైనే  ఖర్చు ఉండొచ్చు.
ఆ మాత్రం లేకపోతె ఎలా? అన్నారు.
కాకపొతే నాదొక్క డౌటు చనిపోయిన రోజే
ఇంత ఖర్చు చేస్తే మిగతా 11 రోజులు
ఎంత ఖర్చు ఉంటుందో ..
అయినా డబ్బున్నోడి ఇంట
చావుకూడా పెళ్ళిలాంటిదే  

Friday, 1 September 2017

అడుగడుగునా గణపతి


ఇప్పుడు మా వూళ్ళో ఏ చౌరాస్తా లో నిలబడి చూసినా
కనీసం ఒక అయిదు, ఆరు గణపతి మండపాలు
కనిపిస్తాయి. లౌడ్ స్పీకర్లలో పాటలు మొగుతూంటాయి.
అందరూ గణపతి ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్
ప్రవేశపెట్టాడు అనుకుంటారు,కాని అంతకుముందే ఉన్న
వీటికి స్వాతంత్రోద్యమ కాలంలో బాగా ప్రాచుర్యం కలిపించి
ప్రజలందరినీ సంఘటితం చేయటానికి వేదికగా వాడుకున్నాడు.
అప్పుడు ఊరికో గణపతిని ప్రతిష్టించి అందరూ అక్కడికే వచ్చేవారు.
కాని ఇప్పుడు ఒక్కో పార్టీకి, కమ్యునిటికి,గుడికి, బడికి, వాడకు
వేరు వేరుగా ప్రతిష్టించి ఎవరికివారే పూజలు చేసుకుంటున్నారు.
హిందువులకు భక్తి ఉన్నది.. కానీ శక్తిలేదు అని కొందరు
అంటుంటారు. అవును సంఘటిత శక్తి  లేదు అనిపిస్తుంది
ఇన్ని మండపాలు చూసినపుడు.
ఇందులో ఆర్భాటానికో, చందాలు దండుకోవటానికో కొన్ని
వెలిస్తే కొన్ని మాత్రం దీన్ని వేదికగా చేసుకొని ఎన్నో
హర్షించదగిన సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాయి.

ఆర్య వైశ్య యువజన సంఘం వారు మాత్రం
ఎక్కువగా సామాజిక  కార్యక్రమాలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తారు.
మొదటి రోజు మట్టి గణపతి ప్రతిమలు ఉచిత పంపిణీ నుండి మొదలుకొని
విద్యలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, వివిధ అంశాలపై
వ్యాసరచన పోటీలు, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకను చాటుతారు.
ఇప్పటివరకు మా ఊళ్ళో ఏ ఉత్సవాలకు
పెద్దగ గొడవలు జరిగిన దాఖాలాలు లేవు .
కాని ఈసారి పోలీసులు ఎక్కువగా నిబంధనలు విధించారు.
ఐతే ఇన్ని మండపాలు ఒక్కొక్కటిగా తగ్గి ఒక్కటే ఐతే ఎంతోసంతోషం
మా ఊరు ఊరంతా ఐకమత్యంగా ఉన్నారని , కానీ నెరవేరదు కదా .



Thursday, 17 August 2017

కన్నీరే మిగిలిందిక


వృద్ధులను బాగున్నావా? అని పలకరిస్తే ఆనందం కన్నా కన్నీళ్ళే రాలుతున్నాయి .
 తగ్గుతున్న మానవత్వ విలువలకు నిదర్శనం ఇది.
ఈ రోజు కంటి చూపు పరీక్ష చేయించుకుందామని ఆసుపత్రికి  వెళ్ళాను.
నాలాగే చాలా మంది వచ్చారు, అందులో వృద్ధులే ఎక్కువ . 
తెలిసిన వారి హాస్పిటల్ కాబట్టి 
ఎక్కువగా వెయిట్ చేయాల్సిన పని లేదు కాని 
డాక్టర్ లంచ్ చేస్తుండటంతో పావుగంట ఆగాల్సివచ్చింది.
వచ్చిన పేషంట్లలో కొంత మంది తెలిసిన వాళ్ళు
ఉండటంతో మాటలు కలిపాను.
వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటూ వీళ్ళకు కొంత డబ్బు పంపిస్తున్నారట,
పండక్కో పబ్బానికో కానీ రావటంలేదట ,
 కొందరైతే అదీ లేదట ఎన్ని సంవత్సరాలైందో
అని కన్నీటి పర్యంతమయ్యారు.
వాళ్ళను పెంచి పెద్ద చేసేందుకు తెచ్చిన అప్పులే తీరలేదట.

 అమ్మా నాన్నలను మిస్ అవుతున్నట్టు ఫేస్బుక్ వాట్స్ అప్ స్టేటస్ లు పెట్టేకంటే
రోజు ఒక్కసారైనా ఫోన్ లో పలకరిస్తే ఎంత ఆనందిస్తారో.
తల్లి దండ్రులకు శుభాకాంక్షలు చెప్పటమంటే
జీవితాంతం వాళ్లకి సేవ చేయటమే కాని
స్టేటస్ లు పెట్టడం కాదు.
అయినా స్వతంత్ర భావాలకు అలవాటు పడి
ఏదైనా మనకెందుకులే అని బ్రతుకుతున్న వాళ్లకి
ఇదంతా ఎప్పుడు బోధపడుతుంది  అత్యాశ కాకపొతే...



Sunday, 6 August 2017

రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు


అందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు....

ప్రపంచంలోని ఏ మతానికీ  లేని  ప్రత్యేకత హిందూ ధర్మానికి  సొంతం .
ఎన్నో మతాలు, ధర్మాలు, వర్గాలు, కులాలూ ఉన్నప్పటికీ
పూల దండలోని దారం ఎలాగైతే వివిధ రకాల, రంగుల, వాసనల
 పూవులను కలిపి ఉంచుతుందో  అదేవిధంగా
భారతీయులందరినీ హిందూ ధర్మం అలాగే కలిపి ఉంచుతుంది.
ఇదే ఇక్కడి గొప్పతనం.
అటువంటి హిందూ ధర్మంలోని సాంప్రదాయాలు,
ఆచారాలు, పండుగలు విభిన్నం,ప్రత్యేకం.
ఇందులో ముఖ్యమైనది రాఖీపౌర్ణమి.
అన్నచెల్లి, అక్కాతమ్ముల్ల అనుబంధానికి ప్రతీక ఈ పండగ .
ప్రపంచంలోని ఏ మతంలోనూ,దేశంలోనూ ఈ పండుగ కనిపించదు.
నిజానికి అన్నాచెల్లెల బంధం ఎంత అపురూపమైనది!
అన్నాచెల్లెల బంధము చిక్కని స్నేహానుబంధ సీమలకన్నన్
మిక్కిలి పైస్థాయినిపెంపెక్కిన చక్కని విశిష్ట ప్రేమామృతమౌ
అంటాడో కవి...
అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు…. 
కుటుంబంలో ఆప్యాయతలకు నెలవైన
అనుబంధాలు. 
చెరిగిపోని, కరిగిపోని ప్రేమానుబంధాలు. 
అమ్మ, నాన్న తర్వాత అంతటి
ప్రేమాభిమానాలు ఉండేది సోదరీసోదరుల మధ్యనే.  
అక్కో చెల్లినో రాఖీ కడుతుంటే 
మురిసిపోని సోదరుడు ఉంటాడా చెప్పండి.
కానీ 'ప్రేమా... గీమా'
అంటూ వెంటపడేవారిని వదిలించుకోవడానికో..      
 బహుమతులను  ఆశించి  'అన్నా' అంటూ పొడి పొడి అప్యాయతలతోనో 
రాఖీలు కట్టి నవ్వులపాలు కాకండి. 

మరొక్కసారి

అందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు....

Tuesday, 18 July 2017

పిల్లలు జాగ్రత్త

 రోడ్డు మీదకు వెళ్ళేటప్పుడు పిల్లల్నిజాగ్రత్తగా  చూసుకోండి.
ఇద్దరు పిల్లలు ఒకటి రెండు బ్యాగులతో 
వెళ్ళేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు  ఇంకా జాగ్రత్త.
 పిల్లల చేయి వదలకండి, గడుగ్గాయి లాంటి పిల్లలతో 
ఇంకా ఇంకా  జాగ్రత్త. లేదంటే కడుపు కోత మిగులుతుంది.
కింది వీడియో చుడండి చిన్న పిల్లవాడి 
అనాలోచిత చర్య ప్రాణం తీసింది 

వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 
పొంచి వున్న ప్రమాదాలు చాలానే ఉంటాయి.
భారి వర్షాలు వరదలతో రోడ్లు జలమయం అవుతున్నపుడు 
పిల్లల్ని బడికి పంపకపోయినా పెద్ద నష్టం లేదు.
 వారి ప్రాణాలకంటే ఏదీ విలువైనది కాదు.
దీంట్లో  చూడండి అదృష్టం కొద్దీ

ప్రాణాలతో బయటపడ్డ పిల్లవాడిని.


తప్పనిసరై పిల్లల్ని ఒంటరిగా పంపేటప్పుడు
వెనకా ముందూ ఆలోచించి పంపించండి,జాగ్రత్తలు చెప్పి పంపించండి 
లేదంటే తీరని బాధ మిగులుతుంది.

Saturday, 8 July 2017

ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా....




ఇక ఏడుకొండలకు ఉన్న మెట్లన్ని
ఎక్కి వెళ్లినా భక్తసులభుని దర్శనం
ఇక నుండి దుర్లభమే....

శ్రీనివాసా!
భక్తులు తిండిలేక గాని,
దేశాలు చూడాలని గాని నీ దగ్గరికి రారు.

వారి బలగాన్ని వసతులను వదలుకొని
కాలినడకన అలసి సొలసి వచ్చి నీ క్షణకాల దర్శనం కోసం
మళ్లీ పడిగాపులు పడటం ఏమిగతి స్వామి...
నీవు భక్తులను కాపాడే వాడవంటారే,
కాని నీ అక్రమాల కార్యాలయంలో లడ్డూలు,  వడలు వంటి
ప్రసాదాలనేకాక దర్శనానికి టకెట్లు అమ్ముతారా!!

ఏమి దుర్దశ ?
భక్తులకు నీ దర్శనం కూడ
ఉచితంగా అందించలేవా -

ఇక నుండి శుక్ర, శని ఆది వారాల్లో
కాలినడక భక్తులకు దివ్య దర్శనం
నిలిపి వేస్తూ TTD తీసుకున్న నిర్ణయం
శ్రీవారి భక్తులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
సామాన్య భక్తులకు సేవలందిచాల్సిన TTD
డబ్బు చెల్లించేవారికి, VIP లకు దాసోహమంటోంది.
భగవంతుడి ముందు ఎవరైననూ సమానమేనని
ఎప్పటికి తెలుస్తుందో.
సామాన్యులూ భక్తులేనని ఎప్పటికి గుర్తిస్తుందో.

Tuesday, 4 July 2017

వృద్ధాశ్రమాలు అవసరమా


చాల సంవత్సరాల క్రితం ఒకసారి
R P పట్నాయక్ గారిని ఒక వృద్దాశ్రమం ప్రారంభోత్సవానికి పిలిస్తే 
తన ప్రసంగంలో  ఆశ్రమం అట్టర్ ప్లాప్ కావాలని కోరుకున్నాడట. 
దాంతో పిలిచినవాళ్ళు ఖంగు తిన్నారట.
చాలామంది కూడా ఇదే కోరుకుంటారు.

ఎందుకంటే..


ఇవి మన భారతీయ సంస్కృతికి, జీవన  విధానానికి విరుద్ధమైనవి కాబట్టి. 
కాని మారిన పరిస్థితుల్లో ఇవి  అనివార్యం అవుతున్నాయి. 
ఉన్నత చదువులకై , ఉద్యో గాలకు  విదేశాలకు, దూరప్రాంతాలకు
వెళ్లినవారు తప్పనిసరై ఆశ్రమంలో ఉంచితే అర్థం ఉంది.
 వారికి తమ తల్లిదండ్రులపై ప్రేమ లేదనుకుంటే  అది పొరపాటే 
వారి పితృ భక్తిని శంకించాల్సిన అవసరం లేదేమో
కాని తల్లితండ్రులను సరిగ్గా చూసుకొకపొవడం, 
ఒకే ఊరి లొ ఉండి వృద్ధాశ్రమాలలొ పెట్టడం తప్పు. 
ఇటువంటి వారిని నిరుత్సాహపరిచి శిక్షించే  విధంగా
చట్టాలు వస్తే బాగుంటుంది. ఇప్పటికే కొన్ని కోర్టులు 
వేరుకాపురం గురించి తీర్పులివ్వడం మంచి పరిణామం.
కని  పెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం 
మంచిది కాదని కోర్టులు మందలించటం మన జీవన విధానంలో
అన్ని  బంధాలను ఏ విధంగా దూరం చేసుకుంటున్నామో 
గుర్తు చేస్తోంది.
మాతృ దేవో భవ పితృ దేవో భవ అన్న వేధ మంత్రాన్ని 
వల్లే వేసిన నోటితోనే బయటికెల్లిపోమ్మని ఎలా అనగలుగుతున్నారు.
కడుపు కట్టుకొని వారు సంపాదించిన ఆస్తులను మాత్రం అక్కున చేర్చుకొని 
అనాథలుగా వారిని వ్రుద్దశ్రమాల్లో చేర్చేముందు 
మీకూ అదే గతి అత్యంత వేగంగా వచ్చేస్తుందని గమనించండి 
మీక్కూడా చావుకు ముందు వచ్చే చివరి మజిలీఅదే కాగలదు.