Wednesday, 8 March 2017

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు






ఎప్పుడూ అమ్మో,
భార్యో, కూతురో తోడు లేనిదే జీవితాన్ని కొనసాగించలేని
ఈ పురుష ప్రపంచానికి ఒక్క మాట ........

        పురుషాధిక్య  భావజాలానికి స్త్రీ
పురుషులిరువురూ అలవాటు పడ్డ ఈ సమాజంలో మార్పు రావాలి.
 అలా అని కేవలంస్త్రీలపై హింస తగ్గిపోవడంతోనే
కాకుండా సమానతను కల్పించాలి.
ప్రకృతిలో సంఖ్య లోనూ,
సాధికారతలోనూ స్త్రీ పురుషుల సమతుల్యతకి
ఆవశ్యకమైన మార్పు రావాలి.
స్త్రీలపై అత్యాచారాలూ, పుట్ట బోయే ఆడపిల్లల
భ్రూణ హత్యలూ , యాసిడ్ దాడులూ, 
వరకట్న మరణాలూ లేని సమాజం నిర్మితమవ్వాలి.
         
           తల్లిలా,చెల్లిలా,చెలిలా నెచ్చెలిలా,కూతురిలా ఇలా
ఎన్నో ఎనెన్నో రూపాలతో ఈ సృష్టి కే సృష్టి కర్తలైన స్త్రీ మూర్తులందరికీ
మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

Tuesday, 7 March 2017

ప్రజల చేతికి బ్రహ్మాస్రాలు

ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం మనది.
సవరణలు కూడా ఎన్నో ...
మారుతున్న కాలానికనుగుణంగా భారత ప్రజల
జీవితాలను మెరుగు పరిచేందుకు ఎన్నో
చట్టాలను
అమలులోకి తెచ్చిన ప్రభుత్వం
ఇప్పుడొక కొత్త బిల్లును తెచేందుకు
సమాయత్తమవుతోందట .
ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడిని నచ్చకపోతే
దించేసేఅధికారం ప్రజలకుఇవ్వబోతోందట.
అదే గనక జరిగితే ఏ రాజకీయ నాయకుడైన
ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని
చేయవలసిందే.
ప్రజలకు ఇదివరకే అందించబడిన
వజ్రాయుధం RTI
సమాచారహక్కు చట్టం, ఇప్పటికే చాలామట్టుకు
ప్రభావం
చూపెడుతోంది .దీనికి తోడు ఈ రీకాల్ చట్టం
కూడా వస్తే
వెధవ వేషాలు వేసే నాయకులను దించేసి ,
మంచి పరిపాలనాదక్షత కలిగిన నిజాయతీ కలిగిన
నాయకులను
గద్దేనేక్కించ వచ్చు.

Saturday, 25 February 2017

పతనం వైపు పరుగు



ట్రంప్ వచ్చాక అమెరికాలో  ఇప్పటిదాకా ఏకంగా 1,000  కి పైగా
 జాతి వివక్ష దాడుల ఘటనలు  జరిగాయి .
అత్యధికం యూనివర్సిటీ క్యాంపస్‌లలోనే జరుగుతుండడంతో అటు
 భారతీయ విద్యార్థులు , ఇక్కడ తల్లితండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు .
 అసలే ఒళ్ళంతా జాత్యహంకారం కలిగివుండే తెల్లవాళ్ళను  ట్రంప్ వ్యాఖ్యలు బాగా
 రెచ్చగొడుతున్నాయి.  
'మా దేశం నుంచి వెళ్లిపొండి...’ తెలుగు ఇంజనీర్ ను కాల్చి చంపుతూ
 దుండగుడు  గట్టిగా అరుస్తూ అన్న మాటలు చాలు,
వారి  నరనరాన జాతి వివక్ష ఎలా   జీర్ణించుకుపోయిందో  తెలుసుకోవడానికి .
అమెరికాను మళ్లీ గొప్పదేశంగా నిలబెడదాం’ అనే నినాదం తో ప్రచారం చేసిన ట్రంప్
 తన  చర్యలతో  అమెరికాను ఇప్పుడున్న స్థితి నుండి పతనం వైపు తీసుకెళ్ళకపోతే చాలు  అనేది చాలా మంది  అమెరికన్ల మాట .
చాలామంది వలసలకు అనుకూలంగా ఉన్నా కొంతమంది చర్యల వల్ల విదేశీయులు
 సహజంగానే  తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారు .
ఐతే ద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారంచేసే సంస్థలు ట్రంప్ గెలిచాక
 300 శాతానికి పెరిగాయి .
వీరి విద్వేషానికి అధ్యక్షుని మద్దతుకూడా ఉంది కదా !
తానేమీ ప్రపంచానికి ప్రతినిధిని కాదని,
 కేవలం అమెరికాకు మాత్రమే అధ్యక్షుడిని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా
ట్రంప్ అక్కడ ఉన్న విదేశీయులకు తానేమి రక్షణ  కల్పించాలనుకోవడం లేదని
 మా  దేశాన్ని విడిచి వెళ్ళడమే ఏకైక మార్గమని  చెప్పకనే చెప్పాడు .
ఈ సమయంలో భారతీయులు అమెరికాలో ఉండడం ఎంతవరకు శ్రేయస్కరం .
హెచ్‌1బి వీసాల విషయంలో తొందరపాటు చర్యలు సరికాదని అమెరికాను కోరకుండా
 ప్రధాని మోడీ  భారతీయులందరినీ
తిరిగి స్వదేశానికి రమ్మని కోరితే బాగుండేది.
ప్రపంచం మొత్తం ఒకవైపు అమెరికా ఒక్కటి ఒకవైపు అనే అభిప్రాయాన్ని కలిగిన
 అమెరికన్లు తమ పతనానికి తామే
బాటలు వేసుకుంటున్నారు  తెలివైన వాళ్లని కోల్పోవడం ద్వారా.

Thursday, 23 February 2017

చిదానంద రూపం శివోహం శివోహం



ప్రతి సంవత్సరం మాఘ
బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి
అత్యంత ప్రాధాన్యంగల పవిత్రదినం.
శివుడు ఈ రోజే
లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.
క్షీరసాగర మధన సమయంలో వచ్చిన గరళాన్ని శివుడు తన గళాన నిలిపి
ముల్లోకాలను కల్లోలం నుంచి కాపాడిన
కాళరాత్రీ శివరాత్రేనట.
శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం
ఏమిటంటే- శివుని పేరు పలికే నాలుకే నాలుక,
శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని
పూజించే చేతులే చేతులు. శివుని సదా
స్మరించేవాడే ధన్యుడు.
'శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనటంలోని
ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు
సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే.
సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ
శివమయమే. శివం కానిది 'శవ'మంటారు
జ్ఞానులు.
ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ
ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండటమే
నిజమైన నియంత్రణం. అదే నిజమైన ఉపవాసం.
మితృలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

Tuesday, 21 February 2017

మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు

మాతృభాష ....
మానవుడు పుట్టినప్పటి నుండి సహజంగా (మాతృ
ఒడిలో) నేర్చుకుని మాట్లాడ గలిగే భాష. 
మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా వాటిని
సవ్యంగా అర్ధం చేసుకోవాలంటే మాతృభాష సహకారంతోనే సాద్యం.
మన రెండు రాష్ట్రాల్లో ఎన్నో భాషలు
మాట్లాడేవారు ఉన్నప్పటికీ 90% మంది తెలుగు మాట్లాడేవారే.
కానీ ప్రజలు, పాలకులచే నిరాదరణకు గురై కుమరుగవబోతున్న భాష కూడా తెలుగే. 
ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు
మాధ్యమములోచదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా
తెలియ జెప్పుతున్నాయి.
తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అని
ఆకాశానికెత్తేశారు హాల్డెన్ అనే విదేశీ దొరగారు. ‘సుందర తెనుంగై’ అని
తెగ మెచ్చుకున్నారు తమిళకవి
సుబ్రహ్మణ్యభారతి. తెలుగువాడిగా పుట్టాలన్నా, తెలుగు భాష మాట్లాడాలన్నా
ఎంతో కొంత పుణ్యంచేసుకునుండాలి. పూర్వజన్మ సుకృతం
ఉంటేకానీ, ఆ మహద్భాగ్యం దక్కదు అని నా అభిప్రాయం. 
ఏబీసీడీల వేడికి తెలుగు పలుకుబడి
మాడిమసయిపోకుండా పాలకులు చర్యలు తీసుకోవాలి.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో తెలుగును తప్పనిసరిగా మెదటి భాషగా చేసినప్పుడే తెలుగు మనుగడ సాధ్యం. అలాగైతేనే మన ప్రాచీనమైన భాష శాశ్వతంగా భూమిపై నిలిచి ఉంటుంది.

Saturday, 18 February 2017

వాహన చోదకులారా జర భద్రం


ఎన్నో వాహనాలు వేగంగా వెళ్ళే రహదారుల ప్రక్క నివాసాలు ఉండే వారికి ఎందుకు
భయం ఉండదు. అన్నీ రోడ్లమీదే చేస్తుంటారు. అటూ ఇటూ చూడటం వంటివి
కూడా ఉండవు .
పిల్లలూ రోడ్లమీదే ఆడుకుంటారు. అంట్లు, స్నానాలు, అన్నీ అక్కడే
మద్యాన్నం కాలక్షేపం, రాత్రి నిద్ర అన్నీ రోడ్ల ప్రక్కనే
వాహనాల వాళ్ళే జాగ్రత్తలు పాటించాలి, రోడ్లప్రక్కన నివసించే ప్రజలు కాదు
అనేది రూల్ అని అనుకుంటారా
ఇవన్నీ ప్రక్కన పెట్టినా ఏదైనా ప్రమాదం జరిగినా అదీ వాళ్ళ
పొరపాటుగానే అయినా అక్కడ జరిగే సీన్ వర్ణించలేము.
పొరపాట్లు, పరిస్థితులు, ఏమీ ఉండవు. - ఏకపక్ష నిర్ణయం - బండి
వాడిదే తప్పు - వాడిని అర్జెంటుగా అడ్డంగా పట్టుకొని తన్నేసి ఆనక
తీరిగ్గా విచారించి డబ్బు అయితే డబ్బు, కేసయితే కేస్
కనుక వాహన చోదకులారా జర భద్రం :)
మీరే అక్కడ ఉంటె అందరిలా కాక కొద్దిగా ఆలోచించండి

Monday, 6 February 2017

రైతు ప్రాణానికి విలువ లేదా?

కండ్లెదుటే తమకు
దక్కకుండా పోతున్న తమ సాగు భూమి ఒకవైపు...
30అడుగుల ఎత్తు న గాలిలో ప్రాణాలు మరోవైపు
తన
భూమికి పరిహారం చెల్లించిన
తర్వాతే పనులు కొనసాగించాలన్న ఇద్దరు అనంతపురం  రైతులను 15 నిమిషాల పాటు వైర్లకు వేలాడ దీసిన కర్ణాటక అధికారులను చూస్తే... మనుషుల్లో జంతు ప్రవృత్తీ పూర్తిగా
సమసిపోలేదనిపిస్తుంది. రోజు రోజు కు
జంతు ప్రవృత్తి, ఆటవికం ఎక్కువవుతున్నాయని నా అభిప్రాయం