నేనూ రాయగలను అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకు నాకూ తెలీదు. అంటే నేనేదో గొప్ప రాతగాడినని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ రాతలన్నీ ఒకచోట పెడదామని ఈ బ్లాగు మొదలుపెట్టానంతే.........
Thursday, 10 July 2025
గురుపౌర్ణమి
వేద వ్యాసుని జయంతిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం.
వేదవ్యాసుని గురువుగా పూజించడం ఎందుకంటే
హైందవ ధర్మంలో ఉన్న వేదాలను నాలుగు భాగాలుగా విభజించి,
18 పురాణాలను, మహాభారత భాగవతాలను, బ్రహ్మసూత్రాలను కూడా లిఖించిన
మహాత్ముదు.
ఒక్కమాటలో చెప్పాలంటే హిందూ ధర్మంలో కనిపించే చాలా శాస్త్రాల వెనుక వ్యాసుని కృషి విశేషమైంది.
అందుకే వేదవ్యాసుడిని మనం గురుపౌర్ణమినాడు పూజిస్తూ ఉంటాము.
"గురు" అంటే ఉపదేశకుడు.
ఆధ్యాత్మిక మార్గదర్శకుడు లేదా మోక్షసాధనకు మంత్రం ఉపదేశించేవారు,
విద్యాబుద్ధులు నేర్పే ఆచార్యుల పట్ల కృతజ్ఞత తెలియజేసే పర్వదినమే గురు పౌర్ణమి.
బుద్ధుడు భోదివృక్షం కింద జ్ఞానోదయం సముపార్జించిన తర్వాత
తన శిష్యులకు ధర్మాన్ని బోధించింది కూడా గురుపౌర్ణమి ఈ రోజునే భావిస్తారు.
జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు, తన ముఖ్యశిష్యుని
ఎన్నుకొన్నది కూడా గురుపౌర్ణమి నాడే అని కూడా చెబుతారు!
అలా జైనులు, బౌద్ధులకు కూడా గురుపౌర్ణమి ముఖ్యమైనదే.
షిరిడీ సాయిబాబా ను కూడా గురువుగా భావించి పూజించేవారూ చాలానే ఉన్నారు.
జ్ఞాన, విజ్ఞాన మార్గాలలో గురువు పాత్రను గుర్తించడం, వారిపట్ల కృతజ్ఞతను చాటడం కోసం జరుపుకొనేదే ఈ పండగ.
గురుశిష్యుల ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీకగా కూడా వ్యాసపౌర్ణమిని చాలా పాఠశాలలు, కళాశాలలో నిర్వహిస్తుంటారు
చివరగా...
జీవ జీవనానికి మార్గదర్శకులు, సేవా ధర్మానికి ఆచార్యులను, మత ప్రబోధకులను గురువులుగా భావించినప్పటికీ వారంతా బోధించేది వేదవ్యాస విరచిత ధార్మిక గ్రంథాలనుండి సంగ్రహించినదే కావున వేదవ్యాసుడు ఆదిగురువుగా పూజనీయుడు.
